వాడు మాబిడ్డే.. కాదు మాబిడ్డే.. | Who was that baby? | Sakshi
Sakshi News home page

వాడు మాబిడ్డే.. కాదు మాబిడ్డే..

Published Wed, Aug 24 2016 10:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

వాడు మాబిడ్డే.. కాదు మాబిడ్డే.. - Sakshi

వాడు మాబిడ్డే.. కాదు మాబిడ్డే..

- ప్రసూతి ఆస్పత్రిలో శిశువుల తారుమారు
- ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం
- మగశిశువు తమ బిడ్డేనని ఇరువర్గాల పట్టు

 
హైదరాబాద్: ఆస్పత్రి వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువులను తారుమారు చేయడం.. రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపింది. మంగళవారం సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగయ్య భార్య రమాదేవిని సోమవారం కాన్పుకోసం ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం కడ్తాల్‌కు చెందిన శత్రు భార్య రజిత కూడా కాన్పు కోసం ఇదే ఆస్పత్రిలో చేరింది. రమాదేవి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నర్సులు, ఆయాలు రమాదేవి అని పిలవడంతో ఆమె కుటుంబీకులకు బదులు రజిత పెద్దమ్మ మసూర్ వచ్చి నిలబడింది.

మీ పాపకు మగ శిశువు జన్మించాడని సిబ్బంది ఆమె వద్ద రూ.వెయ్యి తీసుకొని బాబును అందజేశారు. అనంతరం గంట తరువాత రజిత సైతం ప్రసవించింది. అప్పుడు ఆస్పత్రి సిబ్బంది వచ్చి మసూర్ వద్ద ఉన్న మగ శిశువును మీ బిడ్డ కాదని చెప్పి.. రమాదేవి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో రజిత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. తమ కూతురికి పుట్టింది మగ శిశువేనని.. ఆస్పత్రి వర్గాలు తారుమారు చేశాయని ఆరోపిస్తూ సిబ్బందిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇరువర్గాల గొడవ నేపథ్యంలో శిశువులను ఆస్పత్రిలోని చైల్డ్‌వార్డ్‌కు తరలించారు. జంగయ్య, శత్రు, శిశువుల రక్తనమూనాలను ఆస్పత్రి వర్గాలు పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు ఈ సమస్యకు డీఎన్‌ఏ టెస్టే పరిష్కార మార్గమని వైద్యులు భావిస్తున్నారు. కాగా ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పత్తాలేకపోవడంతో రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement