రోడ్డుప్రమాదం జరిగిన కువైట్‌లోని కింగ్‌ఫాహద్‌అల్–అహ్మద్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు
వారిరువురు రైతు బిడ్డలు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుండేవారు. కానీ వరుస కరువులతో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో పాటు చేసిన అప్పులు
తీర్చుకునేందుకు కువైట్‌కు వెళ్లారు. కష్టపడి పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో విధి చిన్నచూపు చూసింది. బతుకుదెరువు కోసం వెళ్లిన దేశంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
వైఎస్‌ఆర్ జిల్లా , బద్వేలు అర్బన్ : బద్వేలు మండలం గొడుగునూరు గ్రామానికి చెందిన చెన్నుపల్లె శ్రీనివాసులరెడ్డి (41) రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. ఈయనకు భార్య రమాదేవితో పాటు సుమ అనే కుమార్తె ఉన్నారు. కువైట్‌లోని ఖైతాన్‌లో నివసిస్తుంటాడు. అలాగే బద్వేలు మండలం చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన పోకల మల్లేశ్వర్‌రెడ్డి (40) నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. ఆయనకు భార్య ప్రమీలతో పాటు హర్షవర్దన్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతులు ఇద్దరిది ఒకే మండలం కావడంతో పాటు ఒకే పని (రాడ్‌బెండింగ్) చేస్తుండటంతో ఖైతాన్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం ఉదయం వీరు మరో నలుగురితో కలిసి కువైట్‌లోని ఫాహిల్ అనే ఏరియాలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు వారు ఉంటున్న గదికి బయలు దేరారు. కువైట్‌లోని కింగ్‌ఫాహద్ అల్‌అహ్మద్ ఎక్స్‌ప్రెస్‌హైవే–40లో కారులో వస్తుండగా ముందు భాగంలో ఓ ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా ఆపడంతో దానిని తప్పించేందుకు కారును కూడా ఆపారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో సుమారు వంద మీటర్ల మేర కారు పల్టీలు కొట్టి బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న మల్లేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందగా బద్వేలు మండలం చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన మల్లేశ్వర్‌రెడ్డి సోదరుడు విశ్వనాథరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురికి కూడా గాయాలైనట్లు తెలిసింది.
గ్రామాల్లో విషాదఛాయలు
కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు మండలం గొడుగునూరు, చిన్నకేశంపల్లె గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గొడుగునూరు గ్రామవాసి అయిన శ్రీనివాసులరెడ్డి త్వరలో రానున్న శివరాత్రి పండుగకు ఇంటికి వస్తానని తెలిపాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు. అలాగే చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన మల్లేశ్వర్‌రెడ్డి నాలుగు నెలల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చి ఒక నెల రోజుల పాటు ఇంటి వద్ద ఉండి తిరిగి కువైట్‌కు వెళ్లాడు. ఇక నాకు దిక్కెవరు, నా పిల్లలను ఎలా పోషించాలి దేవుడా అంటూ మల్లేశ్వర్‌రెడ్డి భార్య ప్రమీల రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment