సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన 53 పోస్టులపై సుమోటోగా చర్యలు ప్రారంభించామని, వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచార కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రైవేటు కంపెనీ సేవలను ఎన్నికల సంఘం వినియోగించుకుంటోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించి ముందస్తు అనుమతి పొందాలని పార్టీలకు సూచించారు.
నామినేషన్ల దాఖలులో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుతో పాటు ఈవీఎంలు, వీవీ ప్యాట్, ఓటర్ల జాబితా తదితర అంశాల పట్ల ప్రతినిధులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. నామినేషన్ల పత్రాల సమర్పణలో జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే తిరస్కరణకు గురవుతాయన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లౌడ్ స్పీకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార వాహనాలను వినియోగించరాదన్నారు. ప్లాస్టిక్, పాలిథీన్ సామగ్రిని వాడొద్దని విజ్ఞప్తి చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ నియామకాల కోసం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సడలిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చినా, లోక్‌సభ ఎన్నికలు రావడంతో మళ్లీ అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సక్రమంగా నిర్వహించడంలో పార్టీలన్నీ సహకరించాలని కోరారు.
‘హిందువు’పదంపై ఫిర్యాదు
ఎన్నికల ప్రచారంలో ‘హిందువు’అనే పదాన్ని ఓ రాజకీయ నేత ప్రయోగించడంపై ఫిర్యాదు అందిందని రజత్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం జరిపిన ఎన్నికల ప్రచార ప్రసంగంలో.. బీజేపీ హిందూ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన సీనియర్ నేతను ఉద్దేశించి ఓ పత్రికలో తీవ్రమైన పదజాలంతో వార్త రావడంపై ఓ రాజకీయ పార్టీ నేత ఈ సమావేశంలో తమ దృష్టికి తెచ్చారని, ఈ వార్తను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు చేపట్టామని రజత్‌కుమార్ తెలిపారు. ప్రార్థనా స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుల, మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించి గెలిచారని ఎవరైనా హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. సీ–విజిల్ యాప్‌లో ఫిర్యాదుదారులు అప్‌లోడ్ చేసే వీడియోలను ఎన్నికల పిటిషన్ల విచారణకు వినియోగిస్తామన్నారు. మెట్రో రైలు కొత్త మార్గాన్ని గవర్నర్ ప్రారంభించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి రాదన్నారు.
అందులో నిజం లేదు..
ఎన్నికల సందర్భంగా పట్టుబడిన నగదులో 90 శాతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.127 కోట్లు పట్టు బడితే అందులో రూ.29.07 కోట్లను మాత్ర మే సరైన లెక్కలు చూపిన వారికి ఇచ్చామన్నారు. సీ–విజిల్ యాప్‌నకు ఇప్పటి వరకు 325 ఫిర్యాదులు అందాయని, అందులో మూడే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక నిర్వహించిన తనిఖీల్లో రూ.11.02 కోట్ల డబ్బు సీజ్ చేశామ న్నారు. లోక్‌సభ ఎన్నికల బందోబస్తు కోసం 145 కేంద్ర బలగాలను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందన్నారు. హ్యాకింగ్‌కు గురికాకుండా ఈవీఎంలు ఎలా స్వీయ రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్న అంశంపై రాజకీయ నేతలకు అదనపు సీఈవో బుద్ధప్రకాశ్ జ్యోతి వివరించారు. ఓటర్లకు, దివ్యాంగులకు రవాణా సౌకర్యం వివరాలను తెలిపే ‘నా ఓటు’అనే యాప్, ఓటు వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు 9223166166 నంబర్ సేవలు అందిస్తున్నట్లు జాయింట్ సీఈవో అమ్రపాలి తెలిపారు. మద్యం తయారీ కేంద్రా లు, విక్రయ కేంద్రాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లతో పటిష్టంగా నిఘా ఉంచామని, 340 సంచార బృందాలతో నిఘా కట్టుదట్టం చేసినట్లు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment