Badvelu
-
తల్లి పాడు పని.. కూతురు మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి..
బద్వేలు అర్బన్(వైఎస్సార్ జిల్లా): తన వివాహేతర సంబంధం గురించి మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి సొంత కూతురినే ఓ తల్లి అంతమొందించింది. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపి హత్య అని తేల్చారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చదవండి: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ ఎంట్రీతో రెండో పెళ్లికి రెడీ! బద్వేలు మండల పరిధి లోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన గానుగపెంట వెంకటయ్య, రమణమ్మల కుమార్తె వెంకటసుజాత. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదివింది. రమణమ్మ తమ గ్రామానికి చెందిన గానుగపెంట శ్రీను అలియాస్ శీనయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన వెంకటసుజాత తల్లిని మందలించింది. దీంతో రమణమ్మ కుమార్తెను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడు శ్రీను, సమీప బంధువైన ఆటోడ్రైవర్ మేకల మల్లెంకొండయ్యతో కలిసి పథకం పన్నింది. అందరూ కలిసి గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న వెంకట సుజాత గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. తర్వాత మల్లెంకొండయ్యకు చెందిన ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడేసి వచ్చారు. తర్వాత సుజాత కనిపించడం లేదని, తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అందరిని నమ్మించారు. పోలీసులకు అదే ప్రకారం ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత గ్రామ శివారులోని బావిలో సుజాత మృతదేహం లభ్యమైంది. అయితే తండ్రి ప్రవర్తన నచ్చక వెంకటసుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. అటు తర్వాత కేసును పకడ్బందీగా విచారించి మిస్టరీని ఛేదించారు. కేసు విచారణలో చురుగ్గా వ్యవహరించిన అర్బన్ సీఐ రామచంద్ర, ఎస్ఐ వెంకటరమణలను జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌లు అభినందించారు. -
ఉప ఎన్నికకు ఏర్పాట్లు కట్టుదిట్టం
సాక్షి, అమరావతి: పటిష్టమైన నిఘాతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి ► కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకూడదు. నామినేషన్లకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి. ► బహిరంగ సమావేశాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఆ సమయంలో ఒక్కో అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతిస్తారు. ► రెండు డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజంట్లుగా పెట్టుకోవాలి. ఇదే నిబంధన పోలింగ్ సిబ్బందికీ వర్తిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. శానిటైజ్ చేయడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ సౌకర్యం ఉంటుంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. నిరంతర పర్యవేక్షణ ► వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్టు, చెక్ పోస్టుల ద్వారా నిశిత తనిఖీలు ఉంటాయి. ► ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘాకు 8 టాస్కు ఫోర్సు బృందాలు, 21 ప్లైయింగ్ స్క్వాడ్లు, 3 వీడియో వ్యూయింగ్ బృందాలు, 4 ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశాం. ► మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 140 చోట్లకు పైగా లైవ్ టెలికాస్టు ద్వారా ఎన్నిక నిశిత పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నాం. ► ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశాం. 1950కు ఫోన్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వికలాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుండి ఐదు రోజుల్లోపు 12–ఈ ఫార్ములాలో దరఖాస్తు చేసుకోవాలి. బద్వేలు నియోజకవర్గంలో 80 ఏళ్లుపై బడిన వృద్ధులు 3,837 మంది, వికలాంగులు 3,902 మంది ఓటర్లుగా ఉన్నారు. ► 2,16,164 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే అక్టోబర్ 8 లోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఓటు వేయొచ్చు. మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 30 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. -
బద్వేలులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, బద్వేలు: వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మండపంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని కళ్యాణ మండపం నిర్వాహకులు చెబుతున్నారు. -
భార్యాభర్తలపై దాడి..కేసు నమోదు
-
భార్యాభర్తలపై టీడీపీ నేత దాష్టికం
బద్వేలు అర్బన్: పట్టణంలోని తెలుగుగంగకాలనీలో నివసిస్తున్న భార్యాభర్తలపై శుక్రవారం ఓ స్థలవివాదంలో అధికారపార్టీకి చెందిన నేతతో పాటు మరికొందరు దాడిచేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుగంగకాలనీలో నివసిస్తున్న తుమ్మలూరుసరస్వతి, వీరభాస్కర్‌రెడ్డిలు ఇంటిలో ఉండగా మధ్యాహ్నం సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న స్థలంలో ట్రాక్టర్‌తో రాళ్లు తోలుతుండగా సరస్వతి అడ్డుకుంది. ఈ స్థలంపై కోర్టులో కేసు నడుస్తోందని, ఇక్కడ రాళ్లు ఎలా తోలుతారని ప్రశ్నించి అక్కడి నుంచి ట్రాక్టర్లను పంపించింది. విషయం తెలుసుకున్న అధికారపార్టీకి చెందిన గోడిరమణారెడ్డి తన అనుచరులైన బత్తల వెంకటేశ్వర్లు, మరికొందరితో కలిసి అక్కడికి చేరుకుని అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ నేను చేపట్టే పనిని అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉందంటూ సరస్వతిపై దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆమె భర్త వీరభాస్కర్‌రెడ్డిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భార్యాభర్తలు ఇరువురు పోలీసుస్టేషన్‌కు చేరుకుని గొడవకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలను చూపించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై పట్టణ పోలీసుస్టేషన్లో రమణారెడ్డి, మరికొందరిపై కేసు నమోదు చేశారు. -
బతుకుదెరువు కోసం వెళ్లి .. అనంత లోకాలకు
వారిరువురు రైతు బిడ్డలు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుండేవారు. కానీ వరుస కరువులతో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చుకునేందుకు కువైట్‌కు వెళ్లారు. కష్టపడి పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో విధి చిన్నచూపు చూసింది. బతుకుదెరువు కోసం వెళ్లిన దేశంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వైఎస్ఆర్ జిల్లా , బద్వేలు అర్బన్ : బద్వేలు మండలం గొడుగునూరు గ్రామానికి చెందిన చెన్నుపల్లె శ్రీనివాసులరెడ్డి (41) రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. ఈయనకు భార్య రమాదేవితో పాటు సుమ అనే కుమార్తె ఉన్నారు. కువైట్‌లోని ఖైతాన్‌లో నివసిస్తుంటాడు. అలాగే బద్వేలు మండలం చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన పోకల మల్లేశ్వర్‌రెడ్డి (40) నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. ఆయనకు భార్య ప్రమీలతో పాటు హర్షవర్దన్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతులు ఇద్దరిది ఒకే మండలం కావడంతో పాటు ఒకే పని (రాడ్‌బెండింగ్) చేస్తుండటంతో ఖైతాన్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం ఉదయం వీరు మరో నలుగురితో కలిసి కువైట్‌లోని ఫాహిల్ అనే ఏరియాలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు వారు ఉంటున్న గదికి బయలు దేరారు. కువైట్‌లోని కింగ్ఫాహద్ అల్అహ్మద్ ఎక్స్‌ప్రెస్‌హైవే–40లో కారులో వస్తుండగా ముందు భాగంలో ఓ ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా ఆపడంతో దానిని తప్పించేందుకు కారును కూడా ఆపారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో సుమారు వంద మీటర్ల మేర కారు పల్టీలు కొట్టి బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న మల్లేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందగా బద్వేలు మండలం చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన మల్లేశ్వర్‌రెడ్డి సోదరుడు విశ్వనాథరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురికి కూడా గాయాలైనట్లు తెలిసింది. గ్రామాల్లో విషాదఛాయలు కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు మండలం గొడుగునూరు, చిన్నకేశంపల్లె గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గొడుగునూరు గ్రామవాసి అయిన శ్రీనివాసులరెడ్డి త్వరలో రానున్న శివరాత్రి పండుగకు ఇంటికి వస్తానని తెలిపాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు. అలాగే చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన మల్లేశ్వర్‌రెడ్డి నాలుగు నెలల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చి ఒక నెల రోజుల పాటు ఇంటి వద్ద ఉండి తిరిగి కువైట్‌కు వెళ్లాడు. ఇక నాకు దిక్కెవరు, నా పిల్లలను ఎలా పోషించాలి దేవుడా అంటూ మల్లేశ్వర్‌రెడ్డి భార్య ప్రమీల రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. -
కువైట్ తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు.. ఆపై
సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూష ప్రేమించుకున్నారు. దీంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్‌కు తీసుకెళ్లిన షరీఫ్.. అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్‌లో వదిలేసి.. షరీఫ్ స్వస్థలం తిరిగొచ్చాడు. తన బంధువుల సాయంతో సాయిప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. ఈ క్రమంలో షరీఫ్ బంధువుల కోరిక మేరకు రెండో పెళ్లికి సిద్ధమవ్వడంతో సాయిప్రత్యూష పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసులు కేసు నమోదుచేయకుండా పంచాయతీ పేరిట తాత్సారం చేస్తుండటంతో బాధిత యువతి ఆందోళనకు దిగారు. షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన కొనసాగిస్తున్నారు. -
కరువు అంచనా...అంతా వంచన
కరువు పరిశీలనకు కేంద్ర అధికారుల బృందం వస్తుందని రైతులు, కూలీలు సంతోషించారు. తమ కష్టాలు విని ఉపశమనం కలిగిస్తారని భావించారు. తీరా వచ్చాక కనీసం ఒకచోట పది నిమిషాలు కూడా గడపలేదు. రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు, కష్టాలు వారికి తెలుపుకుందామని వారి వద్దకు వెళ్లగా చివరకు నిరాశే మిగిలింది. తూతూమంత్రంగా వారితో మాట్లాడారు. కనీసం వివరాలు కూడా నమోదు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో కరువు బృందం పరిశీలన తమకు ఎంతమేర ఉపశమనం కలిగిస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బద్వేలు : రబీ సీజనుకు సంబంధించి కేంద్ర కరువు పరిశీలన బృందం బుధవారం కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు, ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. పంటనష్టం, తాగునీటి సరఫరా, ఉపాధి పనుల తీరు తదితరాలను పరిశీలించారు. ఈ బృందంలో హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ బీకే శ్రీవాత్సవ, ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డిప్యూటీ డైరెక్టరు ముఖేష్‌కుమార్, అగ్రి ఇన్పుట్స్ పరిశోధనాధికారి అనురాధ బటానా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం విజయకుమార్ ఉన్నారు. ఒకరోజు పరిధిలో రెండు మండలాల్లో ఆరు ప్రాంతాల్లో కరువు బృందం పర్యటన ఏర్పాటు చేయడంలోనే అధికారుల చిత్తశుద్ధిలోపం కనిపిస్తోంది. గుంతలతో కూడిన మట్టి రోడ్లపై దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించడం, నాలుగు ప్రాంతాల్లో రైతులు, కూలీలతో ముఖాముఖి, మూడు ప్రాంతాల్లో చెరువుల పరిశీలన ఎలా సాధ్యమనే విషయాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఒక రోజు వ్యవధిలో వీటన్నింటిని పూర్తి చేసుకుని తూతూమంత్రంగా తమ పర్యటనను ముగించారు. ఉపాధి కష్టాలకు గంతలు కరువు పరిశీలన బృందం మొదట సావిశెట్టిపల్లె సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అక్కడ కొండవాలున తవ్విన కందకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా అధికారులు కూలీలతో పనులు బాగున్నాయని, కూలీ నగదు అందుతున్న రీతిలో చెప్పించారు. దీంతో పాటు పని వద్ద నీడ ఏర్పాట్లు, మజ్జిగ అందజేత, మెడికల్ కిట్లు అందించామని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందరోజులు పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ దాదాపు వందమంది కూలీలు ఉండగా వారిలో కేవలం నలుగురో ఐదుగురో వంద రోజులు పనిచేశారు. కేవలం వీరిని మాత్రమే అధికారులతో మాట్లాడించారు. మెడికల్ కిట్లు అందజేసి నాలుగేళ్లు అవుతోంది. ఈ ఏడాది నీడ కోసం టెంట్లు అందించలేదు. అలాగే ఎండలకు నీటి వసతి, మజ్జిగ సౌకర్యం కల్పించలేదు. కానీ ఇవన్ని కూలీలు చెప్పకుండా కేవలం పనులు బాగున్నట్లు మాత్రమే చెప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది నెలల తరబడి ఉపాధి వేతనం రాకున్నా ఆ సమస్యను మాత్రం కేంద్రం బృందం దృష్టికి మాత్రం తీసుకురాలేదు. చెరువుల పరిశీలన అంతకుమునుపు ఇటుకలపాడు చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు, నీటి ఒరవ, పంటల సాగు వంటి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాలాయపల్లెలో కూడా చెరువును పరిశీలించారు. చెరువు 45ఎకరాల విస్తీర్ణంలో ఉండగా చాలావరకు ఆక్రమణకు గురైంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించలేదు. చెరువుకు ఒరవ తక్కువగా ఉందని. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెప్పారు. ఇటుకలపాడు, బాలాయపల్లె చెరువులకు తెలుగుగంగ ఎడమ కాలువ నుంచి ఎత్తిపొతల పథకం ఏర్పాటు చేసి నీటిని అందించాలని విన్నవించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం, జేడీఏ ఠాకూర్‌నాయక్, ఏడీ క్రిష్ణమూర్తి, డ్వామా పీడీ హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావు, డీడీ మురళి, వెటర్నరీ ఏడీ డాక్టరు రెడ్డమ్మ, కాశినాయన తహసీల్దార్ మల్లికార్జున, పోరుమామిళ్ల తహసీల్దార్ సీసీఎస్ వర్మ, ఎంపీడీఓలు ఆయూబ్, రామక్రిష్ణయ్య, ఆర్ఐలు మోహనరాజు, దక్షిణమూర్తి, ఎఓలు రామాంజనేయరెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు. రైతులకు గోడు వినకుండానే.. అనంతరం కాశినాయన మండలంలోని చిన్నాయపల్లెలో శెనగ రైతులతో కరువు బృందం సమావేశమైంది. కానీ ఇక్కడ కూడా ఇద్దరు రైతుల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నారు. కేవలం పది నిమిషాల సమయం కూడా కేటాయించలేదు. వ్యవసాయాధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వలేదు. మండలంలోని అధికశాతం మంది రైతులు నష్టపోయినా రైతుల సంఖ్య తక్కువ చేసి చూపారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులు చెప్పిన విషయాన్ని నమోదు చేసే సమయం కూడా అధికారులకు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు తాము వేసిన పంట విస్తీర్ణం, వచ్చిన దిగుబడి, కలిగిన నష్టం వివరాలను తెలుపుదామని ఎదురుచూసినా వారికి అవకాశం లభించలేదు. సాయంత్రం మూడు గంటలకు బాలాయపల్లెలో జొన్న రైతులతో సమావేశమయ్యారు. ఇద్దరు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగతా రైతులు తమ కష్టాలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అలాగే గ్రామంలోని పలువురు తాగునీటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఇక్కడ పది నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయించారు. -
అర్ధరాత్రి రహస్య సమావేశం
బద్వేలులో అధికారపార్టీ నాయకుల, పాలకుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఖాళీస్థలాలు కనిపిస్తే రాత్రికి రాత్రే కబ్జాచేయడం, ప్రతిపక్షనాయకుల గొంతునొక్కించడం ఇప్పటివరకు జరిగిన తంతుఅయితే, తాజాగా అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో పాలకవర్గం కుమ్మక్కుఅయ్యింది. బద్వేలు మున్సిపాలిటీలో అవినీతిని పంచుకునేందుకు అర్ధరాత్రిరహస్యసమావేశం జరిగింది. కాంట్రాక్టర్లకు టెండర్లు వేయవద్దు అంటూహుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బద్వేలు(అట్లూరు): బద్వేలు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచేందుకు 64 పనులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.5.25 కోట్ల నిధులు 2016–17 కింద మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు ఈనెల 11వ తేదీన టెండర్లు పిలిచారు. ఈ నెల 27 చివరి తేదీ. బద్వేలు మున్సిపాలిటీలో పాలకపక్షం అధికారపార్టీ కావడంతో ఈ పనులకు సంబంధించి ఎవరైనా టెండర్లు వేస్తే పనులు చేయనివ్వం. మార్చి లోపల పనులు చేపట్టక నిధులు వెనక్కిపోతాయి అంటూ కాంట్రాక్టర్లకు చెబుతున్నట్లు సమాచారం. అందులోభాగంగా తమకు తెలియకుండా టెండర్లు వేయవద్దంటూ మున్సిపాలిటీ పాలకపక్షం ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రానట్లు తెలిసింది. అర్ధరాత్రి రహస్య సమావేశం మున్సిపాలిటీలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలంటే కాంట్రాక్టర్లు తాము చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే తాము పనులు చేయనివ్వం.. పనులు పూర్తికాకుంటే కాంట్రాక్టర్ బ్లాక్‌లిస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది, కనుక అందరూ మున్సిపల్ కార్యాలయం వద్దకు రండి అంటూ బుధవారం రాత్రి కాంట్రాక్టర్లను అధికారపార్టీ నేతలు పిలిపించుకున్నారు. అలాగే టీడీపీకి చెందిన కౌన్సిలర్లు మాత్రం కార్యాలయంలో ముందుగా కాంట్రాక్టర్లను బయట వేచి ఉండమన్నారు. వారు మాత్రం లోపలకు వెళ్లి తలుపులకు గడులు పెట్టుకుని సహస్యంగా సమావేశమయ్యారు. అంతా ఓకే.. సమావేశంలో ఇక ఏడు నెలలు మాత్రమే అధికారం ఉంది. అయితే ఈ పనులలో కలసికట్టుగా కాంట్రాక్టర్లను పోటీలేకుండా చేయడంతో పాటు లెస్‌కు టెండరు వేయకుండా చూడాలని అనుకున్నారు. అవసరమైతే తమ పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టర్ల నుంచి 10శాతం రాబట్టుకుని ఒక్కో కౌన్సిలర్‌కు రూ.2 నుంచి రూ.3లక్షలు వాటా వచ్చేలా వ్యవహారం నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి రహస్య సమావేశం అనంతరం అర్ధరాత్రి అక్కడే కాంట్రాక్టర్లతో వారు లోపల మాట్లాడుకున్న విషయాలు చెప్పి ఒప్పించుకున్నారు. 27వ తేదీ ఎవరు టెండర్లు లెస్‌కు వేయకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పాలకవర్గం టెండర్ల విషయంలో వేసిన ఎత్తుగడ ఫలించేందుకు మున్సిపల్ అధికారులు పూర్తి సహాయ, సహకారాలు అందించడంతో పాటు ‘అంతా ఓకే మీరు చెప్పినట్లే ’ అంటూ తలూపినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి బద్వేలు మున్సిపాలిటీ పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల పనులకు సంబంధించిన టెండర్లకు పోటీలేకుండా చేయడంతో పాటు అధికార యంత్రాంగం పూర్తి మద్దతు లభించడంతో ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.50లక్షల నుంచి రూ.60లక్షలు గండికొట్టనున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి వారి ప్రణాళిక నెరవేరితే ఒక్కో వార్డు నేతకు రూ.3లక్షల వరకు కాంట్రాక్టర్ల నుంచి ముట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాకు తెలియదు: మున్సిపల్ డీఈ రవిప్రకాష్‌నాయుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనుల టెండర్లకు సంబంధించి కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు బుధవారం రాత్రి రహస్య సమావేశమైన విషయం నాకు తెలియదు. అయినా ఆన్లైన్ టెండర్లు ఎక్కడ నుంచి అయినా వేయవచ్చు. అంతకు మించి నాకు తెలియదు. -
విజయవాడకు బద్వేలు పంచాయితీ
టీడీపీ నేతల రాజీ ప్రయత్నాలు విఫలం రేపు సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్‌ల వద్దనే తేల్చుకునేందుకు ఎమ్మెల్యే వర్గం నిర్ణయం వెనక్కి తగ్గని జెడ్పీటీసీ సభ్యులు కలెక్టర్, జేసీలకు రాజీనామా పత్రాలు అందజేత ప్రత్యక్ష విమర్శలకు దిగిన మాజీ ఎమ్మెల్యే వర్గం బద్వేలు టీడీపీలో తీవ్రమైన వర్గపోరు సాక్షి, కడప : అధికారపార్టీలో మొదలైన బద్వేలు రాజకీయ రగడ తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు రాజీనామాలు చేసిన వ్యవహారం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే జిల్లాకు చెందిన నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. పైగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన కొందరు నేతలు దమ్ముంటే జెడ్పీటీసీ సభ్యులు రాజీనామా పత్రాలను సీఎంకు కాకుండా జెడ్పీ సీఈఓకు ఇవ్వాలని సోమవారం ఉదయం విమర్శలకు దిగిన నేపథ్యంలో రాత్రి కడపలో కలెక్టర్‌తోపాటు జెడ్పీ సీఈఓను కలిసి జెడ్పీటీసీలు శిరీషా, రమణయ్యలు రాజీనామా పత్రాలను అందజేశారు. దీంతో రెండు వర్గాలు ప్రత్యక్ష విమర్శలకు దిగడంతో బద్వేలు రాజకీయం కాస్త వేడెక్కింది. ఇప్పటికే రెండు వర్గాల మధ్య ముదిరిన విబేధాలతో సర్దిచెప్పడం జిల్లా నేతలకు సైతం తలనొప్పిగా మారింది. ఇదిలాఉండగా బుధవారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలోనే బద్వేలు పంచాయితీని తేల్చుకునేందుకు ఎమ్మెల్యే జయరాములు సిద్ధమయ్యారు. బద్వేలు టీడీపీలో రగడ టీడీపీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. అయితే అన్నిచోట్ల ఇలాంటి విపత్కర పరిస్థితులతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య మొదటి నుంచి ఆధిపత్యపోరు కొనసాగుతుంది. పార్టీతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పదవుల విషయంలోనూ పైచేయి సాధించేందుకు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీటీసీల రాజీనామాల వ్యవహారం చోటుచేసుకుంది. ఇదంతా ఎమ్మెల్యే జయరాములు నేతృత్వంలోనే జరిగిందని భావిస్తున్న విజయమ్మ వర్గం కూడా ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. సోమవారం ఏకంగా మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, యల్లారెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి రాజీనామా చేసిన జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేను టార్గెట్ చేసి విమర్శలకు దిగారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వర్గం జెడ్పీటీసీలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం కూడా ఒకటి, రెండు రోజుల్లో ఏదో ఒక అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధిష్టానంతో తేల్చుకునేందుకు... బద్వేలు ఎమ్మెల్యే జయరాములతో కలిసి బద్వేలు, గోవపరం జెడ్పీటీసీ సభ్యులు శిరీషా, రమణయ్యలు విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలియవచ్చింది. అయితే ఎమ్మెల్యే అపాయ్మెంట్ తీసుకున్నారని, ఒకరే వెళతారని తమకు సంబంధం లేదన్నట్లు రాజీనామా చేసిన జెడ్పీటీసీలు పేర్కొంటున్నారు. అందుకు సంబంధించి సోమవారం రాత్రి 9గంటల ప్రాంతంలో కడపకు చేరుకున్న ఇద్దరు జెడ్పీటీసీలు కలెక్టర్ బాబూరావునాయుడుతోపాటు జేసీ శ్వేత తెవతీయను కలిశారు. రాజీనామా పత్రాలు అందజేశారు. అంతే కాకుండా డిప్యూటీ సీఈఓకు రాజీనామా పత్రాలు అందజేసేందుకు ప్రయత్నించారు. అయితే బుధవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి లోకేష్ సమక్షంలో బద్వేలు పంచాయితీ జరగనుంది. అధిష్టానానికి తమ సమస్యను వివరించేందుకు ఎమ్మెల్యే వర్గం సిద్ధమైన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే! -
35 మంది తమిళ కూలీలు అరెస్టు
బద్వేలు అర్బన్: బాలాయపల్లె పరిధిలోని చిరుతబండ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 35 మంది తమిళకూలీలను అరెస్టుచేసి వారి వద్ద నుంచి 44 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ డీఎస్.సుదర్శన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మైదుకూరు మండలం ఖాజీపేట సమీపంలోని నాగసానిపల్లె పరిధిలో గురువారం రాత్రి అధిక సంఖ్యలో తమిళకూలీలు పట్టుబడిన నేపథ్యంలో కొందరు తప్పించుకుని పక్కనే ఉన్న బాలాయపల్లెకు వచ్చారని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో గాలింపు చర్యలు చేపట్టాం. చిరుతబండ ప్రాంతంలో తమిళ కూలీలు తారసపడి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 44 ఎర్రచందనం దుంగల డంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో డీఆర్వో బి.లక్ష్మీనారాయణ, ఎఫ్ఎస్ఓ .రమణ, ఎఫ్‌బివోలు జాకీర్‌హుసేన్, రవిచంద్ర, ఆనందం, కరుణాకర్ పాల్గొన్నారు. -
334 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరురోడ్డులోని బైపాస్‌రోడ్డు సమీపంలో సోమవారం తెల్లవారుజామున లారీలో తరలివెళుతున్న 334 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామాంజినాయక్ తెలిపారు. తెల్లవారుజామున అర్బన్ ఎస్ఐ చలపతితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా కరటంపాడు నుంచి అనంతపురం జిల్లా హిందూపురానికి వెళుతున్న ఓ లారీని ఆపి తనిఖీ చేశారు. అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు అనుమానం రావడంతో లారీని స్టేషన్‌కు తరలించారు., అనంతరం గోపవరం రెవెన్యూ అధికారులకు లారీని అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
విద్యార్థులే కిడ్నాపర్లు
ప్రొద్దుటూరు క్రైం: వాళ్లు ముగ్గురు స్నేహితులు. వారిలో ఇద్దరు ఇటీవలే డిప్లమా పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం కన్నా.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వారి మదిలో మెదిలింది. అనుకున్నదే తడవు ఆ ముగ్గురు ఆచరణలో పెట్టారు. గత నెలలో ప్రొద్దుటూరుకు చెందిన గంజికుంట మాధవరావు అనే 10 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశారు. వారిని వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పూజితానీలం, సీఐ ఓబులేసులు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని పవర్హౌస్రోడ్డుకు చెందిన షేక్.గౌస్జామా తండ్రి టివి మెకానిక్. తల్లి ప్రైవేట్ నర్సింగ్ హోంలో నర్సుగా పని చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వెల్లాల వెంకటేష్ స్నేహితుడు. అతను పట్టణంలోనే బైక్ మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. గౌస్జామా 10వ తరగతి అనంతరం 2013లో బద్వేలులోని పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. ముద్దనూరు మండలం చెన్నారెడ్డిగారిపల్లెకు చెందిన సిద్దన ఓంకార్ కూడా అదే కళాశాలలో చదువుతున్నాడు. అతనికి గౌస్జామాతో బాగా పరిచయం ఏర్పడింది. వెంకటేష్ కూడా ప్రొద్దుటూరు నుంచి తరచూ బద్వేలుకు వెళ్లేవాడు. అతను వచ్చిన ప్రతి సారి ముగ్గురూ మందు పార్టీ చేసుకునేవారు. ఇందుకోసం ఒక బాడుగ ఇంటిని కూడా తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వారిద్దరి డిప్లమో కోర్సు పూర్తి అయింది. జల్సాలకు అలవాటు పడిన వీరు ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచించారు. ఇందులో భాగంగానే బద్వేలులో చిల్లర దొంగతనాలు కూడా చేశారు. పిల్లల్ని కిడ్నాప్ చేస్తే.. రూ. లక్షలు వస్తాయి చదువుకునే పిల్లల్ని కిడ్నాప్ చేస్తే వారి తల్లిదండ్రులను బెదిరించి రూ. లక్షలు వసూలు చేయవచ్చని ముగ్గురు కలిసి వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే గత నెలలో బద్వేలులో హోండా షైన్ బైక్‌ను దొంగలించారు. గత నెల 22న వెంకటేశ్వర కొట్టాల సమీపంలో పాఠశాలకు వెళ్లి వస్తున్న గంజికుంట మాధవరావు(10) అనే బాలుడ్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లారు. తర్వాత వారి తల్లిదండ్రులకు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేశారు. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నామంటూ నాలుగైదు సార్లు ఫోన్ చేశారు. బాలుడి ఆచూకీ తెలియక పోవడంతో తండ్రి వెంకటపతి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వన్‌టౌన్‌తోపాటు పట్టణంలోని అన్ని స్టేషన్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మోహరించడంతో బాలుడ్ని నెల్లూరుకు తీసుకొని వెళ్లారు. పోలీసులకు దొరికితే తమ జీవితాలు నాశనం అవుతాయని భావించిన యువకులు.. మాధవరావును రెండు రోజుల తర్వాత నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో వదిలేసి వెళ్లారు. బాలుడు ఏడుస్తూ కనిపించడంతో అక్కడి పోలీసులు ఇక్కడి డీఎస్పీకి సమాచారం అందించారు. తర్వాత వన్‌టౌన్ పోలీసులు నెల్లూరుకు వెళ్లి బాలుడ్ని తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి ద్వారా కొద్ది మేర సమాచారం సేకరించిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జమ్మలమడుగు రోడ్డులోని బైపాస్ రోడ్డులో ఉండగా ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న రెండు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నుట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో రూరల్ సీఐ ఓబులేసు, వన్‌టౌన్ ఎస్ఐలు చిన్నపెద్దయ్య, చంద్రశేఖర్, చాపాడు ఎస్ఐ శివశంకర్‌లు బాగా శ్రమించారని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి తెలుపుతానని ఆమె పేర్కొన్నారు. -
చంపేశారు...!
బద్వేలు: ఈ బాలుడి పేరు కృష్ణమోహన్.. వయస్సు పదేళ్లు.. పుట్టుకతోనే మూగ, చెవుడు.. బద్వేలు పట్టణంలోని 14వ వార్డుకు చెందిన ఇతనికి జనవరి నుంచే వికలాంగ పింఛన్ మంజూరైంది. ఈ విషయం కృష్ణమోహన్‌కు గానీ, కుటుంబసభ్యులకుగానీ తెలియదు. తనకు పింఛన్ వస్తున్నట్లు ఇటీవలే తెలుసుకున్న కృష్ణమోహన్ అక్టోబర్ నెల పింఛన్ తీసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లాడు.. నీ పింఛన్ 10 వార్డులోకి మారిపోయిందని అధికారులు చెప్పడంతో అక్కడికి వెళ్లాడు.. అడ్రస్, ఆధార్‌కార్డు, వికలాంగ సర్టిఫికేట్ అన్నీ సరిగా ఉన్నా పేరు మారింది. కృష్ణమోహన్‌కు బదులుగా వై. కొరగింజగా పేరు మారింది. అంతేకాకుండా పరిశీలనలో కొరగింజ మృతి చెందినట్లుగా భావించి పింఛన్‌ను తొలగించినట్లు చావుకబురు చల్లగా చెప్పారు. జనవరి నుంచి మంజూరైన మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించామన్నారు. తనకు న్యాయం చేయాలని, తాను బతికే ఉన్నానని మూగ సైగలు చేస్తూ అధికారుల చుట్టూ కృష్ణమోహన్ తిరుగుతున్నాడు. -
ఏయ్.. ఇది టీడీపీ ప్రభుత్వం
బద్వేలు: ‘ఏయ్ ఇది ఎవరి ప్రభుత్వం... టీడీపీ ప్రభుత్వంలో పని చేస్తూ మేం చెప్పినట్లు వినరా... మీరు తగిన ఫలితం అనుభవిస్తారు’... అని బద్వేలు టీడీపీ నేత విజయజ్యోతి అధికారులపై మండిపడ్డారు. బుధవారం పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఎటువంటి ఆహ్వానం లేకుండానే టీడీపీ నేత విజయజ్వోతి హాజరయ్యారు. అనంతరం తాను మాట్లాడతానంటూ మైక్ ఇవ్వాలని కోరారు. దీనికి మండలాధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆమెను ఏ హోదాలో మాట్లాడిస్తారు.. ఇదేమీ పార్టీ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం కదా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు ఆమెకు అవకాశమ్విలేదు. ఇదే సమయంలో జిల్లాలోని ఉన్నతాధికారులతో అధికారులకు ఫోన్ చేయించి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆమె మరింత అసహనానికి గురయ్యారు. తాను ప్రజల తరుఫున మాట్లాతానని పట్టుబట్టడంతో ప్రజలకు మధ్యాహ్నం అవకాశమిస్తామని అప్పటి వరకు ఆగాలన్నారు. దీంతో టీడీపీ నేతలు ఆమెకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరుతూ మైక్ అందజేశారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ చిత్తా విజయప్రతాప్, వైఎస్సార్సీపీ నాయకులు చిత్తా రవి, రమణ ఆందోళనకు దిగారు ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి ప్రయత్నించడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం విశేషం. ఈ దశలో సీఐ వెంకటకుమార్, ఎస్ఐలు కృష్ణంరాజు నాయక్, హరిప్రసాద్ గొడవను సద్దుమణిగేలా చూశారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యాక విజయజ్యోతి ఎంపీడీఓ నారాయణరెడ్డి, నోడల్ అధికారి కృష్ణమూర్తి వద్దకు వెళ్లి ‘మీరు మా ప్రభుత్వంలో పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీని పరవ్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుందని వారిపై మండిపడటంతో కార్యక్రమానికి వచ్చిన పలువురు అధికారులు, ప్రజలు అవాక్కయ్యారు. -
పనితీరు మారకుంటే ఇంటికే
బద్వేలు అర్బన్: ‘గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా పనితీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇలాగైతే ఇంటికి పంపిస్తా’ అంటూ బద్వేలు మున్సిపల్ సిబ్బందిపై ఆర్డీ మురళీకృష్ణ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బద్వేలు మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. క్యాష్‌బుక్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అకౌంటెంట్ నాగేంద్రబాబును మందలించారు. అలాగే మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు మూడు నెలల వేతనాలు ఎందుకు చెల్లించలేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. తక్షణమే కార్మికులకు జీతాలు చెల్లించకుంటే మీ జీతాలు నిలిపేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని డీఈ గుర్రప్పయాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీని కలిసిన ఛైర్మన్ పార్థసారథి విధుల నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీపీఓపై చర్యలకు ఆదే శం మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి రామకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందిగా టౌన్‌ప్లానింగ్ ఆర్డీ బాలాజిని మున్సిపల్ ఆర్డీ మురళీకృష్ణగౌడ్ ఫోన్లో కోరారు. చైర్మన్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు టీపీవో పనితీరు సరిగా లేదని అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుచేస్తే ఏమాత్రం స్పందించడం లేదని ఆర్డీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన గతంలో కూడా టీపీవోపై అనేక ఫిర్యాదులు అందాయని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ ఆర్డీని కోరారు.