ఈవీఎంలలో అవకతవకలున్నాయని ఈసీకి బాలినేని ఫిర్యాదు
ఈవీఎంలను వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని దరఖాస్తు
ఇందుకు బదులుగా మాక్ పోలింగ్‌కు కలెక్టర్ సన్నద్ధం
నిరాకరించిన వైఎస్సార్‌సీపీ.. ఆగిన ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా ‘సుప్రీం’ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మాక్ పోలింగ్‌తో మభ్యపుచ్చేందుకు చేసిన యత్నాలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్‌లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలెట్‌తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్‌కు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్‌ఓపీ ప్రకారం మాక్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.
పూర్తి వివరాలు ఇవ్వండి
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్‌ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment