వేసిన ఓటు ఎక్కడికి పోతోందోనని ప్రజల్లో అనుమానం
ఈవీఎంలను గతంలో చంద్రబాబు వ్యతిరేకించినందున వాటి గోల్‌మాల్‌పై ఇప్పుడాయన మాట్లాడాలి
ఏపీ ఫలితాలతోనే కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన పరిస్థితి ఏర్పడింది
ఇదే మంచి అవకాశం.. రాష్ట్ర ప్రయోజనాలపై బాబు పోరాడాలి
వైఎస్సార్‌సీపీ పనైపోయిందనుకోవద్దు
11 స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్ల శాతం బాగుంది
అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగించాలి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి, రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయంటూ కమ్యూనిస్టులు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల నిమిత్తం 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే.. వీటిలో 40 లక్షలు వినియోగించారని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడో ఒకచోట ఉండాలి కదా అని ప్రశ్నించారు.
ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్‌ను కోరితే.. తమకేం తెలీదని.. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్‌ను అడగాలంటూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఓ కమ్యునిస్టు నేత సైతం ఇదే అనుమానం వ్యక్తంచేశారన్నారు.
ఈవీఎంల గోల్‌మాల్ అంశాన్ని ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు. గతంలో ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తంచేసినందున ఇప్పుడు ఈవీఎంల గోల్‌మాల్‌పై విచారణకు ఆయన డిమాండ్ చేయాలని కోరారు. తాము వేసిన ఓటు ఎవరికి వెళ్లిందోననే అపోహ ప్రస్తుతం నెలకొందని, ప్రజల్లో అటువంటి అనుమానం రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనిపై చంద్రబాబు దృష్టిపెట్టాలని ఉండవల్లి సూచించారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములకు ఓట్ల తేడా కేవలం 1.9 శాతం మాత్రమేనన్నారు. అహంకారం పెరిగిపోయిందని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ అని ఉండవచ్చన్నారు.
వైఎస్సార్‌సీపీకి మళ్లీ మంచి రోజులు..
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకోవద్దని.. ఓటమి పాలైన ఆ పార్టీ నాయకులు నిరాశ చెందాల్సిన అవసరంలేదన్నారు. 11 స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్ల శాతం బాగుందని.. వారికి మళ్లీ మంచి రోజులు రావచ్చని ఉండవల్లి చెప్పారు. గతంలో ఓటమి చెందిన చంద్రబాబు ప్రస్తుత గెలుపే దీనికి నిదర్శనమన్నారు. ఇదే తరహా పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో సైతం గతంలో చోటుచేసుకున్నాయని చెప్పారు.
తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి 169, జయలలిత పార్టీకి 30 సీట్లు వచ్చాయని.. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలితకు 225, కరుణానిధికి 7 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పారు. అలాగే, 1996లో కరుణానిధి 221 సీట్లు సాధించగా.. జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమయ్యారన్నారు.
మళ్లీ 2011 ఎన్నికల్లో జయలలిత ఏకంగా 203 సీట్లు సాధించారని చెప్పారు. దీనినిబట్టి చూస్తే రాజకీయాల్లో నిస్సత్తువ ఉండకూడదని ఉండవల్లి అన్నారు. వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలి..
మరోవైపు.. ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, ఆయన ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రానికి అందాల్సిన నిధుల సాధనకు కృషిచేయాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు ఏపీకి రూ.1.42 లక్షల కోట్లలో 50 శాతం ఆస్తులు రావాలని, వాటిని సాధించుకునేందుకు పోరాడాలని సూచించారు.
రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014లో పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకుని, ఇప్పుడు బాబు చర్చకు డిమాండ్ చేయాలన్నారు. అలాగే, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై నోటీసు ఇప్పించాలన్నారు. వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్లపై సైతం చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసును చంద్రబాబు ప్రభుత్వమే సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని ఉండవల్లి చెప్పారు.
జగన్ జైలుకెళ్లే అవకాశం ఉండదు..
అక్రమాస్తుల కేసులో జగన్ మళ్లీ జైలుకెళ్లే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అన్ని చార్జిషీట్లూ పూర్తయ్యాయని చెప్పారు. ఇక కమ్మ, కాపులది డెడ్లీ కాంబినేషన్ అని.. కసి, పట్టుదలవల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారని, ఆయనపై జగన్ కక్షసాధింపు చర్యలు చేపట్టారని ప్రజలు నమ్మారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్‌సీపీ ఓటమికి మద్యం పాలసీ కూడా ఒక కారణం కావచ్చునన్నారు. ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అలాంటి వారివల్లే కొంతమంది వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment