ప్రసూతి రగడ
⇒రాజుకుంటున్న ప్రసూతి ఆస్పత్రి వ్యవహారం
⇒గడువు ముగిసినా ఖాళీ చేయని స్విమ్స్
⇒మండిపడుతున్న ప్రజాసంఘాలు
తిరుపతి మెడికల్:తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రి రగడ రాజుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్‌కు కట్టబెట్టింది. దీన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కార్పొరేట్ వైద్యానికే టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మండిపడుతున్నాయి.
రూ.77 కోట్లతో 300 పడకల ఆస్పత్రి
ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఉంది. ఇక్కడ 150 బెడ్లు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి వందలాది మంది కాన్పుల కోసం వస్తుండడంతో బెడ్ల కొరత ఏర్పడుతోంది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు ప్రసవించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద మహిళల కోసం 300 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. 2012లో రూ.77 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 300 పడకల ప్రసూతి ఆస్పత్రి ఆవిష్కృతమైంది.
ప్రసూతిపై కన్నేసిన స్విమ్స్
టీటీడీ ఆధ్వర్యంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ ప్రసూతి ఆస్పత్రిపై కన్నేసింది. తమకు అనుబంధంగా ఉన్న శ్రీపద్మావతి మెడికల్ కళాశాలో సీట్ల పెంపు, సిబ్బంది నియామకాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రసూతి ఆస్పత్రిని ఇవ్వాలని పాలకులపై ఒత్తిడి తెచ్చింది. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రిని రెండేళ్లపాటు స్విమ్స్‌కు కట్టబెట్టింది. రెండేళ్ల క్రితంరాత్రికిరాత్రే జీవోలు విడుదల చేసింది.
రెండేళ్ల గడువు ముగిసినా..
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పేదలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. గడువు గత ఏడాది డిసెంబర్ నాటికే తీరినా ఇంతవరకు ఖాళీ చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరో రెండేళ్ల వరకు గడువు పొడిగింపునకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..
ప్రస్తుత మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా గత కేంద్ర ప్రభుత్వం రూ.77 కోట్లతో 300 పడకల ఆస్పత్రిని కేటాయించింది. పేద గర్భిణులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం స్విమ్స్‌కు కట్టబెట్టడంతో పేద గర్భిణులకు ఉచితంగా వైద్యం చేసుకునే వెసులబాటు లేకుండా పోయింది. దీనికితోడు రూ.50 ఓపీ తీసుకున్నా కాన్పు సమయంలో కార్పొరేట్ ధరలు వసూలు చేస్తుండడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.