స్మితా సబర్వాల్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు జాబితాలో నిజమైన ఓటరును గుర్తించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఎన్నికల జాబితా, దరఖాస్తులపై కలెక్టర్‌సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 23వ తేదీ వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ జాబితాలో ఎటువంటి తప్పులు దొర్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా ఓటరు జాబితాలో నిజమైన ఓటరును గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు దరఖాస్తులను, సవరణకోసం వచ్చిన వాటిని సంబంధిత అధికారులంతా ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, తుది జాబితాను ఈనెల 16వ తేదీన విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ శరత్, డీఆర్‌ఓ సాయిలు, ఆర్‌డీఓలు ధర్మారావు, వనజారెడ్డి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
ప్రసవాల సంఖ్య పెంచాలి
‘మార్పు’లోని 20 అంశాలపై చర్చ జరిగినప్పుడే క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ స్మితాసబర్వాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో మార్పు, సన్నిహిత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత క్లస్టర్ ప్రత్యేక అధికారులు, సీడీపీవోలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఏపీవో, ఐకేపీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేలా వీవోల సమావేశాలలో చర్చిస్తూ ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లకు వీటిపై విస్తృత అవగాహన, శిక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు. క్రమ శిక్షణ అతిక్రమించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన నిరుపేదలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వస్తే ఎన్‌ఆర్‌ఈజీఎస్ అమలు కాని ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా జాబ్‌కార్డులను జారీ చేసి నిర్మించుకునేలా ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని ఈ లోపు అర్హులను గుర్తించాలని ప్రత్యేక అధికారి జెడ్పీ సీఈవో ఆశీర్వాదంకు జేసీ డాక్టర్ శరత్ సూచించారు.