గర్భిణులు మరణిస్తే కఠిన చర్యలు
-
అధికారులపై కలెక్టర్ ముత్యాలరాజు ఆగ్రహం
నెల్లూరు(పొగతోట):
గ్రామీణ ప్రాంతాల్లో ఇకపై గర్భిణులు మరణిస్తే సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హెచ్చరించారు. మంగళవారం స్థానిక గోల్డన్‌జూబ్లీ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇటివల కాలంలో ఎనిమిది మంది గర్భిణులు మరణించారన్నారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, పౌష్టిక ఆహారం లభించకపోవడంతోనే వారు మరణిస్తున్నారన్నారు. సిబ్బంది తప్పించుకోవడానికి గర్భిణుల మృతికి హార్టు ఎటాక్ తదితర కారణాలు చూపుతున్నారన్నారు. నిరుపేదలకే హార్టు ఎటాకులు వస్తాయా ఇతరులకు రావా అని కలెక్టర్ ప్రశ్నించారు. పీహెచ్‌సీల్లో వైద్య సేవలు, సౌకర్యాలు సక్రమంగా లేనందునే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళుతున్నారని తెలిపారు. పీహెచ్‌సీల్లో సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పకుండా విధులు నిర్వహించాలన్నారు. 3.45 గంటలకు వైద్యాధికారులు, సిబ్బంది లేకపోయినా చర్యలు చేపడతామని హెచ్చరించారు. సీహెచ్‌సీలకు ఇద్దరు వైద్యాధికారులను నియమించాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు. ఒకరు పీహెచ్‌సీలో ఉండి ఓపీ చూడాలన్నారు. మరొక డాక్టర్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి వ్యాధులు తదితరాలను పరిశీలించాలన్నారు. ఇ–హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అన్ని సీహెచ్‌సీలు చేయాలన్నారు. దాని వలన రోగులు ఎంత మంది వస్తున్నారు, గర్భిణులు, హైరిస్క్ గర్భిణులు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతుంటే ఐసీడీఎస్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వరసుందరం, నెల్లూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, డీసీహెచ్‌ఓ డాక్టర్ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సీడీపీఓలు, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.