సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు పెన్నా–గోదావరి అను సంధానంతో 2019 నాటికి జిల్లాలోని ఆయకట్టుకు నీళ్లు ఇస్తామంటూ జిల్లా వాసులను మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గత రెండేళ్లుగా నాగార్జున సాగర్‌కు నీరు చేరినా జిల్లాలోని సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు చంద్రబాబు సర్కారు నీరిచ్చిన పాపాన పోలేదు. గత ఏడాది సాగర్‌లో 580 అడుగుల మేర నీరు చేరింది.
ఈ ఏడాది సైతం 582 అడుగుల నీరు వచ్చింది. కాని సర్కారు జిల్లా పరిధిలోని 4.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చిన పాపాన పోలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో సాగర్‌లో 545 అడుగులమేర నీరు ఉన్నప్పుడే వరితో పాటు ఆరుతడి పంటలకు పూర్తి ఆయకట్టుకు నీరిచ్చారు. ఈ ఏడాది 582 అడుగుల మేర సాగర్‌కు నీరు చేరినా ప్రభుత్వం 1.85 లక్షల మాగాణిలో సగం పొలానికి కూడా నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఆరుతడి పంటలకు సైతం సక్రమంగా నీరు అందే పరిస్థితి లేదు.
ఎన్నికల వేళ కొత్త పల్లవి..
నాలుగేళ్లుగా తీవ్ర వర్షాభావంతో జిల్లా రైతాంగం అతలాకుతలమైనా బాబు సర్కారుకు పట్టలేదు. తీరా ఎన్నికల కోసం పెన్నా–గోదావరి అనుసంధానమంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. గోదావరి నది నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువలోకి నీటిని తరలిస్తారట. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని చేర్చి బ్యారేజీ ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మొత్తంగా 5 దశల్లో నీటిని ఎత్తి పోసి నకరికల్ వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని మల్లిస్తారట. ఈ రకంగా సాగర్ కుడికాలువ పరిధిలోని 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తారట. మొత్తం పనులు పూర్తి చేసి 2019 నాటికి సాగర్ కుడికాలువ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
నాలుగున్నరేళ్ల పాటు ఇవేమి పట్టించుకోని చంద్రబాబుకు తీరా ఎన్నికల వేళ పెన్నా–గోదావరి అను సంధానం గుర్తొచ్చింది. ఓట్ల కోసమే చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా సాగర్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వని చంద్రబాబు ఇప్పుడు గోదావరి–పెన్నా ద్వారా నీరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. మొదలేపెట్టని ప్రాజెక్టును పూర్తి చేసి 2019 నాటికే నీరిస్తామని బాబు చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకు వ్యవసాయమన్నా..రైతులన్నా ప్రేమలేదు. ఏ మాత్రం ప్రేమ ఉన్నా జిల్లాలో అరకొర పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీరిచ్చేవారు కానీ ఆయన పట్టించుకోలేదు. నాలుగున్నరేళ్లలో వాటి జోలికి వెళ్లలేదు.
ప్రాజెక్టుల జోలికి వెళ్లని బాబు..
ప్రకాశం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో 4.43,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 885 గ్రామాలకు తాగునీటిని అందించే వెలిగొండ ప్రాజెక్టుకు పేరుకు చంద్రబాబు శంకుస్థాపన చేసిన రూ.3వేల కోట్ల నిధులిచ్చి 75 శాతం పనులను పూర్తి చేసిన ఘనత దివంగతనేత వైఎస్‌ది. మిగిలిన 25 శాతం పనులు రూ.1640 కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉన్నా నాలుగున్నరేళ్లలో చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. పై పెచ్చు రూ.990.49 కోట్లు ఖర్చు చేసినట్లు బాబు సర్కారు చూపిస్తున్నా 5 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
వెలిగొండ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రాజెక్టు అంచనాలను రూ.2634 కోట్లకు పెంచుకున్నారు తప్పించి పనులు వేగవంతం చేయలేదు. 60 సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్లను మార్చి కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినా ఇప్పటికి పనులు మొదలు కాలేదు. అంచనా వ్యయం పెంచిన సర్కారు 2018 నాటికి ఫేజ్ 1 పనులు పూర్తి చేస్తామని చెప్పినా నెరవేరలేదు. 2019లో కూడా పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే వెలిగొండ పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
అంచనాలు పెంచుకున్నారు...
గుండ్లకమ్మ ప్రాజెక్టుది ఇదే పరిస్థితి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుండ్ల ప్రాజెక్టుకు ’592.18 కోట్లు నిధులుఇచ్చి 95 శాతం పనులను పూర్తి చేశారు. 2008 నవంబర్ 24న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు వైఎస్. అదే ఏడాది 45 వేల ఎకరాలకు నీరిచ్చారు. తరువాత కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు కింద 60 వేల ఎకరాలకు నీరిచ్చారు. కేవలం 23 ఎకరాల భూమిని సేకరించి మిగిలిన పోయిన డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేస్తే 80వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందించడంతో పాటు లక్షలాది మంది దాహార్తి తీర్చవచ్చు. రూ.13 కోట్లతో పూర్తి అయ్యే పనుల అంచనాలను రూ.161.65 కోట్లకు పెంచుకున్నారు. అయినా నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు పనులు పూర్తి చేయలేదు.
చంద్రబాబుకు ప్రాజెక్టులన్నా, రైతాంగమన్నా ప్రేమ లేదనడానికి ఇదో ఉదాహరణ. ఇక నాగార్జున సాగర్ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాలో 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్‌లో నీరు ఉన్నప్పుడు కూడా ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా బాబు సర్కారుకు తట్టడం లేదు. దీంతో నాలుగేళ్లుగా కరువులతో జిల్లా రైతాంగం కుదేలైంది. తిండి గింజలు, పశువులకు గ్రాసం దొరకక రైతాంగం అల్లాడి పోతోంది. అయినా చంద్రబాబు సర్కారుకు ఏ మాత్రం కనికరం లేదు. కళ్లముందున్న నీటిని కూడా ఆయకట్టుకు ఇవ్వని సర్కారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గోదావరి–పెన్నా అను సంధానం చేసి నీరిస్తామని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment