అది మేము విడుదల చేయలేదు
ఈసీకి సంబంధం లేదు
దర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండవచ్చు
దానిపైనా విచారణ చేస్తున్నాం
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
మీడియాతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆ వీడియో తమ నుంచి బయటకు వెళ్లలేదని గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు మీనా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అనుమతిస్తే రేపు వేరే పార్టీ వాళ్లు వెళ్తామంటారని, అందుకే బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లనీయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టు వివరించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఏ రోజు, ఎన్ని గంటలకు ఎన్నిటేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందో రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కింపు
స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తరువాతనే ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్‌లో ఎప్పటి కప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేనివారిని, అనధికార వ్యక్తులను, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతున్నదని, స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరీంధర ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment