విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీల్లో హైడ్రామా
ఈవీఎంల ట్రంక్‌బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణ
బృందంతో కలసి గోదాం వద్ద కలెక్టర్ పడిగాపులు
ఎట్టకేలకు మధ్యాహ్నం ఒంటి గంటకు మాక్ పోలింగ్.. అర్ధరాత్రి దాకా కొనసాగిన ప్రక్రియ
బ్యాటరీ చార్జింగ్ స్టేటస్‌పై అనుమానాలను నివృత్తి చేయకుండా కొత్త బ్యాటరీ వినియోగం
పార్టీల గుర్తులు కాకుండా ఇష్టానుసారంగా గుర్తుల లోడింగ్
నేడు కూడా కొనసాగనున్న ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతుండగా వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద జరిగిన హైడ్రామానే దీనికి నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు.. ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం దొరకలేదని తాపీగా చెప్పడంతో దాదాపు రెండు మూడు గంటల పాటు గందరగోళం నెలకొంది. అన్నిచోట్లా గాలించి ఎట్టకేలకు తాళం చెవి తెచ్చేవరకు ఈవీఎంల గోదాం వద్ద కలెక్టర్ తన బృందంతో కలసి పడిగాపులు కాయక తప్పలేదు.
సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు – వీవీ ప్యాట్లలో ఓట్ల స్లిప్పులను లెక్కించి సరిపోల్చాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ కనీసం 50 శాతమైనా వినియోగమై ఉంటుందన్నారు. అయితే దాదాపు 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం వాటిని తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అందువల్ల గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబరు 20లో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని కోరారు.
తలుపులు తెరిచారు.. తాళం చెవి మరిచారు
పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను, వీవీ ప్లాట్లను నెల్లిమర్లలోని గోదాంలో భద్రపరిచారు. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టరు ప్రతి నెలా వాటిని కచ్చితంగా తనిఖీ చేయాలి. బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు సోమవారం వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రెండు రోజుల క్రితమే అధికారులకు తెలుసు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల కల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు ఎన్నికల కమిషన్ నియమించిన బెల్ ఇంజనీర్ల బృందం గోదాం వద్దకు చేరుకుంది.
అయితే ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం మరచిపోయినట్లు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఆ తాళాలు కలెక్టరేట్‌లోని ఎన్నికల సెల్ వద్ద ఉండాలి. అయితే మధ్యాహ్నం కావస్తున్నా తాళం చెవి రాకపోవడంతో పగలగొట్టేందుకు అధికారులు సిద్ధం కాగా ఫిర్యాదుదారుల తరఫున హాజరైన బెల్లాన వంశీ అభ్యంతరం చెప్పారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎట్టకేలకు తాళాలు పట్టుకొచ్చి బాక్స్‌లను తెరిచారు.
మాక్ పోలింగ్‌లోనూ చిత్ర విన్యాసాలు..
ఫిర్యాదుదారులు పరిశీలించాలని కోరిన పెదకాద పీఎస్ నంబరు 20కి సంబంధించిన ఈవీఎంను బయటకు తీసి బ్యాటరీని సీజ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ బ్యాటరీకి బదులు కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పార్టీల గుర్తులు గాకుండా తమకు నచ్చిన గుర్తులు లోడ్ చేసి మాక్ పోలింగ్ ప్రారంభించారు. వీవీ ప్యాట్లను కూడా పెట్టలేదు. సుమారు 1,400 ఓట్లున్న పీఎస్‌కు సంబంధించిన ఈవీఎంను కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్థరాత్రి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ రోజు ఏవిధంగా ప్రక్రియ సాగిందో అదే రీతిలో నిర్వహిస్తేనే పవర్ ఎంత వినియోగమైందో తెలుస్తుందని, అలాకాకుండా మొక్కుబడిగా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఈవీఎం, వీవీ ప్యాట్లకు వినియోగించిన బ్యాటరీ స్టేటస్ కౌంటింగ్ నాటికి ఇంకా 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. మాక్ పోలింగ్ కోసం వాడిన బ్యాటరీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అధికారికంగా నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
నేడు కూడా తనిఖీ కొనసాగింపు...
విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్‌స్టేషన్ల తాలూకు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను తనిఖీ చేయాలన్న బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఆ ప్రక్రియ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment