విజయవాడకు బద్వేలు పంచాయితీ
టీడీపీ నేతల రాజీ ప్రయత్నాలు విఫలం
రేపు సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్‌ల వద్దనే
తేల్చుకునేందుకు ఎమ్మెల్యే వర్గం నిర్ణయం
వెనక్కి తగ్గని జెడ్పీటీసీ సభ్యులు
కలెక్టర్, జేసీలకు రాజీనామా పత్రాలు అందజేత
ప్రత్యక్ష విమర్శలకు దిగిన మాజీ ఎమ్మెల్యే వర్గం
బద్వేలు టీడీపీలో తీవ్రమైన వర్గపోరు
సాక్షి, కడప : అధికారపార్టీలో మొదలైన బద్వేలు రాజకీయ రగడ తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు రాజీనామాలు చేసిన వ్యవహారం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే జిల్లాకు చెందిన నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. పైగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన కొందరు నేతలు దమ్ముంటే జెడ్పీటీసీ సభ్యులు రాజీనామా పత్రాలను సీఎంకు కాకుండా జెడ్పీ సీఈఓకు ఇవ్వాలని సోమవారం ఉదయం విమర్శలకు దిగిన నేపథ్యంలో రాత్రి కడపలో కలెక్టర్‌తోపాటు జెడ్పీ సీఈఓను కలిసి జెడ్పీటీసీలు శిరీషా, రమణయ్యలు రాజీనామా పత్రాలను అందజేశారు. దీంతో రెండు వర్గాలు ప్రత్యక్ష విమర్శలకు దిగడంతో బద్వేలు రాజకీయం కాస్త వేడెక్కింది. ఇప్పటికే రెండు వర్గాల మధ్య ముదిరిన విబేధాలతో సర్దిచెప్పడం జిల్లా నేతలకు సైతం తలనొప్పిగా మారింది. ఇదిలాఉండగా బుధవారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలోనే బద్వేలు పంచాయితీని తేల్చుకునేందుకు ఎమ్మెల్యే జయరాములు సిద్ధమయ్యారు.
బద్వేలు టీడీపీలో రగడ
టీడీపీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. అయితే అన్నిచోట్ల ఇలాంటి విపత్కర పరిస్థితులతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య మొదటి నుంచి ఆధిపత్యపోరు కొనసాగుతుంది. పార్టీతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పదవుల విషయంలోనూ పైచేయి సాధించేందుకు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జెడ్పీటీసీల రాజీనామాల వ్యవహారం చోటుచేసుకుంది. ఇదంతా ఎమ్మెల్యే జయరాములు నేతృత్వంలోనే జరిగిందని భావిస్తున్న విజయమ్మ వర్గం కూడా ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. సోమవారం ఏకంగా మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, యల్లారెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి రాజీనామా చేసిన జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేను టార్గెట్ చేసి విమర్శలకు దిగారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వర్గం జెడ్పీటీసీలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం కూడా ఒకటి, రెండు రోజుల్లో ఏదో ఒక అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అధిష్టానంతో తేల్చుకునేందుకు...
బద్వేలు ఎమ్మెల్యే జయరాములతో కలిసి బద్వేలు, గోవపరం జెడ్పీటీసీ సభ్యులు శిరీషా, రమణయ్యలు విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలియవచ్చింది. అయితే ఎమ్మెల్యే అపాయ్‌మెంట్ తీసుకున్నారని, ఒకరే వెళతారని తమకు సంబంధం లేదన్నట్లు రాజీనామా చేసిన జెడ్పీటీసీలు పేర్కొంటున్నారు. అందుకు సంబంధించి సోమవారం రాత్రి 9గంటల ప్రాంతంలో కడపకు చేరుకున్న ఇద్దరు జెడ్పీటీసీలు కలెక్టర్ బాబూరావునాయుడుతోపాటు జేసీ శ్వేత తెవతీయను కలిశారు. రాజీనామా పత్రాలు అందజేశారు. అంతే కాకుండా డిప్యూటీ సీఈఓకు రాజీనామా పత్రాలు అందజేసేందుకు ప్రయత్నించారు. అయితే బుధవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి లోకేష్ సమక్షంలో బద్వేలు పంచాయితీ జరగనుంది. అధిష్టానానికి తమ సమస్యను వివరించేందుకు ఎమ్మెల్యే వర్గం సిద్ధమైన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే!