సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు. గురువారం ఆయన సచివాలయంలోని తన చాంబరులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నిక నిర్వహణలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 28న షెడ్యూల్ జారీ చేసిందని తెలిపారు. తద్వారా ఆ రోజు నుండి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుది గడువు అని, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు తుది గడువు అని చెప్పారు. అక్టోబర్ 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మొత్తంగా నవంబర్ 5వ తేదీ లోపు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నుంచి జోగి రమేష్, టీడీపీ నుంచి వర్ల రామయ్య, బీజేపీ నుంచి వెన్న హేమంత్ కుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
ఇప్పటికి 2,16,154 మంది ఓటర్లు
► ఈ ఏడాది జనవరి 15న నాటికి ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. తర్వాత సెప్టెంబర్ 29 నాటికి నమోదు చేసుకున్న ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుని మొత్తం 2 లక్షల 16 వేల 154 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఈ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
► అయితే అక్టోబర్ 8వ తేదీలోగా ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్న వారు కూడా ఈ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తాం. నియోజకవర్గం పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా మరో తొమ్మిది ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశాం.
► ఈ ఉప ఎన్నికలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఈ ఉప ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్నారు.
► సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ యాంటిసిడెంట్స్ (నేర చరిత్ర)ను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ముందుగానే ప్రచురించాల్సి ఉంది.
కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరి
► కోవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలి. ఈ మేరకు ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ర్యాలీలు, ఉత్సవాలు నిషేధం.
► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు.. స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, డోర్ టు డోర్ ప్రచారానికి ఐదుగురు, మొత్తంగా 20 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
► రోడ్ షోలు నిర్వహించకూడదు. పోలింగ్‌కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలి. 2 డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలి. ఉప ఎన్నికల నిర్వహణలో వలంటీర్ల ప్రమేయం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment