ఇదీ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య
పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925కి పెరిగింది. వీరిలో 1,68,67,735 మంది మహిళలు, 1,66,41,489 మంది పురుషులు, 2,829 మంది ట్రాన్స్‌జెండర్లు, మరో 15,872 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025లో భాగంగా తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు.
కొత్తగా 2,19,610 ఓటర్లను జాబితాలో చేర్చగా, మరో 1,17,932 ఓటర్లను తొలగించారు. 2024 ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నారు. 2024తో పోల్చుకుంటే–2025లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ
పోలింగ్ కేంద్రాల వారీగా 119 శాసనసభ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను వెబ్‌సైట్ (https://ceotelangana.nic.in)లో ఉంచినట్టు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టు ద్వారా ఇళ్లకు ఉచితంగా పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు, వివరాల దిద్దుబాటు నిరంతర ప్రక్రియ అని, ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (https://voters.eci.gov.in)లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు సైతం ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారిని18 ఏళ్లు నిండిన తర్వాత జాబితాలో చేర్చుతామని వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, ప్రవాస ఓటర్లకు ఫారం–6ఏ, స్వచ్ఛందంగా ఆధార్ వివరాలు ఇవ్వడానికి ఫారం–6బీ, ఓటర్ల తొలగింపు కోసం ఫారం–7, వివరాల దిద్దుబాటు/నవీకరణ కోసం ఫారం–8 ఉపయోగించాలని చెప్పారు.
పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,356 నుంచి 35,907కి పెరిగింది. పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 14,464 నుంచి 14,750కి, గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,892 నుంచి 21,157కి పెరిగింది. మొత్తం 551 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కానుండగా, అందులో 286 పట్టణ, 265 గ్రామీణ పోలింగ్ కేంద్రాలున్నాయి.
90 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ
రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. కేవలం 29 స్థానాల్లోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని చోట్లా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment