
మృతిచెందిన సోని
యాచారం: విద్యార్థిని మృతితో మొండిగౌరెల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కట్టెల క్రిష్ణ, పద్మల కుమార్తె సోనీ.. వికారాబాద్ జిల్లా గండీడ్ మండలం నంచర్ల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన సోనీ వాంతులు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో పాఠశాల యజమాన్యం నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం రాత్రే మొండిగౌరెల్లి గ్రామానికి తీసుకొచ్చారు. సోమవారం గ్రామంలో విద్యార్థినికి అంత్యక్రియలు జరిగాయి. గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనపై తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు నంచర్ల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటమ్మ మొండిగౌరెల్లి గ్రామానికి చేరుకుని విద్యార్థిని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయన్ని అందజేశారు.
విద్యార్థిని తల్లిదండ్రులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ప్రిన్సిపాల్ వెంకటమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ప్రవీణ్‌కుమార్ విచారణకు ఆదేశించినట్లు వెంకటమ్మ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment