ప్రొద్దుటూరు క్రైం: వాళ్లు ముగ్గురు స్నేహితులు. వారిలో ఇద్దరు ఇటీవలే డిప్లమా పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం కన్నా.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వారి మదిలో మెదిలింది. అనుకున్నదే తడవు ఆ ముగ్గురు ఆచరణలో పెట్టారు. గత నెలలో ప్రొద్దుటూరుకు చెందిన గంజికుంట మాధవరావు అనే 10 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశారు. వారిని వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పూజితానీలం, సీఐ ఓబులేసులు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని పవర్‌హౌస్‌రోడ్డుకు చెందిన షేక్.గౌస్‌జామా తండ్రి టివి మెకానిక్. తల్లి ప్రైవేట్ నర్సింగ్ హోంలో నర్సుగా పని చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వెల్లాల వెంకటేష్ స్నేహితుడు. అతను పట్టణంలోనే బైక్ మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. గౌస్‌జామా 10వ తరగతి అనంతరం 2013లో బద్వేలులోని పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. ముద్దనూరు మండలం చెన్నారెడ్డిగారిపల్లెకు చెందిన సిద్దన ఓంకార్ కూడా అదే కళాశాలలో చదువుతున్నాడు. అతనికి గౌస్‌జామాతో బాగా పరిచయం ఏర్పడింది. వెంకటేష్ కూడా ప్రొద్దుటూరు నుంచి తరచూ బద్వేలుకు వెళ్లేవాడు. అతను వచ్చిన ప్రతి సారి ముగ్గురూ మందు పార్టీ చేసుకునేవారు. ఇందుకోసం ఒక బాడుగ ఇంటిని కూడా తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వారిద్దరి డిప్లమో కోర్సు పూర్తి అయింది. జల్సాలకు అలవాటు పడిన వీరు ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచించారు. ఇందులో భాగంగానే బద్వేలులో చిల్లర దొంగతనాలు కూడా చేశారు.
పిల్లల్ని కిడ్నాప్ చేస్తే.. రూ. లక్షలు వస్తాయి
చదువుకునే పిల్లల్ని కిడ్నాప్ చేస్తే వారి తల్లిదండ్రులను బెదిరించి రూ. లక్షలు వసూలు చేయవచ్చని ముగ్గురు కలిసి వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే గత నెలలో బద్వేలులో హోండా షైన్ బైక్‌ను దొంగలించారు. గత నెల 22న వెంకటేశ్వర కొట్టాల సమీపంలో పాఠశాలకు వెళ్లి వస్తున్న గంజికుంట మాధవరావు(10) అనే బాలుడ్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లారు. తర్వాత వారి తల్లిదండ్రులకు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేశారు. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నామంటూ నాలుగైదు సార్లు ఫోన్ చేశారు. బాలుడి ఆచూకీ తెలియక పోవడంతో తండ్రి వెంకటపతి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వన్‌టౌన్‌తోపాటు పట్టణంలోని అన్ని స్టేషన్‌ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మోహరించడంతో బాలుడ్ని నెల్లూరుకు తీసుకొని వెళ్లారు. పోలీసులకు దొరికితే తమ జీవితాలు నాశనం అవుతాయని భావించిన యువకులు.. మాధవరావును రెండు రోజుల తర్వాత నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో వదిలేసి వెళ్లారు. బాలుడు ఏడుస్తూ కనిపించడంతో అక్కడి పోలీసులు ఇక్కడి డీఎస్పీకి సమాచారం అందించారు. తర్వాత వన్‌టౌన్ పోలీసులు నెల్లూరుకు వెళ్లి బాలుడ్ని తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి ద్వారా కొద్ది మేర సమాచారం సేకరించిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జమ్మలమడుగు రోడ్డులోని బైపాస్ రోడ్డులో ఉండగా ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నుట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో రూరల్ సీఐ ఓబులేసు, వన్‌టౌన్ ఎస్‌ఐలు చిన్నపెద్దయ్య, చంద్రశేఖర్, చాపాడు ఎస్‌ఐ శివశంకర్‌లు బాగా శ్రమించారని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి తెలుపుతానని ఆమె పేర్కొన్నారు.
విద్యార్థులే కిడ్నాపర్లు
Published Sat, Oct 22 2016 12:03 AM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
Advertisement
Advertisement