సాక్షి, అమరావతి: పటిష్టమైన నిఘాతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే..
కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి
► కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకూడదు. నామినేషన్లకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి.
► బహిరంగ సమావేశాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఆ సమయంలో ఒక్కో అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతిస్తారు.
► రెండు డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజంట్లుగా పెట్టుకోవాలి. ఇదే నిబంధన పోలింగ్ సిబ్బందికీ వర్తిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. శానిటైజ్ చేయడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ సౌకర్యం ఉంటుంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి.
నిరంతర పర్యవేక్షణ
► వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్టు, చెక్ పోస్టుల ద్వారా నిశిత తనిఖీలు ఉంటాయి.
► ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘాకు 8 టాస్కు ఫోర్సు బృందాలు, 21 ప్లైయింగ్ స్క్వాడ్లు, 3 వీడియో వ్యూయింగ్ బృందాలు, 4 ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశాం.
► మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 140 చోట్లకు పైగా లైవ్ టెలికాస్టు ద్వారా ఎన్నిక నిశిత పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నాం.
► ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశాం. 1950కు ఫోన్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
వికలాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్
► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుండి ఐదు రోజుల్లోపు 12–ఈ ఫార్ములాలో దరఖాస్తు చేసుకోవాలి. బద్వేలు నియోజకవర్గంలో 80 ఏళ్లుపై బడిన వృద్ధులు 3,837 మంది, వికలాంగులు 3,902 మంది ఓటర్లుగా ఉన్నారు.
► 2,16,164 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే అక్టోబర్ 8 లోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఓటు వేయొచ్చు. మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 30 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం.
ఉప ఎన్నికకు ఏర్పాట్లు కట్టుదిట్టం
Published Sat, Oct 2 2021 6:45 AM | Last Updated on Sat, Oct 2 2021 6:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment