ఉండవల్లి సీఎం నివాసం వద్ద మాచర్ల నియోజకవర్గ కార్యకర్తల నిరసన
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికతో టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి ఇంకా రగులుతూనే ఉంది. పలు నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు ఆందోళనలకు దిగుతుండగా కొన్నిచోట్ల పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. మాచర్ల సీటును అంజిరెడ్డికివ్వడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చివరకు తనకు ఆత్మహత్యే శరణ్యమని బుధవారం ముఖ్యమంత్రి వద్ద వాపోయినట్లు తెలిసింది. అయినా చంద్రబాబు ఇక మార్పు లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాచర్లలో అంజిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని చలమారెడ్డి అక్కడే ముఖ్య నాయకుల ముందు సవాల్ చేసి వెళ్లిపోయారు. ఇలావుండగా మాచర్ల టీడీపీ అభ్యర్థి ఎంపికలో తన ప్రమేయం లేదని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు.. నంద్యాల ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి బుధవారం జనసేనలో చేరారు. తన కుమార్తెతో పాటు ఆయన పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటును పతివాడ నారాయణస్వామికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంగార్రాజు అనుచరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఈ సమావేశంలో బంగార్రాజు ప్రకటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీటును తనకివ్వకుండా ఉమామహేశ్వరనాయుడికివ్వడంపై అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఆందోళనకు దిగారు. తనకు సీటు రాకుండా పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారని, తాను ఉరవకొండలో రెబల్‌గా పోటీ చేసి పయ్యావుల కేశవ్‌ను ఓడిస్తానని ఆయన టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. ఇదే జిల్లా ధర్మవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అనుచరులు నాగశేషు, మద్దిలేటి, జయశ్రీ సహా 1,500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, డీసీసీబీ డైరెక్టర్ వరప్రసాద్ (బుజ్జి) టీడీపీకి రాజీనామా చేశారు. తాళ్లూరు సొసైటీ అధ్యక్షుడు బుజ్జి, మునుగోడు సొసైటీ మాజీ అధ్యక్షుడు చిట్టిబాబు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభకు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాత గైర్హాజరయ్యారు.
వైఎస్సార్ జిల్లాలో తిరగబడ్డ టీడీపీ కార్యకర్తలు
కడప రూరల్: వైఎస్సార్ జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు తగ్గడం లేదు. బుధవారం సాయంత్రం టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తిరగబడ్డారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని నిలదీశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇక్కడ ఏమాత్రం గుర్తింపు, గౌరవ మర్యాదలు లేవని విరుచుకుపడ్డారు. బద్వేల్‌లో టీడీపీ నాయకురాలు విజయజ్యోతి సీటు రాలేదనే అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment