ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండి
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి
ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించొద్దని.. నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈనెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు, తర్వాత రోజుల్లో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలని మీనా సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
కౌంటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను భద్రపర్చాలి..
ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే వాయిదా వేయకుండా అదేరోజు ప్రతి ఈవీఎంకు సీల్‌వేసి భద్రపర్చాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుసటి రోజే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేశాం. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇండెక్స్ కార్డులో ఎలాంటి తప్పులకు ఆస్కారంలేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలి. ఆయా కార్డులు అన్నీ ఈనెల 8లోపు మా కార్యాలయానికి అందజేయాలి.
ప్రతి టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్..
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్‌ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్‌కు అవకాశం కల్పించాలి. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం–17సి, పెన్ను లేక పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలిజ అంతకుమించి ఏమున్నా అనుమతించొద్దు. అథారిటీ లెటర్లు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారు సెల్‌ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పొద్దు. కౌంటింగ్ సెంటర్‌లోకి మాత్రం సెల్‌ఫోన్‌తో వారిని అనుమతించడానికి వీల్లేదు.
కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు..
ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందుకు తగ్గట్లుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం, నిష్క్రమణ ప్రణాళికను పటిష్టంగా ఏర్పాట్లుచేసుకోవాలి. ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్నిచోట్లా ఏర్పాటుచేయాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి.
అదనపు సీఈఓలు పి. కోటేశ్వరరావు, సీఈఓ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ సీఈఓ ఎస్. వెంకటేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్షరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment