రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తిచేసినందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా అభినందనలు తెలిపారు. ఇటువంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు.
ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాలవారికి ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుసరించిన వినూత్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు రోజుల్లో తమ కార్యాలయానికి నివేదికలు పంపాలని కోరారు.
అన్ని జిల్లాల నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి పంపుతామని చెప్పారు. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విమర్శలకు ఆస్కారం లేకుండా రూపొందించిన శుద్ధమైన ఓటర్ల జాబితా మొత్తం ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు నాందిపలికిందని చెప్పారు.
ఈ జాబితా రూపొందించేందుకు కృషిచేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేంతవరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండలస్థాయి వరకు ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించినట్లు చెప్పారు.
ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అవిరళ కృషిచేసిందన్నారు. కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహంచడంలో సహకరించిన రాజకీయపక్షాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment