నియమావళి ఉల్లంఘించే అధికారులపై వేటు | Special surveillance on candidates social media accounts says Gopalakrishna Dwivedi | Sakshi
Sakshi News home page

నియమావళి ఉల్లంఘించే అధికారులపై వేటు

Published Wed, Mar 20 2019 4:32 AM | Last Updated on Wed, Mar 20 2019 4:32 AM

Special surveillance on candidates social media accounts says Gopalakrishna Dwivedi  - Sakshi

సాక్షి, అమరావతి: ఎవరైనా  అధికారులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా చట్టపరంగా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఎన్నికల నియమావళి పార్టీలకు మాత్రమే కాదని, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ అధికారులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేకపోతే ఎన్నికలు ప్రశాంతంగా జరపలేమని, ఇందుకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించేలా అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. పోటీ చేసే అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్‌ కమిటీ (ఎంసీసీ)పనిచేస్తోందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్‌ మీడియాల్లో ప్రకటనలు, పెయిడ్‌ ఆర్టికల్స్‌పై నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సోషల్‌ మీడియాకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలకు ఇప్పటికే 89 నోటీసులు జారీ చేశామన్నారు. ఇందులో భాగంగానే టీడీపీకి 48, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 30, జనసేన పార్టీకి 11 నోటీసులు ఇచ్చామని చెప్పారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు తప్పు చేసినట్లు కాదని, వారిచ్చే సమాధానాలకు సంతృప్తి కలిగితే ఆ పార్టీలపై ఎటువంటి చర్యలూ ఉండవన్నారు. వారిచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే, అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నామినేషన్ల పర్వం ముగిసిన నాటి నుంచి అభ్యర్థుల వారీగా సోషల్‌ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తామన్నారు. అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాల్లో వచ్చే కథనాలు, ప్రకటనలపై ముందుగా నోటీసులిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ఓటర్ల ప్రలోభాలకు గురిచేసేలా పోస్టింగ్‌లు పెట్టిన వారిని ముందుగా హెచ్చరిస్తామన్నారు. అయినప్పటికీ మార్పు రాకపోతే జరిమానా విధించడం లేదా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే ఈ రెండింటినీ కూడా అమలు చేస్తామని ద్వివేది హెచ్చరించారు. 

రాష్ట్రంలో 3,635 ‘సీ విజిల్స్‌’ బృందాలు..  
రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 3,635 సీ విజిల్స్‌ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సీ విజిల్స్‌ ద్వారా ఇప్పటి వరకు 1,304 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు.  ముఖ్యంగా పోస్టర్లు, బ్యానర్లు, గిఫ్టులు, డబ్బు, మద్యం పంపిణీ, మత, కులపరమైన ప్రచారాలు, ప్రచార సభలకు జనాల తరలింపు, లౌడ్‌ స్పీకర్ల వాడకం, వంటి వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు సంబంధించి అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎంసీసీ కమిటీలు ఏర్పాటు చేశామని ద్వివేది చెప్పారు. 

తనిఖీల్లో భారీగా నగదు సీజ్‌..  
రాష్ట్రంలో పలు చోట్ల చేపట్టిన సోదాల్లో భారీగా నగదు, మద్యాన్ని పట్టుకున్నట్లు దివ్వేది తెలిపారు. పోలీస్, కమర్షియల్‌ టాక్స్, ఇన్‌కమ్‌ టాక్స్, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసుల ఆధ్వర్యంలోని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు రూ. 2,39,89,135 సీజ్‌ చేసి  8.26 కిలోల బంగారం, 22 కిలోల వెండి, 1,043 మద్యం బాటిళ్లు, రెండు వాహనాలు, 33 కేజీల గంజాయి, 324 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు  చెప్పారు. పోలీస్‌ స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీంల ద్వారా రూ.7,51,30,981,  128.16 కేజీల బంగారం, 18.46 కేజీల వెండి  స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ అధికారుల ద్వారా రూ.2,69,35,920  పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్‌ అధికారులు రూ.7.35 కోట్ల విలువ చేసే 2 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు.   

ఏప్రిల్‌ 5వ తేదీ లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు..  
కొత్త ఓటర్లకు ఏప్రిల్‌ 5వ తేదీలోగా గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తామని ద్వివేది చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. జనవరి 11వ తేదీ నుంచి 15 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. కొత్తగా మరో 10 లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు.  ఓటర్ల నమోదు కోసం వచ్చిన ఫారం–6 ద్వారా వచ్చిన 10,62,441 దరఖాస్తులు ఇంకా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. వాటిని కూడా ఈ నెల 25వ తేదీలోగా పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు.  

1.55 లక్షల ఓట్ల తొలగింపు.. 
రాష్ట్రంలో 1,55,099 డెత్, డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వాటిని జాబితా నుంచి తొలగించామని ద్వివేది వెల్లడించారు. మార్చి 10వ తేదీ తరువాత ఓటర్ల లిస్టులో పేర్ల తొలగింపు నిలిపేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.84 కోట్ల ఓటర్లున్నారని, ఆ సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు.  ఈ నెల 23,24 తేదీలు సెలవు రోజులైనందున ఆ తేదీల్లో మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఉండదని, ఈ నెల 21వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తామని ద్వివేది తెలిపారు. అడిషనల్‌ సీఈవోలు వివేక్‌ యాదవ్, సుజాత శర్మ, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement