మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గం అర్ధరాత్రి సమావేశం కావడంతో. కాంట్రాక్టర్లు బయట వేచిఉన్న దృశ్యం
బద్వేలులో అధికారపార్టీ నాయకుల, పాలకుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఖాళీస్థలాలు కనిపిస్తే రాత్రికి రాత్రే కబ్జాచేయడం, ప్రతిపక్షనాయకుల గొంతునొక్కించడం ఇప్పటివరకు జరిగిన తంతుఅయితే, తాజాగా అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో పాలకవర్గం కుమ్మక్కుఅయ్యింది. బద్వేలు మున్సిపాలిటీలో అవినీతిని పంచుకునేందుకు అర్ధరాత్రిరహస్యసమావేశం జరిగింది. కాంట్రాక్టర్లకు టెండర్లు వేయవద్దు అంటూహుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
బద్వేలు(అట్లూరు): బద్వేలు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచేందుకు 64 పనులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.5.25 కోట్ల నిధులు 2016–17 కింద మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు ఈనెల 11వ తేదీన టెండర్లు పిలిచారు. ఈ నెల 27 చివరి తేదీ. బద్వేలు మున్సిపాలిటీలో పాలకపక్షం అధికారపార్టీ కావడంతో ఈ పనులకు సంబంధించి ఎవరైనా టెండర్లు వేస్తే పనులు చేయనివ్వం. మార్చి లోపల పనులు చేపట్టక నిధులు వెనక్కిపోతాయి అంటూ కాంట్రాక్టర్లకు చెబుతున్నట్లు సమాచారం. అందులోభాగంగా తమకు తెలియకుండా టెండర్లు వేయవద్దంటూ మున్సిపాలిటీ పాలకపక్షం ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రానట్లు తెలిసింది.
అర్ధరాత్రి రహస్య సమావేశం
మున్సిపాలిటీలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలంటే కాంట్రాక్టర్లు తాము చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే తాము పనులు చేయనివ్వం.. పనులు పూర్తికాకుంటే కాంట్రాక్టర్ బ్లాక్‌లిస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది, కనుక అందరూ మున్సిపల్ కార్యాలయం వద్దకు రండి అంటూ బుధవారం రాత్రి కాంట్రాక్టర్లను అధికారపార్టీ నేతలు పిలిపించుకున్నారు. అలాగే టీడీపీకి చెందిన కౌన్సిలర్‌లు మాత్రం కార్యాలయంలో ముందుగా కాంట్రాక్టర్లను బయట వేచి ఉండమన్నారు. వారు మాత్రం లోపలకు వెళ్లి తలుపులకు గడులు పెట్టుకుని సహస్యంగా సమావేశమయ్యారు.
అంతా ఓకే..
సమావేశంలో ఇక ఏడు నెలలు మాత్రమే అధికారం ఉంది. అయితే ఈ పనులలో కలసికట్టుగా కాంట్రాక్టర్లను పోటీలేకుండా చేయడంతో పాటు లెస్‌కు టెండరు వేయకుండా చూడాలని అనుకున్నారు. అవసరమైతే తమ పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టర్ల నుంచి 10శాతం రాబట్టుకుని ఒక్కో కౌన్సిలర్‌కు రూ.2 నుంచి రూ.3లక్షలు వాటా వచ్చేలా వ్యవహారం నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి రహస్య సమావేశం అనంతరం అర్ధరాత్రి అక్కడే కాంట్రాక్టర్లతో వారు లోపల మాట్లాడుకున్న విషయాలు చెప్పి ఒప్పించుకున్నారు. 27వ తేదీ ఎవరు టెండర్లు లెస్‌కు వేయకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పాలకవర్గం టెండర్ల విషయంలో వేసిన ఎత్తుగడ ఫలించేందుకు మున్సిపల్ అధికారులు పూర్తి సహాయ, సహకారాలు అందించడంతో పాటు ‘అంతా ఓకే మీరు చెప్పినట్లే ’ అంటూ తలూపినట్లు తెలిసింది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
బద్వేలు మున్సిపాలిటీ పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల పనులకు సంబంధించిన టెండర్లకు పోటీలేకుండా చేయడంతో పాటు అధికార యంత్రాంగం పూర్తి మద్దతు లభించడంతో ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.50లక్షల నుంచి రూ.60లక్షలు గండికొట్టనున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి వారి ప్రణాళిక నెరవేరితే ఒక్కో వార్డు నేతకు రూ.3లక్షల వరకు కాంట్రాక్టర్ల నుంచి ముట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నాకు తెలియదు: మున్సిపల్ డీఈ రవిప్రకాష్‌నాయుడు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనుల టెండర్లకు సంబంధించి కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు బుధవారం రాత్రి రహస్య సమావేశమైన విషయం నాకు తెలియదు. అయినా ఆన్‌లైన్ టెండర్లు ఎక్కడ నుంచి అయినా వేయవచ్చు. అంతకు మించి నాకు తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment