State Chief Electoral Officer
-
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
ఆ వీడియో లీక్ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవో
సాక్షి, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆ వీడియో తమ నుంచి బయటకు వెళ్లలేదని గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు మీనా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అనుమతిస్తే రేపు వేరే పార్టీ వాళ్లు వెళ్తామంటారని, అందుకే బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లనీయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లువచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టు వివరించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఏ రోజు, ఎన్ని గంటలకు ఎన్నిటేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందో రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కింపుస్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తరువాతనే ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్లో ఎప్పటి కప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేనివారిని, అనధికార వ్యక్తులను, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతున్నదని, స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరీంధర ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
Telangana: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. గత మే 23 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మరో వారంలో తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈవీఎంలన్నింటికీ ప్రాథమిక స్థాయి తనిఖీలతోపాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేశామన్నారు. శాసనసభ ఎన్నికల కవరేజీ కోసం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించి పరిశీలిస్తారని, బ్యాలెట్ పత్రాల ముద్రణ తర్వాత ఈవీఎంలకు ద్వితీయస్థాయి తనిఖీల(ఎస్ఎల్ఎఫ్)ను నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొలి వారంలో వచ్చే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని బదులిచ్చారు. జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటుందని వికాస్‌రాజ్ చెప్పారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించి శిక్షణ ఇస్తామని తెలిపారు. నిబంధనల మేరకు ర్యాంపులు, విద్యుదీకరణ, టాయిలెట్లు వంటి కనీస సదుపాయాలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉన్నాయా? లేవా? అని పరిశీలించామని, సదుపాయాలను కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. కేంద్ర బలగాలకు వసతి, రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు ఎంత మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు గత జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని, వీరిలో 6.99 లక్షల మంది 18–19 ఏళ్ల యువ ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. లక్ష మంది దివ్యాంగ ఓటర్లను గుర్తించామన్నారు. 80 ఏళ్లుపైబడిన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్ పర్యటించనుందని ఆయన తెలిపారు. కమిషన్ రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీ, 20కి పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటికే నివేదికలు తమకు అందుతున్నాయన్నారు. ఓటరు నమోదు కోసం.. ఓటర్ల జాబితాతో సహా ఇతర అంశాలపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి ఫిర్యాదుదారులకు సైతం నివేదిక ప్రతిని అందజేస్తున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 700 బృందాలు నాలుగు వేలకు పైగా ఇళ్లను సందర్శించి చిరునామా మారిన ఓటర్ల తొలగింపును చేపట్టారని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్‌కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. -
కౌంటింగ్ లో ఎలాంటి అవకతవకలు లేవు : ఈసీ
-
ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ.. అమల్లోకి నూతన మార్గదర్శకాలు..
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు సోమవారం అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 30న జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రజాప్రాతి నిధ్య చట్టం 1950లో సవరణలు చేసినట్లు చెప్పారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 23 ప్రకా రం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓట ర్లుగా నమోదు కావాలనుకునేవారు వచ్చే మార్చి నెలాఖరుకల్లా ఆధార్ సంఖ్యను పొందుపర్చాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి, జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటమే ఆధార్ సంఖ్య సేకరణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరును సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగిం చటం ఉండదని స్పష్టం చేసారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారమ్ 6 బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్ సైట్లలో నూతన దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు. 6బి దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చని చెప్పారు. ఎన్వీఎస్పీ, ఓటర్ల హెల్ప్‌లైన్ యాప్‌ని అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యూఐడీఐఏతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబరు ఓటీపీని ఉపయోగించి ఆధార్‌ను ప్రామాణీకరించవచ్చని తెలిపారు. మరో వైపు బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుండి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆధా ర్ నంబరు ఇవ్వలేని ఓటర్లు ఫారం 6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయపత్రాలలో ఏదైనా ఒకటి సమ ర్పించాలని చెప్పారు. ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వ హణలో జాగ్రత్తలు తీసుకుంటారని, ఇది జన బాహుళ్యంలోకి వెళ్లదని తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు సురక్షితమైన కస్టడీలో ఉంటాయని, యూఐడీఏఐ నిబంధనలకు అనుగుణంగా భద్రత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ విడుదల నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డెప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, స్వీప్ కన్సల్టెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉప ఎన్నికకు ఏర్పాట్లు కట్టుదిట్టం
సాక్షి, అమరావతి: పటిష్టమైన నిఘాతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి ► కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకూడదు. నామినేషన్లకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి. ► బహిరంగ సమావేశాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఆ సమయంలో ఒక్కో అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతిస్తారు. ► రెండు డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజంట్లుగా పెట్టుకోవాలి. ఇదే నిబంధన పోలింగ్ సిబ్బందికీ వర్తిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. శానిటైజ్ చేయడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ సౌకర్యం ఉంటుంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. నిరంతర పర్యవేక్షణ ► వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్టు, చెక్ పోస్టుల ద్వారా నిశిత తనిఖీలు ఉంటాయి. ► ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘాకు 8 టాస్కు ఫోర్సు బృందాలు, 21 ప్లైయింగ్ స్క్వాడ్లు, 3 వీడియో వ్యూయింగ్ బృందాలు, 4 ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశాం. ► మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 140 చోట్లకు పైగా లైవ్ టెలికాస్టు ద్వారా ఎన్నిక నిశిత పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నాం. ► ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశాం. 1950కు ఫోన్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వికలాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుండి ఐదు రోజుల్లోపు 12–ఈ ఫార్ములాలో దరఖాస్తు చేసుకోవాలి. బద్వేలు నియోజకవర్గంలో 80 ఏళ్లుపై బడిన వృద్ధులు 3,837 మంది, వికలాంగులు 3,902 మంది ఓటర్లుగా ఉన్నారు. ► 2,16,164 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే అక్టోబర్ 8 లోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఓటు వేయొచ్చు. మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 30 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. -
బద్వేలు ఉప ఎన్నికకు సహకరించండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు. గురువారం ఆయన సచివాలయంలోని తన చాంబరులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నిక నిర్వహణలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 28న షెడ్యూల్ జారీ చేసిందని తెలిపారు. తద్వారా ఆ రోజు నుండి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుది గడువు అని, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు తుది గడువు అని చెప్పారు. అక్టోబర్ 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మొత్తంగా నవంబర్ 5వ తేదీ లోపు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి జోగి రమేష్, టీడీపీ నుంచి వర్ల రామయ్య, బీజేపీ నుంచి వెన్న హేమంత్ కుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ఇప్పటికి 2,16,154 మంది ఓటర్లు ► ఈ ఏడాది జనవరి 15న నాటికి ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. తర్వాత సెప్టెంబర్ 29 నాటికి నమోదు చేసుకున్న ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుని మొత్తం 2 లక్షల 16 వేల 154 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఈ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ► అయితే అక్టోబర్ 8వ తేదీలోగా ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్న వారు కూడా ఈ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తాం. నియోజకవర్గం పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా మరో తొమ్మిది ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశాం. ► ఈ ఉప ఎన్నికలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఈ ఉప ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ► సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ యాంటిసిడెంట్స్ (నేర చరిత్ర)ను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ముందుగానే ప్రచురించాల్సి ఉంది. కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరి ► కోవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలి. ఈ మేరకు ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ర్యాలీలు, ఉత్సవాలు నిషేధం. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు.. స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, డోర్ టు డోర్ ప్రచారానికి ఐదుగురు, మొత్తంగా 20 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ► రోడ్ షోలు నిర్వహించకూడదు. పోలింగ్‌కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలి. 2 డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలి. ఉప ఎన్నికల నిర్వహణలో వలంటీర్ల ప్రమేయం ఉండదు. -
ఈవీఎంలకు ‘స్ట్రాంగ్’ భద్రత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ల భద్రత, తరలింపు వంటి అంశాల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కండ్లకోయ గ్రామంలో ఉన్న ఏఎంసీ గోదాంను రాష్ట్ర స్థాయిలో కేంద్ర గోదాంగా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడికి తీసుకువచ్చే, ఇక్కడి నుంచి తీసుకుపోయే ఈవీఎంల కదలికలు, ఇక్కడ ఉంచిన వాటికి భద్రత కల్పించడం వంటి విషయాలపై ఎప్పటికప్పడు రాజకీయ పార్టీలకు తగిన సమాచారం అందిస్తామన్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఈ కింది నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కేటగిరి–ఏ: ఓట్లతో నిండిన ఈవీఎంలను పోలింగ్ ముగిసిన తరువాత నిబంధనల పాటిస్తూ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలి. కేటగిరి–బీ: కొన్ని ఓట్లు పోలైన తరువాత లోపాల కారణంగా తొలగించిన ఈవీఎంలను తగిన విధివిధానాలను పాటించిన తరువాత కేటగిరీ–ఏ ఈవీఎంతో పాటే, విడిగా భద్రపరచాలి. కేటగిరి–సీ: పోలింగ్ ప్రారంభానికి ముందే లోపాలు బయటపడి తొలగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా వేరే గదిలో భద్రపరచాలి. తరువాత తగిన విధివిధానాలు అనుసరించి వాటిని సంబంధిత తయారీదారుకు తిప్పి పంపాలి. కేటగిరి–డీ: ముందు జాగ్రత్త కోసం అదనంగా తెప్పించి, పోలింగ్‌కు అసలు ఉపయోగించకుండా సెక్టార్/జోనల్/ ఏరియా మేజిస్ట్రేట్ దగ్గర రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా విడిగా మరో గదిలో భద్రపరచాలి. మూడంచెల భద్రత... ఈవీఎంలను ఉంచిన ప్రదేశం చుట్టూ తొలి భద్రతావలయంగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సీపీఎఫ్) రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాయి. దాని తర్వాత భద్రతా వలయంగా రాష్ట్ర సాయుధ దళం కాపలా కాస్తుంది. ఆ రెండింటి చుట్టూ ఉన్న ప్రాంత వలయాన్ని జిల్లా ఎగ్జిక్యూటివ్ దళం కనిపెట్టుకుని ఉంటుంది. ఓట్లతో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కనీసం ఒక ప్లటూన్ ఉంటుంది. పరిశీలకులు లేదా జిల్లా ఎన్నికల అధికారులు లేదా పోలీస్ సూపరింటెండెంట్లు లేదా వారి ప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులతో సహా ఎవరైనా తొలి భద్రతా వలయంలోకి వెళ్లిరావాలంటే దానికి తగిన నియమాలను తప్పకుండా పాటించాలి. రెండో (మధ్య) భద్రతా వలయం దాటే వారి పేరు, తేదీ, సమయం, వ్యవధి అన్నీ కేంద్ర బలగాలు నిర్వహించే లాగ్ బుక్‌లో వివరంగా పేర్కొనాలి. ఇటువంటి సందర్శనలను వీడియోగా చిత్రీకరించడానికి కేంద్ర బలగాలకు తగిన పరికరాలు ఇవ్వాలి. స్ట్రాంగ్ రూమ్ సందర్శించాలనుకునే అభ్యర్థుల ఏజంట్లను సీసీటీవీ ద్వారా చూడటానికి అనుమతించవచ్చు. దీనిని కూడా లాగ్ బుక్‌లో నమోదు చేయాలి. స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ పద్ధతి ఉండాలి. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, మరొకటి సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలూ ఒక కంట్రోల్ రూమ్ పని చేస్తుండాలి. ఒక పోలీస్ అధికారితో పాటూ, ఒక గెజిటెడ్ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండాలి. స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లడానికి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉండాలి. అగ్నిమాపక దళం తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతకు, ప్రొటోకాల్ అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యులు. రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజూ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని అంతర్ వలయం (తొలి వలయం) వరకు ఉదయం, సాయంత్రం వెళ్లి లాగ్ బుక్‌ను, వీడియో చిత్రీకరణను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలి. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంగణంలోకి ఏ అధికారి, మంత్రి లేదా మరే ఇతర రాజకీయ నాయకులకు చెందిన వాహనాలను అనుమతించ కూడదు. ఓట్ల లెక్కింపు జరిగే రోజున, అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఆర్ఓ, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో స్ట్రాంగ్ రూమ్‌ను తెరవాలి. ఈవీఎంలను కౌంటింగ్ కోసం బయటికి తీయడం, అది ముగిసిన తరువాత తిరిగి వాటిని తీసుకొచ్చి అక్కడ భద్రపరిచే కార్యక్రమాన్నంతా పూర్తిగా వీడియో తీయాలి. కౌంటింగ్ ముగిసిన తరువాత నిబంధనల ప్రకారం ఈవీఎంలను (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు), వీవీప్యాట్లను సీల్ వేసి భద్రపరచడానికి తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చాలి. అభ్యర్థులకు.. ఎన్నికల సంఘానికి చెందిన సీఈఓ, అదనపు సీఈఓ, డీఈసీ ఇన్చార్జీలు, సంబంధిత డీఈఓ, ఎస్పీ, సీఓపీ, ఆర్ఓ ఫోన్ నంబర్లు ఇవ్వాలి. ఈ నియమనిబంధనల ప్రతులను అభ్యర్థులందరికీ, డీఈఓలకు, ఆర్ఓలకు, కేంద్ర బలగాల కమాండెంట్‌కు అందచేయాలి. -
నియమావళి ఉల్లంఘించే అధికారులపై వేటు
సాక్షి, అమరావతి: ఎవరైనా అధికారులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా చట్టపరంగా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఎన్నికల నియమావళి పార్టీలకు మాత్రమే కాదని, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ అధికారులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేకపోతే ఎన్నికలు ప్రశాంతంగా జరపలేమని, ఇందుకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించేలా అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. పోటీ చేసే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీసీ)పనిచేస్తోందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్‌పై నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలకు ఇప్పటికే 89 నోటీసులు జారీ చేశామన్నారు. ఇందులో భాగంగానే టీడీపీకి 48, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30, జనసేన పార్టీకి 11 నోటీసులు ఇచ్చామని చెప్పారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు తప్పు చేసినట్లు కాదని, వారిచ్చే సమాధానాలకు సంతృప్తి కలిగితే ఆ పార్టీలపై ఎటువంటి చర్యలూ ఉండవన్నారు. వారిచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే, అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నామినేషన్ల పర్వం ముగిసిన నాటి నుంచి అభ్యర్థుల వారీగా సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తామన్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే కథనాలు, ప్రకటనలపై ముందుగా నోటీసులిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ఓటర్ల ప్రలోభాలకు గురిచేసేలా పోస్టింగ్‌లు పెట్టిన వారిని ముందుగా హెచ్చరిస్తామన్నారు. అయినప్పటికీ మార్పు రాకపోతే జరిమానా విధించడం లేదా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే ఈ రెండింటినీ కూడా అమలు చేస్తామని ద్వివేది హెచ్చరించారు. రాష్ట్రంలో 3,635 ‘సీ విజిల్స్’ బృందాలు.. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 3,635 సీ విజిల్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సీ విజిల్స్ ద్వారా ఇప్పటి వరకు 1,304 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. ముఖ్యంగా పోస్టర్లు, బ్యానర్లు, గిఫ్టులు, డబ్బు, మద్యం పంపిణీ, మత, కులపరమైన ప్రచారాలు, ప్రచార సభలకు జనాల తరలింపు, లౌడ్ స్పీకర్ల వాడకం, వంటి వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు సంబంధించి అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎంసీసీ కమిటీలు ఏర్పాటు చేశామని ద్వివేది చెప్పారు. తనిఖీల్లో భారీగా నగదు సీజ్.. రాష్ట్రంలో పలు చోట్ల చేపట్టిన సోదాల్లో భారీగా నగదు, మద్యాన్ని పట్టుకున్నట్లు దివ్వేది తెలిపారు. పోలీస్, కమర్షియల్ టాక్స్, ఇన్కమ్ టాక్స్, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసుల ఆధ్వర్యంలోని ఫ్లయింగ్ స్క్వాడ్లు రూ. 2,39,89,135 సీజ్ చేసి 8.26 కిలోల బంగారం, 22 కిలోల వెండి, 1,043 మద్యం బాటిళ్లు, రెండు వాహనాలు, 33 కేజీల గంజాయి, 324 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీంల ద్వారా రూ.7,51,30,981, 128.16 కేజీల బంగారం, 18.46 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల ద్వారా రూ.2,69,35,920 పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ అధికారులు రూ.7.35 కోట్ల విలువ చేసే 2 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఏప్రిల్ 5వ తేదీ లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు.. కొత్త ఓటర్లకు ఏప్రిల్ 5వ తేదీలోగా గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తామని ద్వివేది చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. జనవరి 11వ తేదీ నుంచి 15 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. కొత్తగా మరో 10 లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఓటర్ల నమోదు కోసం వచ్చిన ఫారం–6 ద్వారా వచ్చిన 10,62,441 దరఖాస్తులు ఇంకా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. వాటిని కూడా ఈ నెల 25వ తేదీలోగా పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. 1.55 లక్షల ఓట్ల తొలగింపు.. రాష్ట్రంలో 1,55,099 డెత్, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వాటిని జాబితా నుంచి తొలగించామని ద్వివేది వెల్లడించారు. మార్చి 10వ తేదీ తరువాత ఓటర్ల లిస్టులో పేర్ల తొలగింపు నిలిపేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.84 కోట్ల ఓటర్లున్నారని, ఆ సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 23,24 తేదీలు సెలవు రోజులైనందున ఆ తేదీల్లో మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఉండదని, ఈ నెల 21వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తామని ద్వివేది తెలిపారు. అడిషనల్ సీఈవోలు వివేక్ యాదవ్, సుజాత శర్మ, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
మే నెలలో ఎన్నికలకు అవకాశం
పార్వతీపురం: రాష్ట్రంలో మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా తెలిపారు. సోమవారం రాత్రి విజయనగరం జిల్లా పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక సబ్‌కలెక్టర్ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ..మార్చిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈవీఎంలపై అపోహలు తొలగించేందుకు జనాన్ని చైతన్యపరచనున్నట్లు వివరించారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో పరిపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని... ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పక్షపాత రహితంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో భారీగా ఓటర్లను తొలగించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తానన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శిగా బిజీగా ఉండటంతో బాధ్యతలు చేపట్టేందుకు ఆలస్యమైందని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటివరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు. -
పకడ్బందీగా మెదక్ ఉప ఎన్నిక: భన్వర్‌లాల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల నిర్వహణే అత్యంత సవాలుతో కూడుకున్నదని, ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కోరారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని అమలు చేస్తామని భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశాన్ని ఈసారి రాజకీయ పక్షాలకు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. -
16లోగా నివేదికలు పంపించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నివేదికలను ఈనెల 16వ తేదీ లోగా పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన 9 కమిటీల నివేదికలను అత్యంత ప్రాధాన్యమైనవిగా భావించి ఈనెల 16లోగా పంపించాలన్నారు. ఎన్నికల్లో ఎన్సీసీవైలేషన్, ఎఫ్‌ఐఆర్‌బుక్ చేసిన వివరాలు, పెయిడ్ న్యూస్ వివరాలు, వీడియో ఫు టేజీ, ఖర్చులు, ఆర్టీఐయాక్ట్ వివరాలను విధిగా సమర్పించాలని సూ చించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని కూడా ఈ నెల 16లోగా సంబంధిత ఆర్ఓలకు సమర్పించేందుకు గాను అవసమైతే వారికి ఓరియంటేషన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల నిర్వహణలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నట్లయితే వాటిని డాక్యుమెంటేషన్ చేసి పంపించాలన్నారు. 60 మంది అభ్యర్థులు మాత్రమే వివరాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 5 ఫార్మాట్ల సమాచారం ఇప్పటికే పంపించామన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించేందుకు వీలుగా ఈనెల 10వ తేదీన ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలి పారు. జిల్లాలో 183 మంది ఎన్నికల్లో పోటీచేయగా అందులో 60 మంది తమ ఎన్నికల వ్యయం వివరాలను సమర్పిం చారన్నారు. జిల్లాలో ఈవీఎంల విని యోగంపై 2,3 దఫాలలో శిక్షణ ఇచ్చామని అందువల్ల ఎక్కడ కూడా ఈవీఎం సమస్య తలెత్తలేదన్నారు. కేవ లం నాలుగు చోట్ల మాత్రమే ఈవీఎంలను మార్పు చేసినట్లు చెప్పారు. ఈవీఎంలపై జిల్లా స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో పూర్తి శిక్షణ ఇవ్వడం వల్ల ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినపుడు స్వతంత్ర అభ్యర్థులకు ఒకేరకమైన గుర్తులు కేటాయించడం వల్ల కొన్ని ఇబ్బందులు జరి గాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు పార్లమెంటు, అసెంబ్లీలకు పోటీచేసే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఒకే రకమైన గుర్తులు కేటాయించవద్దని ప్రధాన ఎన్నికల అధికారికి కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.