మార్పు ఎక్కడ..? | Thousands of maternal deaths annually | Sakshi
Sakshi News home page

మార్పు ఎక్కడ..?

Published Tue, Jul 22 2014 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

మార్పు ఎక్కడ..?

మార్పు ఎక్కడ..?

ఏటా వేలసంఖ్యలో ప్రసవ మరణాలు
అధికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే..
ఆసుపత్రుల వివరాలు
జిల్లాకేంద్ర ఆసుపత్రి              01
ఏరియా ఆసుపత్రులు           06
పీహెచ్‌సీలు                          85
ఆరోగ్య ఉపకేంద్రాలు            675
క్లస్టర్లు                                  19

పాలమూరు: మాతాశిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా.. ఆచరణలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రతి ఏడాదీ పొత్తిళ్లలోనే వెయ్యిమంది శిశువులు చనిపోతున్నట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా ఏ మాత్రం ‘మార్పు’ కనిపించడం లేదు. గర్భిణులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనే విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రసవ మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ తేడాది ‘మార్పు’ పథకానికి శ్రీకారం చుట్టింది.

అందుకోసంఅంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు బలవర్థకమైన ఆహారం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నెలవారీ పరీక్షలు, టీకాలు ఇస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కింద 2007నుంచి జిల్లాలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. అయినా మాతాశిశు మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలో ఏటా వెయ్యి వరకు శిశుమరణాలు నమోదవుతున్నాయి. మాతృమరణాల్లో మాత్రం 30చొప్పున నమోదవుతున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంలో వైద్యసిబ్బంది విఫలమవుతోంది. గర్భిణులకు, బాలింతలకు తగిన సూచనలు, సలహాలు కూడా అందడం లేదు. పీహెచ్‌సీలకు వస్తున్న వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ.. ఒకరిద్దరు వచ్చినా రికార్డుల్లో పదుల సంఖ్యలో గర్భిణుల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు 25శాతం మంది కూడా రావడంలేదు. సర్కారు వైద్యంపై నమ్మకం లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ఎవ రూ రావడం లేదు.
 
జిల్లాలో స్త్రీ వైద్య నిపుణుల కొరత!
జిల్లావ్యాప్తంగా ఏటా 6.50లక్షల మంది గర్భవతులు.. బాలింతలకు వైద్యసేవలు అందించాల్సి ఉంది. వైద్యశాఖ లెక్కల ప్రకారం ప్రతి 10వేల మందికి ఓ స్త్రీ వైద్య నిపుణులు ఉండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూస్తే జిల్లాలో స్త్రీ వైద్య నిపుణులు 65మంది ఉందాలి. కానీ, జిల్లా వ్యాప్తంగా కేవలం 25మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సర్కారు దవాఖానాల్లో మరో 40మంది స్త్రీ వైద్య నిపుణులను భర్తీ చేయాల్సి ఉంది.
 
‘మార్పు’పై మరింత దృష్టి
మాతాశిశు మరణాలు తగ్గించడానికి మార్పు కార్యక్రమం అమలవుతోంది. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉన్నవారికి లక్ష్యాలు నిర్ధేశిస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్బిణీని తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచిస్తున్నాం. మాతాశిశు మరణాలను నివారించడానికి జిల్లా అధికారుల సూచనలను పాటిస్తున్నాం.
 - సరస్వతి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
 
మరణాలకు కారణాలివే..
జిల్లాలో గర్భిణులకు సేవలందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్త్రీ వైద్యనిపుణులు లేకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందడం లేదు.
మాతాశిశు మరణాల్లో 50 శాతం రక్తహీనతతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యశాఖ అధికారుల అంచనా.
బాల్యంలో పెళ్లిళ్లు, పౌష్టికాహార లోపం తదితర దుష్ర్పభావాలకు గురవుతున్నారు.
ప్రసవ సమయంలో తల్లికి స్త్రీవైద్య నిపుణురాలు, బిడ్డకు పిల్లల వైద్యనిపుణుల సేవలు అవసరం. జిల్లాలో ఈ సేవలు సక్రమంగా అందటంలేదు. సర్కారు ఆస్పత్రుల్లో జన్మిం చిన శిశువులను నేరుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పిల్లల వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement