ongolu
-
బెడిసికొట్టిన ‘మాక్’ నాటకం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా ‘సుప్రీం’ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మాక్ పోలింగ్‌తో మభ్యపుచ్చేందుకు చేసిన యత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్‌లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలెట్‌తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్‌కు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.పూర్తి వివరాలు ఇవ్వండిసుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం
ఒంగోలు టౌన్: ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌ను ప్రారంభించినట్లు హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు తెలిపారు. ప్రకాశం జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో శనివారం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థ దృష్టిలో సమానమేనని స్పష్టం చేశారు. ఆర్థి క కారణాలతో న్యాయ పరమైన సేవల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసేందుకే ఈ ప్రక్రియను తీసుకొచ్చినట్లు తెలిపారు. అర్హులైన వారు ఉచితంగా న్యాయం అందకపోవడం వలన నష్టపోయామని బాధపడకూడదనేదే లీగల్ ఎయిడ్ ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా నియమితులైన జి.రవిశంకర్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా నియమితులైన డి.బ్లెస్సీలను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఆర్.శివకుమార్, డి.అమ్మనరాజా, టి.రాజా వెంకటాద్రి, ఎంఏ సోమశేఖర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యాలయం ఉద్యోగులే దొంగలు!
సాక్షి, ఒంగోలు : కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులే ఆ సంస్థలో వస్తువులను కాజేశారు. ఈ సంఘటన స్థానిక ఏనుగుచెట్టు సమీపంలోని డీటీడీసీ కార్యాలయంలో వెలుగు చూసింది. ఒన్‌టౌన్ సీఐ ఎం.భీమానాయక్ కేసు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరు పరిచారు. సీఐ కథనం ప్రకారం.. డీటీడీసీ కార్యాలయం నిర్వాహకుడు జొన్నగలగడ్డ శ్రీనివాసరావు ఇటీవల పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. డెలివరీ చేయాల్సిన పార్శిల్ వస్తువులు చోరీ అయ్యాయనేది ఆ ఫిర్యాదు సారాంశం. చోరీ సొత్తు విలువ రూ.4 లక్షలు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ముందుగా డీటీడీసీ కార్యాలయంలోని సీసీ పుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో లభించిన సమాచారం ఆధారంగా రాత్రి వేళ కార్యాలయంలో విధుల్లో పనిచేసిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిఘా ఉంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అయినాబత్తిన చిరంజీవి, అతడిచ్చిన సమాచారంతో అదే కార్యాలయంలో పనిచేసే కాకా మణికంటేశ్వరరావులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వివిధ కంపెనీలకు చెందిన 11 మొబైల్ ఫోన్లు, వైర్లెస్ స్పీకర్–1, సన్ గ్లాసెస్–1, బైక్ హారన్–1, రిస్ట్వాచి–1 స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలుగా నిర్థారించారు. ఈ కేసులో మరో నిందితుడు హరిప్రసాద్ అలియాస్ హరి కోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ఎస్ఐ నఫీజ్ బాషా, సిబ్బంది కృషి చేశారంటూ వారిని సీఐ భీమానాయక్ అభినందించారు. -
‘పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రారంభింపచేస్తాం’
సాక్షి, ప్రకాశం : ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి సమీక్షించారు. జిల్లాలో గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య ఉందన్నారు. ఒంగోలు, మర్కాపురంలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కావరిడార్ పనులపై త్వరలో సమీక్షిస్తామన్నారు. రైతులకు పగటిపైట తొమ్మిది గంటల నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్రిపుల్ ఐటీ తరగతులను ఒంగోలుకు తీసుకొస్తాం : ఆదిమూలపు జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం ఇడుపులపాయలో నడుస్తోందని, ఆ తరగతులను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు త్వరలో జిల్లాల వారీగా సర్టిఫికేట్ల వెరిఫికేష్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రెండు ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాని మారుస్తామన్నారు. -
ఓట్ల కోసం వంచన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు పెన్నా–గోదావరి అను సంధానంతో 2019 నాటికి జిల్లాలోని ఆయకట్టుకు నీళ్లు ఇస్తామంటూ జిల్లా వాసులను మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గత రెండేళ్లుగా నాగార్జున సాగర్‌కు నీరు చేరినా జిల్లాలోని సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు చంద్రబాబు సర్కారు నీరిచ్చిన పాపాన పోలేదు. గత ఏడాది సాగర్‌లో 580 అడుగుల మేర నీరు చేరింది. ఈ ఏడాది సైతం 582 అడుగుల నీరు వచ్చింది. కాని సర్కారు జిల్లా పరిధిలోని 4.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చిన పాపాన పోలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో సాగర్‌లో 545 అడుగులమేర నీరు ఉన్నప్పుడే వరితో పాటు ఆరుతడి పంటలకు పూర్తి ఆయకట్టుకు నీరిచ్చారు. ఈ ఏడాది 582 అడుగుల మేర సాగర్‌కు నీరు చేరినా ప్రభుత్వం 1.85 లక్షల మాగాణిలో సగం పొలానికి కూడా నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఆరుతడి పంటలకు సైతం సక్రమంగా నీరు అందే పరిస్థితి లేదు. ఎన్నికల వేళ కొత్త పల్లవి.. నాలుగేళ్లుగా తీవ్ర వర్షాభావంతో జిల్లా రైతాంగం అతలాకుతలమైనా బాబు సర్కారుకు పట్టలేదు. తీరా ఎన్నికల కోసం పెన్నా–గోదావరి అనుసంధానమంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. గోదావరి నది నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువలోకి నీటిని తరలిస్తారట. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని చేర్చి బ్యారేజీ ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మొత్తంగా 5 దశల్లో నీటిని ఎత్తి పోసి నకరికల్ వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని మల్లిస్తారట. ఈ రకంగా సాగర్ కుడికాలువ పరిధిలోని 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తారట. మొత్తం పనులు పూర్తి చేసి 2019 నాటికి సాగర్ కుడికాలువ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నాలుగున్నరేళ్ల పాటు ఇవేమి పట్టించుకోని చంద్రబాబుకు తీరా ఎన్నికల వేళ పెన్నా–గోదావరి అను సంధానం గుర్తొచ్చింది. ఓట్ల కోసమే చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా సాగర్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వని చంద్రబాబు ఇప్పుడు గోదావరి–పెన్నా ద్వారా నీరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. మొదలేపెట్టని ప్రాజెక్టును పూర్తి చేసి 2019 నాటికే నీరిస్తామని బాబు చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకు వ్యవసాయమన్నా..రైతులన్నా ప్రేమలేదు. ఏ మాత్రం ప్రేమ ఉన్నా జిల్లాలో అరకొర పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీరిచ్చేవారు కానీ ఆయన పట్టించుకోలేదు. నాలుగున్నరేళ్లలో వాటి జోలికి వెళ్లలేదు. ప్రాజెక్టుల జోలికి వెళ్లని బాబు.. ప్రకాశం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో 4.43,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 885 గ్రామాలకు తాగునీటిని అందించే వెలిగొండ ప్రాజెక్టుకు పేరుకు చంద్రబాబు శంకుస్థాపన చేసిన రూ.3వేల కోట్ల నిధులిచ్చి 75 శాతం పనులను పూర్తి చేసిన ఘనత దివంగతనేత వైఎస్‌ది. మిగిలిన 25 శాతం పనులు రూ.1640 కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉన్నా నాలుగున్నరేళ్లలో చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. పై పెచ్చు రూ.990.49 కోట్లు ఖర్చు చేసినట్లు బాబు సర్కారు చూపిస్తున్నా 5 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. వెలిగొండ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రాజెక్టు అంచనాలను రూ.2634 కోట్లకు పెంచుకున్నారు తప్పించి పనులు వేగవంతం చేయలేదు. 60 సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్లను మార్చి కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినా ఇప్పటికి పనులు మొదలు కాలేదు. అంచనా వ్యయం పెంచిన సర్కారు 2018 నాటికి ఫేజ్ 1 పనులు పూర్తి చేస్తామని చెప్పినా నెరవేరలేదు. 2019లో కూడా పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే వెలిగొండ పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంచనాలు పెంచుకున్నారు... గుండ్లకమ్మ ప్రాజెక్టుది ఇదే పరిస్థితి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుండ్ల ప్రాజెక్టుకు ’592.18 కోట్లు నిధులుఇచ్చి 95 శాతం పనులను పూర్తి చేశారు. 2008 నవంబర్ 24న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు వైఎస్. అదే ఏడాది 45 వేల ఎకరాలకు నీరిచ్చారు. తరువాత కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు కింద 60 వేల ఎకరాలకు నీరిచ్చారు. కేవలం 23 ఎకరాల భూమిని సేకరించి మిగిలిన పోయిన డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేస్తే 80వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందించడంతో పాటు లక్షలాది మంది దాహార్తి తీర్చవచ్చు. రూ.13 కోట్లతో పూర్తి అయ్యే పనుల అంచనాలను రూ.161.65 కోట్లకు పెంచుకున్నారు. అయినా నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు పనులు పూర్తి చేయలేదు. చంద్రబాబుకు ప్రాజెక్టులన్నా, రైతాంగమన్నా ప్రేమ లేదనడానికి ఇదో ఉదాహరణ. ఇక నాగార్జున సాగర్ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాలో 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్‌లో నీరు ఉన్నప్పుడు కూడా ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా బాబు సర్కారుకు తట్టడం లేదు. దీంతో నాలుగేళ్లుగా కరువులతో జిల్లా రైతాంగం కుదేలైంది. తిండి గింజలు, పశువులకు గ్రాసం దొరకక రైతాంగం అల్లాడి పోతోంది. అయినా చంద్రబాబు సర్కారుకు ఏ మాత్రం కనికరం లేదు. కళ్లముందున్న నీటిని కూడా ఆయకట్టుకు ఇవ్వని సర్కారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గోదావరి–పెన్నా అను సంధానం చేసి నీరిస్తామని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇదేం పని సారూ..
బంగోలు: పాఠశాలల్లో పారిశుద్ద్య కార్మికులు లేరు...గత ఆగస్టు నుంచి కాని ప్రధానోపాధ్యాయుల తప్పుడు రాతలతో ఉన్నట్టు రాసి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం వెలుగు ద్వారా గత ఏడాది తాత్కాలిక పద్ధతిపై కార్మికులను నియమించింది. అయితే జూలై తరువాత ఆమోదం లేకపోవటంతో గత ఏడాది ఆగస్టు 1 నుంచి పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తొలగించారు. విద్యాశాఖ, వెలుగు అధికారులు మూడు రోజుల నుంచి హడావుడిగా ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి మీ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేసినట్లుగా యుటిలైజేషన్ సర్టిఫికెట్ తేవాల్సిందిగా చెప్పారు. మార్కాపురం మండలంలో 78పాఠశాలలు ఉండగా, 60పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ కార్యాలయానికి యూసీలు అందించారు. ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికునికి నెలకు రూ.1800 వెలుగు ద్వారా అందిస్తారు. గత సంవత్సరం నుంచి లేని కార్మికులను ఉన్నట్టు రికార్డులలో చూపి హెచ్ఎంలే డబ్బులు తీనడానికి పూనుకున్నారని తెలిసింది అధికారులకు దీంతో వారు చర్యలు తప్పవని హెచ్చరించారు. వెలుగు ఏపీఎం రమేష్‌ను వివరణ కోరగా ప్రభుత్వం జూన్, జూలైకి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.