వీవీప్యాట్‌ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్‌ | EVM Re-Verification: Balineni Unhappy With Officials Decision Amid HC Hearing | Sakshi
Sakshi News home page

ఒంగోలు ఈవీఎం వెరిఫికేషన్‌: వీవీప్యాట్‌ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్‌

Published Mon, Aug 19 2024 10:34 AM | Last Updated on Mon, Aug 19 2024 1:48 PM

EVM Re-Verification: Balineni Unhappy With Officials Decision Amid HC Hearing

ప్రకాశం, సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్‌ పిటిషన్‌ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్‌ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరఫున ప్రతినిధులు బయటకు వచ్చేయగా.. దీంతో అధికారులు రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను నిలిపివేశారు.

ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో వేరిఫికేషన్‌ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా. అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు.  ఇవాళ రీ చెకింగ్‌ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వేరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. 

రిట్‌ విచారణ రేపటికి..
ఈవీఎంల వేరిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో  బాలినేని వేసిన రిట్ పిటిషన్  విచారణ రేపటికి వాయిదా పడింది. మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి , సుప్రీంకోర్టు ఉత్వర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వేరిఫికేషన్, వీవీప్యాట్ లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. ఈసీ మాక్‌ పోలింగ్‌ చేస్తోందని బాలినేని తరఫు లాయర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని బాలనేని లాయర్‌ వాదించారు. దీంతో.. ఈసీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. 

ఆ 12 బూత్‌లలో.. 
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్‌ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.  ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది.

డమ్మీ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల(అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు) సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్‌ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement