ఓటర్ల జాబితా సవరణ– 2025లో భాగంగా గుర్తింపు
సీఈఓ సి.సుదర్శన్‌రెడ్డి వెల్లడి
అక్టోబర్ 29 నుంచి కొత్త ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్‌ఎస్‌ఆర్) 2025లో భాగంగా రాష్ట్రంలో 4,85,729 మంది ఓటర్ల పేర్లు, ఇతర సమాచారం ఒకే రీతి(సిమిలర్ ఎంట్రీ)లో ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
ఒకే నియోజకవర్గం ఒకే పార్ట్ పరిధిలో 52,586 మంది, ఒకే నియోజకవర్గం వేర్వేరు పార్ట్‌ల పరిధిలో 1,10,994 మంది, వేర్వేరు నియోజకవర్గాల పరిధిలో 3,22,149 మంది ఇలాంటి ఓటర్లున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 21,432 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగించామని చెప్పారు.
బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన నిర్వహిస్తున్నారని, గత నెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో 3,33,11,347 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 70,60,288 (21.19 శాతం) మంది ఓటర్లను గుర్తించి నిర్ధారించినట్టు తెలిపారు. 10,224 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని, 23,220 మంది వలస వెళ్లారని, 21,465 మంది చనిపోయారని, 12,763 మంది ఫొటోలు సరిగ్గా లేవని, 5,677 మందికి రెండు ఓట్లున్నట్టు గుర్తించినట్టు సీఈఓ తెలిపారు.
జనవరి 6న తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నాటి నుంచి నవంబర్ 28 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖా స్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 2025 జనవరి 1కి కనీసం 18 ఏళ్లు కలిగి ఉండేవారు ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
డిసెంబర్ 24లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సైతం ఒక పర్యాయంలో 10 దరఖాస్తులు, అభ్యంతరాలు చొప్పున 3 పర్యాయాల్లో 30 దరఖాస్తులు, అభ్యంతరాలను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమరి్పంచవచ్చునని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment