రెండింటినీ ఎందుకు మ్యాచ్ చేయరు?
ఈసీని నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ఈసీ తీరు వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయని స్పష్టీకరణ
ఈవీఎంలపై తమ పోరాటం కొనసాగిస్తామని పునరుద్ఘాటన
అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలని వివరణ
సాక్షి, అమరావతి: ‘ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని 12 బూత్‌లలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటోంది. ఈవీఎం ఓట్లను.. వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు? రెండింటినీ ఎందుకు మ్యాచ్ చేయరు?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈసీ తీరు వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు.
ఈవీఎంలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘కోర్టులో వైఎస్సార్‌సీపీ వేసిన కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ మేము అడిగే ప్రాథమిక ప్రశ్న ఒక్కటే.. ఒంగోలు నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంలు.. వీవీప్యాట్ల సంఖ్యను మ్యాచ్ చేయాలని కోరాం. నిజంగానే ఎన్నికల కమిషన్ మనసులో కల్మషం లేకపోతే మ్యాచ్ చేసి చూపించొచ్చు కదా? మా సందేహాలే కాకుండా దేశంలోని అందరి సందేహాలు నివృత్తి అవుతాయి?.
కానీ, ఇదే ఈసీహైకోర్టులో.. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఈవీఎం, వీవీప్యాట్ల నంబర్లను వెరిఫై చేయమని చెప్పలేదని, మాక్ పోలింగ్ మాత్రమే చేయమని చెప్పిందని మాట్లాడుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం. ఈవీఎంలోని నంబర్.. వీవీప్యాట్‌లను మ్యాచ్ చేయకపోవడంతోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఆరు నెలలు దాటేస్తే వీవీప్యాట్లపై ఇంక్ పోతుందేమోనని ఎదురు చూస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఇది అన్యాయం. అమెరికా, యూకేతో సహా 90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం అన్నది ప్రబలంగా ఉండటం కాదు.. అది ప్రబలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రజాస్వామ్యంలో విలువలను నిలబెట్టాలి.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment