కడుపు‘కోత’ | Private Hospitals exploitation | Sakshi
Sakshi News home page

కడుపు‘కోత’

Published Wed, Feb 8 2017 3:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

కడుపు‘కోత’

కడుపు‘కోత’

రాష్ట్రంలో అడ్డగోలుగా కాన్పుల దందా

సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రంలో కాన్పుల దందా పరాకాష్టకు చేరుతోంది. కాసులకు కక్కుర్తిపడి ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేకున్నా గర్భిణులకు ఎడాపెడా సిజేరియన్‌ చేసేస్తున్నాయి. ఈ ఆసుపత్రుల దోపిడీ ప్రపంచ స్థాయికి చేరింది. బ్రెజిల్‌ తర్వాత అత్యధికంగా సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతున్న ఆందోళనకర ప్రాంతంగా తెలంగాణ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ రికార్డుల్లోకెక్కింది. బ్రెజిల్‌లో 82 నుంచి 85 శాతం సిజేరియన్‌ కాన్పులు జరుగుతున్నాయి. మనదేశంలో సగటున 15.4 శాతం శస్త్ర చికిత్స ప్రసవాలు జరుగుతుండగా... తెలంగాణలో మాత్రం అత్యధికంగా 58 శాతం సిజేరియన్‌ కాన్పులు జరుగుతున్నాయి.

ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 40.1 శాతంతో రెండోస్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఈ శాతం 10–15 మధ్య ఉండాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వంద మంది గర్భిణుల్లో 74 మందికి ఆపరేషన్లు చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే గర్భిణుల్లో 40 శాతం మందికి ఆపరేషన్లు జరుగుతుండగా.. 60 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతుండటం గమనార్హం. యునిసెఫ్‌తోపాటు సెంటర్‌ ఫర్‌ ఎకానమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) ఇటీవల వివిధ రాష్ట్రాల్లో సంయుక్తంగా సర్వేలు నిర్వహించాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. వీటన్నింటా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో సిజేరియన్‌ డెలివరీలు జరుగుతున్నట్లు సెస్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏకంగా 80 శాతానికిపైగా సిజేరియన్‌ ప్రసవాలే జరుగుతున్నాయి. తర్వాత స్థానాల్లో నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలున్నాయి.

అక్కర లేకున్నా...
తొమ్మిది నెలలు నిండి, తల్లీబిడ్డకు ప్రాణాపాయం ఉన్న సమయంలోనే శస్త్ర చికిత్సలు అనివార్యమవుతాయి. రక్తపోటు ఎక్కువగా ఉండటం, హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉండటం, బిడ్డ అడ్డం తిరగడం, అధిక బరువుతో ఉండటం తదితర పది క్లిష్టమైన పరిస్థితుల్లోనే శస్త్ర చికిత్స ప్రసవాలు చేయాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ అక్కర్లేకుండానే శస్త్ర చికిత్సలు చేసే ధోరణి పెరుగుతోందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన సర్వేల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో సంక్లిష్ట ప్రసవాలుగా నమోదవుతున్న కేసులు కేవలం అయిదు శాతం లోపు ఉంటున్నాయి. కానీ అంతకు పది రెట్లు శస్త్ర చికిత్సలు జరుగుతుండటం విస్మయం కలిగిస్తోంది.

కమీషన్ల వ్యాపారం
గర్భిణులను తమ ఆసుపత్రికి పంపిస్తే కమీషన్లు ఇస్తామంటూ గ్రామస్థాయిలో ఉండే ఆశా వర్కర్లు మొదలు ఏఎన్‌ఎంలు, ఆర్‌ఎంపీ వైద్యులను సైతం ప్రైవేటు ఆసుపత్రులు ఈ దందాలో భాగస్వాములుగా చేశాయి. సాధారణ ప్రసవమే కష్టసాధ్యమని.. గంటల కొద్దీ పురిటి నొప్పుల కంటే సిజేరియన్‌ డెలివరీ సుఖవంతమైందని, క్షణాల్లో అయిపోతుందంటూ గర్భిణులకు సైతం చెప్పి డబ్బులు మూటగట్టుకుంటున్నారు. కొందరు గర్భిణులు పురిటి నొప్పులు భరించటం కంటే వారంతట వారే సిజేరియన్లు చేయించుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. తొలి ప్రసవానికి సిజేరియన్‌ చేస్తే.. ఆ తల్లి రెండో డెలివరీ సైతం విధిగా సిజేరియన్‌ చేయించుకోవాల్సి వస్తుంది. శస్త్ర చికిత్స ప్రసవాలతో భవిష్యత్తులో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, శస్త్రచికిత్స సమయంలో సరైన పద్ధతులు పాటించకపోతే ఇన్ఫెక్షన్లు సోకుతాయని, ఇతర అవయవాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రులు కోట్లు సంపాదించుకుంటుంటే ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్నారు.

దృష్టి సారించిన సర్కారు
సిజేరియన్‌ కాన్పులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కర లేకున్నా ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మరోవైపు కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నియమించిన యునిసెఫ్‌ ప్రతినిధులు ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో సిజేరియన్‌ కాన్పుల శాతాన్ని తగ్గించటంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలీవరిల శాతం పెంచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలో నెలరోజులుగా సాధారణ ప్రసవాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులపై గర్భిణులకు అవగాహన కల్పించే దిశగా ప్రచారం ముమ్మరం చేశారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు విధిగా తమ గ్రామాల్లోని గర్భిణులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి, జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెంట తీసుకెళ్లాలని మెదక్‌ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ జిల్లాలో నెలరోజుల్లో సాధారణ ప్రసవాల శాతం 65 నుంచి 80 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఏటా 1,500 కోట్ల దందా
ప్రైవేటు ఆసుపత్రులు తమ ధనదాహంతో అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నట్టు సర్వేల్లోని గణాంకాలు రూఢీ చేస్తున్నాయి. ఒక్కో ప్రసవానికి కనీసం రూ.20 వేల నుంచి రూ.50 వేల బిల్లు రాబట్టుకునే దురాలోచనతోనే ప్రైవేటు ఆసుపత్రులు సిజేరియన్‌ డెలివరీలను వ్యాపారం గా మార్చేశాయి. కార్పొరేట్‌ ఆసుపత్రు ల్లో అయితే ఈ బిల్లు రూ.లక్ష దాటుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిలో 91 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటున్నారు. సిజేరియన్‌ కాన్పుల ద్వారా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఏడాదికి రూ.1,500 కోట్లపైనే దండుకుంటున్నాయని అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement