దాడులు.. దౌర్జన్యాలు... | TDP Political Violence in all over the AP | Sakshi
Sakshi News home page

దాడులు.. దౌర్జన్యాలు...

Published Fri, Apr 12 2019 3:36 AM | Last Updated on Fri, Apr 12 2019 4:14 PM

TDP Political Violence in all over the AP - Sakshi

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో కర్రలతో దాడికి తెగబడుతున్న టీడీపీ కార్యకర్తలు, తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దతిప్ప సముద్రంలో టీడీపీ నేతల దాడిలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆర్‌పి వెంకటరమణారెడ్డి

ఎన్నికల్లో తమ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ యథేచ్ఛగా సాగింది. రాష్ట్రంలో పలుచోట్ల అలజడులు సృష్టించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకు దిగారు. పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 26 చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆరు చోట్ల ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ధ్వంసం చేసారు. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  పోలింగ్‌ కేంద్రాల వద్ద అరాచకాలు సృష్టించి, ఓటర్లను భయపెట్టి, ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడ్డారు.      
    – సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌

ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై దాడి  
ఎన్నికల్లో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన విజయనగరం జిల్లా కురుపాం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌రాజుతోపాటు మరికొందరిపై టీడీపీ నాయకులు మూకుమ్మడి దాడికి దిగారు. అంతేకాకుండా వారిని ఓ గదిలో నిర్బంధించారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు డొంకాడ రామకృష్ణ, ఆయన అనుచరులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌రాజు, మరికొందరు అనుచరులతో కలిసి అక్కడకు వెళ్లారు. టీడీపీ నేతలు వారిని అడ్డుకోవడమే కాకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే దంపతులు గాయపడ్డారు. అయినా వారు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి, రిగ్గింగ్‌ను ఆపాలని ఎన్నికల అధికారి ఎస్‌.శ్రీనివాసరావును కోరారు. ఇంతలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిని బలవంతంగా బయటకి  తీసుకొచ్చి, పక్కనే ఉన్న ఓ గదిలో నిర్బంధించారు. దాదాపు మూడు గంటలపాటు వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సంఘటనను కవర్‌ చేయడానికి వెళ్లిన ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జ్‌ బోణం గణేశ్‌ను సైతం అదే గదిలో నిర్బంధించారు. పోలీసు బలగాలు సరిపడినంత లేకపోవడంతో స్థానికంగా ఉన్న మహిళలే పుష్పశ్రీవాణికి రక్షణగా నిలిచారు. ఏఎస్పీ సుమిత్‌ గార్గ్‌ అక్కడికి చేరుకుని నిర్బంధంలో ఉన్నవారిని విడిపించారు. 

న్యాయ పోరాటం చేస్తా: పుష్పశ్రీవాణి 
తనపై దాడికి పాల్పడిన వారిపై న్యాయ పోరాటం చేస్తానని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి చెప్పారు. నిందితులకు శిక్ష పడేంత వరకూ పోరాడుతానని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో తనను హతమార్చాలని టీడీపీ కుయుక్తులు పన్నిందని ఆమె ఆరోపించారు. 

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దౌర్జన్యం 
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పోట్లదుర్తిలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ పడిగపాటి వెంకటసుధాకర్‌రెడ్డిపై దాడి చేయడమే కాకుండా అతడిపై కారు ఎక్కించేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి తరఫున సుధాకర్‌రెడ్డి రిలీవర్‌ ఏజెంట్‌గా ఉన్నారు. పోట్లదుర్తిలో పొలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని తెలిసి అక్కడకు వచ్చారు. అదే సమయంలో సీఎం రమేశ్‌ కూడా అక్కడికి చేరుకుని సుధాకర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగి, చేయి చేసుకున్నారు. దీంతో ఎంపీ తనకు క్షమాపణ చెప్పాలంటూ సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎం రమేశ్‌ కారుకు అడ్డంగా నిలిచారు. ఎంపీ కారును ఆపకుండా సుధాకర్‌రెడ్డి కాలు మీదుగా ఎక్కించి వెళ్లిపోయారు. సుధాకర్‌రెడ్డి ఎడమ కాలు విరిగింది. స్థానికులు అతడిని ఆçస్పత్రికి తరలించారు. సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మీర్జఖాన్‌పల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు 
కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని మీర్జఖాన్‌పల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. దొంగ ఓట్లను వేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను కొట్టారు. టీడీపీ నేతల దాడిలో బొమ్మిరెడ్డి లక్ష్మిదేవి, ప్రమీల అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇట్టా కృష్ణారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చిన్న వెంకటసుబ్బారెడ్డి, చింతకుంట రమాదేవి గాయపడ్డారు. 

ఆకేపాటి సోదరుడి వాహనంపై దాడి 
రాజంపేట నియోజకవర్గంలోని మిట్టమీదపల్లెలో జనరల్‌ ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. చంద్రబాబు సామాజికవర్గం అధికంగా ఉన్న మిట్టమీదపల్లెలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటింగ్‌ జరుగుతోందని అక్కసుతో ఈ దాడికి దిగబడ్డారు. 

మేడా మల్లికార్జునరెడ్డి మేనల్లుడిపై దాడి 
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చెన్నయ్యగారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు, కట్టెలతో దాడికి దిగారు.  ఘటనలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి మేనల్లుడు అనువురి సునీల్‌కుమార్‌రెడ్డి గాయపడ్డారు. 

తునిలో యనమల అనుచరుల రిగ్గింగ్‌ 
తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కోదాడ పంచాయతీ గొర్సపాలెం గ్రామంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి అనుచరులు పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజంట్లను బయటికి పంపించి, ఓటర్లు వద్దకు వెళ్లి దగ్గరుండి మరీ సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేయించారు. అయినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అమలాపురం రూరల్‌ మండలం జనుపల్లిలో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రయత్నించగా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కానిస్టేబుల్‌ కిందపడిపోయాడు. పరిస్థితిని అదుపు చేసేందుకు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం జనసేన కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. మహిళా కానిస్టేబుల్‌ జి.గీతాదేవిపై జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. 

ఈవీఎంలను పక్కనబెట్టి ఓటింగ్‌ 
‘‘ఇక్కడ ఎమ్మెల్యేకు మాత్రమే.. అది కూడా మేం సూచించిన అభ్యర్థికి మాత్రమే ఓటేయాలి. కాదూ కూడదంటే దాడులు తప్పవు’’ అని టీడీపీ నాయకులు హెచ్చరించారు. కర్నూలు రూరల్‌ మండలం ఎదురూరు, తొలిశాపురం, ఆర్‌.కె.దుద్యాల గ్రామాల్లో మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎంపీ అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయకుండా టీడీపీ నేతలు ఏకంగా ఈవీఎంలనే పక్కన పెట్టేశారు. పైగా ఓటర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు జరిగేది కేవలం ఎమ్మెల్యే ఎన్నికలు మాత్రమేనని, ఎంపీ ఎన్నికలు వచ్చే నెలలో వస్తాయంటూ తప్పుదారి పట్టించారు. దీనిపై ‘సాక్షి’ బృందం కోడుమూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి సమాచారమివ్వగా ఎన్నికల అధికారులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎంపీ అభ్యర్థుల ఈవీఎంలను కూడా ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఈవీఎంల అపహరణకు ప్రయత్నం 
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమరలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను అపహరించేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సిబ్బంది ఈవీఎంలకు సీల్‌ వేశారు. బస్సు కోసం వేచి చూస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో 20 మంది టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా వచ్చి ఈవీఎంల అపహరించేందుకు ప్రయత్నించారు. 

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి
ప్రకాశం జిల్లా చీరాల రూరల్‌ గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం అనుచరులు అరాచకాలకు దిగారు.  వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారు. దేవినూతల, పిట్టువారిపాలెం ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్ల స్లిప్పులను లాక్కొని వారే వెళ్లి ఓట్లు వేశారు.  ప్రకాశం జిల్లా ఒంగోలులోని అగ్జిలియం స్కూలు పోలింగ్‌బూత్‌ వద్ద స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. టీడీపీకి ఓటేయండని ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడి రావడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. 

కర్నూలు జిల్లాలో టీడీపీ విధ్వంసం
కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అహోబిలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డిపై మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరాముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోగా.. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆళ్లగడ్డలో రాత్రి పొద్దుపోయే వరకు ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు.  మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం దొడ్డి బెళగల్‌ గ్రామంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ నరసన్నపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు.

ఈ దాడిలో నరసన్న తలకు బలమైన గాయమైంది. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పి.కోటకొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులుపై టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. బనగానపల్లె నియోజకవర్గంలోని గొరివిమానుపల్లెలో ఓట్లు వేసి ఇళ్లకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ నేత రామేశ్వరరెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేశారు. కర్నూలు నగరంలోని బుధవారపేట పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్‌పై దాడి చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు.  కర్నూలులో పోలింగ్‌ కేంద్రాల బూత్‌ల వద్ద టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ హల్‌చల్‌ చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. 

మేకపాటి గౌతంరెడ్డిపై టీడీపీ నేతల దాడి 
నెల్లూరు జిల్లాలో పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని పుల్లనీళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో గౌతంరెడ్డితోపాటు ఆయన సహాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. పుల్లనీళ్లపల్లి పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను బయటకు పంపించి, టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేసుకుంటుండగా ఈ సమాచారం అందుకున్న గౌతంరెడ్డి అక్కడికి చేరుకున్నారు.

అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారు. చేజర్ల మండలంలోని బిల్లుపాడులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ నాగార్జున రెండోసారి ఓటు వేసిన మహిళను అడ్డుకోబోయినందుకు స్థానిక టీడీపీ నేత పోలింగ్‌ బూత్‌లోని పోలీసు కానిస్టేబుల్‌ వద్ద ఉన్న కర్రను లాక్కొని దాడి చేశాడు. అదే మండలంలోని రాయవెలటూరులో టీడీపీ నేతలు సీమాంధ్ర బీసీ నాయకుడు పి.లీలాకృష్ణ యాదవ్‌పై దాడికి పాల్పడ్డారు. వెంకటగిరిలోనూ పోలింగ్‌ బూత్‌లో ఓటు లేని వ్యక్తి బూత్‌లోకి వెళ్లినందుకు ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు.

ఓటమి భయంతో కోడెల కుట్ర
సత్తెనపల్లి/రాజుపాలెం: ఓటమి భయంతో కోడెల శివప్రసాదరావు సరికొత్త డ్రామాకు.. తద్వారా అరాచకానికి తెరతీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల గ్రామం వైఎస్సార్‌సీపీకి కంచుకోట. ఎలాగైనా పార్టీకి మెజార్టీ తగ్గించాలనే ఉద్దేశంతో ఉదయం 10 గంటల సమయంలో జిల్లా పరిషత్‌ హైస్కూల్లోని 160వ పోలింగ్‌ బూత్‌లోకి వచ్చిన ఆయన.. మీరు ఓటు ఎలా వేస్తారో నేను చూస్తానంటూ పోలింగ్‌ కేంద్రంలోనే బైఠాయించారు. కోడెలను బయటకు వెళ్లమని చెప్పే సాహసం అక్కడి అధికారులు చేయలేకపోయారు. ఒకానొక దశలో పోలింగ్‌ కేంద్రం తలుపులు కూడా మూసివేశారు. దీంతో సుమారు రెండు గంటలకు పైగా పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో కోడెల బయటకు రావాలంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, గ్రామస్తులంతా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డీఎస్పీ కాలేషావలి లోపలికి వెళ్లి బయటకు రావాలని కోరినా.. తనకు నీరసంగా ఉందంటూ తనంతట తానే చొక్కా చించుకుని పోలింగ్‌ కేంద్రంలోనే పడుకున్నారు. అనంతరం డీఎస్పీ కోడెలను బయటకు తీసుకొచ్చి కారు ఎక్కించి పంపారు.  

టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దౌర్జన్యం 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి తన అనుచరులతో కలిసి బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. మీ అంతు చూస్తానంటూ బెదిరించారు. శనివారపుపేటకు చెందిన వైసీపీ కార్యకర్త మట్టా రాజును తీవ్రస్థాయిలో గాయపరిచారు. మాజీ డిçప్యుటీ మేయర్‌ గుడివాక రామచంద్రకిషోర్, మాజీ కార్పొరేటర్‌ అక్కిశెట్టి చందు, మరో కార్యకర్త కొండబాబు, మరో ఇద్దరిపై బుజ్జి స్వయంగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే బుజ్జి తన గన్‌మెన్‌ వద్ద గన్‌ తీసుకుని కాల్చివేస్తానంటూ బెదిరింపులకు దిగారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మట్టా రాజు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరేందుకు రాగా, అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. అసుపత్రి వద్ద రోడ్లపై పరుగులు పెట్టిస్తూ తీవ్రస్థాయిలో కొట్టారు. అనంతరం మరోసారి బడేటి బుజ్జి శనివారపుపేట పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఏలూరు నగరంలో రామకోటి సమీపంలోని బాలికోన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద మరోసారి బడేటి బుజ్జి గొడవకు దిగారు. మాజీ డిప్యూటీ మేయర్‌ గుడివాడ రామచంద్రకిషోర్‌పై దాడి చేశారు. మూడో డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ అక్కిశెట్టి చందుపై దౌర్జన్యం చేశారు. వంగాయగూడెంలో 16, 17 డివిజన్‌లోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన బడేటి బుజ్జి మరోసారి అక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొండబాబు, ఇతర వ్యక్తులపై దాడి చేశారు. పోలీసులు సైతం బడేటికి వంతపాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే లాఠీలు ఝుళిపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై వరుసగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఏలూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు బయట తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. 

యథేచ్ఛగా రిగ్గింగ్‌ 
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలోని ఎల్‌ఈ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి, తలుపులు మూసేసి 16 ఓట్లు రిగ్గింగ్‌ చేశారు. తమను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ నలమాల సుబ్బారావుపై దాడిచేశారు. పోలింగ్‌ అధికారులు అంతా చూస్తున్నా మిన్నకుండిపోయారు. యడవల్లి గ్రామంలో టీడీపీ నేతలు దొంగఓట్లు వేసేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ సైతం పోలింగ్‌బూత్‌లోకి వచ్చి రిగ్గింగ్‌ చేయడం ఎన్నికల అధికారులను బెదిరించడం గమనార్హం.

చిత్తూరులో టీడీపీ గూండాగిరి  
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులే లక్ష్యంగా భయానక వాతావరణం సృష్టించారు. తమ దౌర్యన్యాలను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను కొట్టి చంపారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులని కూడా చూడకుండా దాడి చేశారు. టీడీపీ నేతలు రెచ్చిపోతున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండిపోయింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం గ్రామం వద్ద టీడీపీ నాయకులు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఇది తప్పని చెప్పిన రామాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆర్‌.సి.వెంకటరమణారెడ్డిని(68) టీడీపీ నేతలు రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా చంపేశారు. పూతలపట్టు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్‌.బాబుపై దాడి చేసేందుకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు అడుగడుగునా ప్రయత్నించారు. కలకడ కట్టకిందపల్లె వద్ద పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బాబుకు అక్కడున్న దళితులు తమను ఓటు వేయనివ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఎందుకని ప్రశ్నిస్తుండగానే పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఈవీఎంను టీడీపీ నేతలు కిందపడేశారు. బాబునే ఈ పనిచేశారంటూ ఆయనపై దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీసు శాఖకు చెందిన గన్‌మెన్‌ శ్రీనుపై కూడా దాడి చేశారు.

ఓ వాహనంలో తప్పించుకుని వెళుతున్న బాబును కట్టకిందపల్లె చెరువు వద్ద అడ్డగించి కిడ్నాప్‌ చేసి, మామిడి తోపులోకి తీసుకెళ్లి హత్య చేయడానికి ప్రయత్నించారు. బాబు చనిపోయాడని భావించి ఆయనను అక్కడే పడేసి టీడీపీ నేతలు వెళ్లిపోయారు. అరగంట తరువాత స్పృహలోకి వచ్చిన బాబును ఆయన అనుచరులు గమనించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన బాబు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇదే నియోజకవర్గంలోని బందార్లపల్లెలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురంలోని కొత్తకండ్రిగలో ఎన్నికల కవరేజీకు వెళ్లిన ‘సాక్షి’ విలేకరులను చంద్రబాబు సామాజికవర్గ నేతలు తీవ్రంగా కొట్టి గాయపరచారు.  దీనిపై ప్రశ్నించడానికి వెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై సైతం దాడి చేయడానికి ప్రయత్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement