పనితీరు మారకుంటే ఇంటికే
బద్వేలు అర్బన్:
‘గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా పనితీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇలాగైతే ఇంటికి పంపిస్తా’ అంటూ బద్వేలు మున్సిపల్ సిబ్బందిపై ఆర్‌డీ మురళీకృష్ణ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బద్వేలు మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. క్యాష్‌బుక్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అకౌంటెంట్ నాగేంద్రబాబును మందలించారు. అలాగే మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు మూడు నెలల వేతనాలు ఎందుకు చెల్లించలేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. తక్షణమే కార్మికులకు జీతాలు చెల్లించకుంటే మీ జీతాలు నిలిపేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని డీఈ గుర్రప్పయాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌డీని కలిసిన ఛైర్మన్ పార్థసారథి విధుల నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
టీపీఓపై చర్యలకు ఆదే శం
మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి రామకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందిగా టౌన్‌ప్లానింగ్ ఆర్‌డీ బాలాజిని మున్సిపల్ ఆర్‌డీ మురళీకృష్ణగౌడ్ ఫోన్‌లో కోరారు. చైర్మన్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు టీపీవో పనితీరు సరిగా లేదని అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుచేస్తే ఏమాత్రం స్పందించడం లేదని ఆర్‌డీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన గతంలో కూడా టీపీవోపై అనేక ఫిర్యాదులు అందాయని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ ఆర్‌డీని కోరారు.