డేటా మటాష్‌.. స్లిప్‌లు ‘బర్న్‌’ | Pressure on complainants to agree to mock polling | Sakshi
Sakshi News home page

డేటా మటాష్‌.. స్లిప్‌లు ‘బర్న్‌’

Published Wed, Aug 28 2024 4:17 AM | Last Updated on Wed, Aug 28 2024 12:54 PM

కలెక్టర్‌ను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

ఈవీఎం వెరిఫికేషన్‌లో రెండో రోజూ అదే తంతు

మాక్‌ పోలింగ్‌కు అంగీకరించాలని ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు

బ్యాటరీ స్టేటస్, వీవీ ప్యాట్లను లెక్కించాలని బెల్లాన, బొత్స పట్టు

వీవీ ప్యాట్లను లెక్కించకుంటే ఏం ఉపయోగమని నిలదీత

ఈవీఎంలో డేటా, వీవీ ప్యాట్లలో స్లిప్పులు అంతా ఖాళీ..

పోలింగ్‌ ప్రక్రియపై వివాదం ఉన్నా భద్రపరచకపోవడంపై సందేహాలు

మాక్‌ పోలింగ్‌ మినహా మరేమీ చేయలేమని చేతులెత్తేసిన అధికారులు

తొలిరోజు మాక్‌ పోలింగ్‌లో 80 శాతానికి తగ్గిన బ్యాటరీ స్టేటస్‌ 

ఈసీ ఎస్‌వోపీల్లో బ్యాటరీ పవర్‌ పర్సంటేజీ అంశం లేదన్న బెల్‌ ఇంజనీర్లు

ఈవీఎం పరిశీలనకు నిరాకరించిన బెల్లాన... ఫలితంగా పరిశీలన జరగలేదన్న కలెక్టర్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్‌ ప్రక్రియలో అధికారుల వ్యవహారశైలి తొలి నుంచీ అనుమా­నాస్పదంగానే ఉంటోంది. కలెక్టరేట్‌లోని ఎన్నికల సెల్‌లో ఉండాల్సిన ఈవీఎంలు భద్రపరిచిన బాక్సు తాళం చెవులు మరోచోట ప్రత్యక్షమవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతూనే ఉంది. బ్యాటరీ స్టేటస్‌పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీ– వెరిఫికేషన్‌ ప్రక్రియలో.. కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్‌ పోలింగ్‌ వ్యవహారం రెండో రోజూ అదే అనుమానాలతో కొనసాగింది. 

ఫిర్యాదు­దారులు కోరినట్లుగా వెరిఫికేషన్‌ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చిచెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని (ఎరేజ్‌).... అంతేకాకుండా వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్‌’’ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించగా దీనిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్సార్‌ సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల­నర్సయ్య, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ జూన్‌ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. 

ఒకవైపు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అనుమానాలు ఉన్నాయని, రీ–వెరిఫికేషన్‌ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనలను పరిష్కరించకుండానే డేటాను తొలగించాలంటూ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడటం వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రీ–వెరిఫికేషన్‌లో పార్టీల గుర్తులు కాకుండా ఇష్టారీతిన గుర్తులను కేటాయించి మాక్‌ పోలింగ్‌ నిర్వహించడం మొదలు అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు ఎన్నికల కమిషన్‌ ప్రస్తుత టెక్నికల్‌ నిబంధనల్లో (ఎస్‌వోపీ) బ్యాటరీ పవర్‌ పర్సంటేజీ అంశం లేదని బెల్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎం పరిశీలనకు అభ్యర్థి అభ్యర్థి బెల్లాన నిరాకరించినందున మంగళవారం పరిశీలన జరగలేదని కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

21 రోజుల తరువాత 99 శాతం బ్యాటరీ స్టేటస్‌..
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద రెండో రోజు మంగళవారం కూడా హైడ్రామా కొనసాగింది. ఈవీఎంల సేఫ్‌ ట్రంక్‌ బాక్స్‌ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యం చేసిన అధికారులు అర్ధరాత్రి వరకూ మాక్‌ పోలింగ్‌ కొనసాగించారు. కొత్త బ్యాటరీ ఉపయోగించగా మాక్‌ పోలింగ్‌ ముగిసే సమయానికి 80 శాతం స్టేటస్‌ చూపించింది. 

అంటే 20 శాతం తగ్గింది. కానీ మే 13వ తేదీ పోలింగ్‌ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్‌ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం చూపించడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలింగ్‌ రోజు వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, వీవీ ప్యాట్ల లెక్కింపుతో పాటు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ ఫుటేజీని ఇవ్వాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్‌ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్‌ నమోదైందని తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈవీఎంకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ స్టేటస్‌ 50 శాతం ఉన్నట్లు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యిందని పేర్కొన్నారు. పోలింగ్‌ తర్వాత రమారమి 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ కోసం తెరచినప్పుడు బ్యాటరీ స్టేటస్‌ (పవర్‌) 99 శాతం చూపించడంపై సందేహం వ్యక్తం చేశారు. 

ఈ దృష్ట్యా గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ 20లో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల బ్యాటరీ స్టేటస్‌ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్‌ చేయాలని బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌ను కోరారు. 

అలాగే విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్‌స్టేషన్ల తాలూకు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్‌ తెలియచేయాలని, వీవీ ప్యాట్లను ఓట్లతో సరిపోల్చి లెక్కించాలని, ఆయా పోలింగ్‌ స్టేషన్లలో సీసీ ఫుటేజీ ఇవ్వాలని బెల్లాన చంద్రశేఖర్‌ ఎన్నికల కమిషన్‌ను కోరారు. 

అందుకు అవసరమైన రుసుము వారిద్దరూ చెల్లించారు. అయితే దీని పరిశీలనకు నెల్లిమర్ల ఈవీఎం గోదాం వద్దకు వెళ్లగా... ఈసీఐ ప్రస్తుత టెక్నికల్‌ ఎస్‌వోపీల్లో బ్యాటరీ పవర్‌ పర్సంటేజీ అంశం లేదని బెల్‌ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని బెల్లానకు అధికారులు వివరించారు. దీంతో ఆయన రీ–వెరిఫికేషన్‌కు నిరాకరించారు.

డేటా అంతా ఖాళీయే...
ఫిర్యాదుదారులు కోరినట్లు వెరిఫికేషన్‌ చేయడానికి వీలుకాదని, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈవీఎం డేటా తీసేశామని (ఎరైజ్‌), వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్‌’’ చేశామని అధికారులు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి నిబంధనల మేరకు ఈ డేటాను 45 రోజుల వరకూ భద్రపరచాలి. జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్‌ కోసం జూన్‌ 10వ తేదీన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

వెరిఫికేషన్‌ రుసుము చలానా ద్వారా చెల్లించారు. ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఆ ఈవీఎంల్లో డేటా, వీవీ ప్యాట్లలో స్లిప్పులను అధికారులు భద్రపరచాలి. కానీ వాటిని ఆగమేఘాలపై ఆనవాళ్లు లేకుండా చెరిపేయడం కొత్త సందేహాలకు తావిస్తోంది. పైగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే డేటా మొత్తం తొలగించినట్లు అధికారులు పేర్కొనడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది.

బ్యాటరీ స్టేటస్‌ గుట్టు రట్టు...
వెరిఫికేషన్‌ కోరిన పెదకాద పీఎస్‌ నంబర్‌ 20కు సంబంధించిన ఈవీఎంను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బయటకు తీసి దానికి సంబంధించిన బ్యాటరీని అధికారులు సీజ్‌ చేశారు. ఆ బ్యాటరీకి బదులు మరో కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్‌ పోలింగ్‌ను సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగించారు. పార్టీ గుర్తులు లోడ్‌ చేయకుండా మరేవో గుర్తులు లోడ్‌ చేసి సుమారు 1,400 ఓట్లు మాక్‌ పోలింగ్‌ చేశారు. 

ఇది ముగిసిన తర్వాత బ్యాటరీ స్టేటస్‌ పరిశీలిస్తే 80 శాతం నమోదు కావడం గమనార్హం. అలాంటప్పుడు పోలింగ్‌ రోజున ఈవీఎం, వీవీ ప్యాట్లకు వాడిన బ్యాటరీ స్టేటస్‌ 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత కౌంటింగ్‌ రోజున తెరిచేసరికి 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండ్‌ చేశారు. 

అయితే ఈ విషయం తాము తేల్చలేమని అధికారులు పేర్కొన్నారు. కేవలం మాక్‌ పోలింగ్‌లో బ్యాటరీ స్టేటస్‌ ఎంత ఉందో మాత్రమే చెబుతామని అధికారులు సమాధానమిచ్చారు. పాత బ్యాటరీ స్టేటస్‌ గుట్టు ఏమిటో వెల్లడించాలనేదీ తమ డిమాండ్‌ అని, అంతేకానీ  మాక్‌ పోలింగ్‌ కాదని ఫిర్యాదుదారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తమ డిమాండ్‌ను మెయిల్‌ ద్వారా పంపించారు.

ట్యాంపరింగ్‌ అయినట్లుంది...
కౌంటింగ్‌ రోజు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్‌ 99 శాతం చూపించిందని ఎన్నికల ఏజెంట్లంతా చెప్పారు. దీంతో జూన్‌ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. దాదాపు 12 గంటలకు పైగా పోలింగ్‌ కొనసాగడమే గాక 21 రోజుల పాటు స్టాండింగ్‌ మోడ్‌లో ఉన్నా కౌంటింగ్‌ రోజున తెరిచేసరికి బ్యాటరీ స్టేటస్‌ 99 శాతం ఎలా ఉందనేది మా ప్రశ్న. కానీ అధికారులు మేము కోరినట్లు కాకుండా కొత్త బ్యాటరీతో మాక్‌ పోలింగ్‌ చేస్తామన్నారు. దీన్ని మేం వ్యతిరేకించాం. 

ఆ బ్యాటరీ స్టేటస్‌ ఇప్పుడు చూసినా 99 శాతం ఎందుకు కనిపిస్తోంది? ఉపయోగించిప్పుడు తగ్గిపోవాలే కానీ పెరగడం ఏమిటన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్‌ సరైన సమాధానం ఇవ్వలేకపోతోంది. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఈసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని నాకు అనిపిస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నాం.
– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, విజయనగరం

కౌంటింగ్‌ రోజే  ప్రశ్నించాం..
ఈవీఎం బ్యాటరీ స్టేటస్‌ 99 శాతం ఉండటాన్ని కౌంటింగ్‌ రోజే మా పార్టీ ఏజెంట్లు గుర్తించారు. అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదన్నారు. జూన్‌ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. పెదకాద పోలింగ్‌ స్టేషన్‌లో ఉదయం 7 నుంచి రాత్రి 8:30 గంటల వరకూ దాదాపు 1,400 ఓట్ల పోలింగ్‌ జరిగింది. ఈ ప్రక్రియలో బ్యాటరీ స్టేటస్‌ తగ్గాలి కానీ 21 రోజుల తర్వాత కౌంటింగ్‌ రోజు కూడా 99 శాతం ఉండటం సందేహాలకు తావిస్తోంది. 

ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని అన్ని రాజకీయ పార్టీలూ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కొత్త బ్యాటరీతో మాక్‌ పోలింగ్‌ చేస్తే బ్యాటరీ స్టేటస్‌ 80 శాతానికి తగ్గింది. దీనిపై సందేహాలను నివత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని, అదనంగా ఈవీఎంలను కొనుగోలు చేశారని.. ఇలా పలు చర్చలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. వీటన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాలి.
– బొత్స అప్పలనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం

నిలిచిన ఈవీఎం పరిశీలన
నెల్లిమర్ల ఈవీఎం గోదాంలో ఈవీఎం పరిశీలన ప్రక్రియ నిలిచిపోయినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ కేంద్రం కంట్రోల్‌ యూనిట్‌ బ్యాటరీ పవర్‌ పర్సంటేజ్‌ను అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ అడిగారని, అయితే ఈసీఐ ప్రస్తుత టెక్నికల్‌ ఎస్‌వోపీలో బ్యాటరీ పర్సంటేజ్‌ లేదని బెల్‌ ఇంజనీర్లు, అధికారులు ఆయనకు తెలియజేశారని పేర్కొన్నారు. దీంతో ఆయన నిరాకరించడంతో ఈవీఎం పరిశీలన జరగలేదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement