సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ల భద్రత, తరలింపు వంటి అంశాల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కండ్లకోయ గ్రామంలో ఉన్న ఏఎంసీ గోదాంను రాష్ట్ర స్థాయిలో కేంద్ర గోదాంగా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడికి తీసుకువచ్చే, ఇక్కడి నుంచి తీసుకుపోయే ఈవీఎంల కదలికలు, ఇక్కడ ఉంచిన వాటికి భద్రత కల్పించడం వంటి విషయాలపై ఎప్పటికప్పడు రాజకీయ పార్టీలకు తగిన సమాచారం అందిస్తామన్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఈ కింది నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
కేటగిరి–ఏ: ఓట్లతో నిండిన ఈవీఎంలను పోలింగ్ ముగిసిన తరువాత నిబంధనల పాటిస్తూ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలి.
కేటగిరి–బీ: కొన్ని ఓట్లు పోలైన తరువాత లోపాల కారణంగా తొలగించిన ఈవీఎంలను తగిన విధివిధానాలను పాటించిన తరువాత కేటగిరీ–ఏ ఈవీఎంతో పాటే, విడిగా భద్రపరచాలి.
కేటగిరి–సీ: పోలింగ్ ప్రారంభానికి ముందే లోపాలు బయటపడి తొలగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా వేరే గదిలో భద్రపరచాలి. తరువాత తగిన విధివిధానాలు అనుసరించి వాటిని సంబంధిత తయారీదారుకు తిప్పి పంపాలి.
కేటగిరి–డీ: ముందు జాగ్రత్త కోసం అదనంగా తెప్పించి, పోలింగ్‌కు అసలు ఉపయోగించకుండా సెక్టార్/జోనల్/ ఏరియా మేజిస్ట్రేట్ దగ్గర రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా విడిగా మరో గదిలో భద్రపరచాలి.
మూడంచెల భద్రత...
ఈవీఎంలను ఉంచిన ప్రదేశం చుట్టూ తొలి భద్రతావలయంగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సీపీఎఫ్) రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాయి. దాని తర్వాత భద్రతా వలయంగా రాష్ట్ర సాయుధ దళం కాపలా కాస్తుంది. ఆ రెండింటి చుట్టూ ఉన్న ప్రాంత వలయాన్ని జిల్లా ఎగ్జిక్యూటివ్ దళం కనిపెట్టుకుని ఉంటుంది. ఓట్లతో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కనీసం ఒక ప్లటూన్ ఉంటుంది. పరిశీలకులు లేదా జిల్లా ఎన్నికల అధికారులు లేదా పోలీస్ సూపరింటెండెంట్‌లు లేదా వారి ప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులతో సహా ఎవరైనా తొలి భద్రతా వలయంలోకి వెళ్లిరావాలంటే దానికి తగిన నియమాలను తప్పకుండా పాటించాలి. రెండో (మధ్య) భద్రతా వలయం దాటే వారి పేరు, తేదీ, సమయం, వ్యవధి అన్నీ కేంద్ర బలగాలు నిర్వహించే లాగ్ బుక్‌లో వివరంగా పేర్కొనాలి.
ఇటువంటి సందర్శనలను వీడియోగా చిత్రీకరించడానికి కేంద్ర బలగాలకు తగిన పరికరాలు ఇవ్వాలి. స్ట్రాంగ్ రూమ్ సందర్శించాలనుకునే అభ్యర్థుల ఏజంట్లను సీసీటీవీ ద్వారా చూడటానికి అనుమతించవచ్చు. దీనిని కూడా లాగ్ బుక్‌లో నమోదు చేయాలి. స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ పద్ధతి ఉండాలి. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, మరొకటి సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలూ ఒక కంట్రోల్ రూమ్ పని చేస్తుండాలి. ఒక పోలీస్ అధికారితో పాటూ, ఒక గెజిటెడ్ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండాలి. స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లడానికి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉండాలి. అగ్నిమాపక దళం తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతకు, ప్రొటోకాల్ అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యులు.
రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజూ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని అంతర్ వలయం (తొలి వలయం) వరకు ఉదయం, సాయంత్రం వెళ్లి లాగ్ బుక్‌ను, వీడియో చిత్రీకరణను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలి. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంగణంలోకి ఏ అధికారి, మంత్రి లేదా మరే ఇతర రాజకీయ నాయకులకు చెందిన వాహనాలను అనుమతించ కూడదు.
ఓట్ల లెక్కింపు జరిగే రోజున, అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఆర్‌ఓ, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో స్ట్రాంగ్ రూమ్‌ను తెరవాలి. ఈవీఎంలను కౌంటింగ్ కోసం బయటికి తీయడం, అది ముగిసిన తరువాత తిరిగి వాటిని తీసుకొచ్చి అక్కడ భద్రపరిచే కార్యక్రమాన్నంతా పూర్తిగా వీడియో తీయాలి. కౌంటింగ్ ముగిసిన తరువాత నిబంధనల ప్రకారం ఈవీఎంలను (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు), వీవీప్యాట్‌లను సీల్ వేసి భద్రపరచడానికి తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చాలి.
అభ్యర్థులకు.. ఎన్నికల సంఘానికి చెందిన సీఈఓ, అదనపు సీఈఓ, డీఈసీ ఇన్‌చార్జీలు, సంబంధిత డీఈఓ, ఎస్పీ, సీఓపీ, ఆర్‌ఓ ఫోన్ నంబర్లు ఇవ్వాలి. ఈ నియమనిబంధనల ప్రతులను అభ్యర్థులందరికీ, డీఈఓలకు, ఆర్‌ఓలకు, కేంద్ర బలగాల కమాండెంట్‌కు అందచేయాలి.
ఈవీఎంలకు ‘స్ట్రాంగ్’ భద్రత!
Published Sun, Apr 14 2019 1:36 AM | Last Updated on Sun, Apr 14 2019 1:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment