సాక్షి ప్రతినిధి, కర్నూలు/అనంతపురం/కడప రూరల్: ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు పరిష్కరించాలంటూ తన వద్దకు వచ్చినప్పటికీ.. తాను ఏ మాత్రం పనిచేయలేదని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అంగీకరించారు. వివిధ సందర్భాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పలు ప్రతిపాదనలతో తన వద్దకు రాగా.. తాను వాటిని పట్టించుకోలేదని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను ఉదహరిస్తూ చెప్పారు. తద్వారా తాను రాష్ట్ర ప్రజలందరికీ సీఎంగా పనిచేయలేదని, కేవలం తన పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే పనిచేశానని కర్నూలులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశం సాక్షిగా చంద్రబాబు అంగీకరించినట్లయ్యింది. మంగళవారం కర్నూలు, అనంతపురం, కడప నగరాల్లో జరిగిన టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కర్నూలు సమావేశంలో మాట్లాడుతూ..మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి చేశారని.. ఇటువంటి దాడులను సహించే ప్రశ్నే లేదన్నారు. అయితే, తిక్కారెడ్ది ప్రచారం చేస్తున్న సందర్భంలో సొంత గన్‌మెన్లు చేసిన మిస్ ఫైరింగ్ వల్లనే ఆయనకు గాయాలయ్యాయని స్వయంగా జిల్లా ఎస్పీ నిగ్గుతేల్చారు. ప్రైవేటు వ్యక్తులెవరూ కాల్పులు జరపలేదని తేల్చి చెప్పారు.
అనవసరంగా కాల్పులు జరిపిన ఇద్దరు గన్‌మెన్లను సస్పెండ్ కూడా చేశారు. ఈ విషయాలు ప్రజలందరికీ తెలిసినా.. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తమ అభ్యర్థిపై దాడులు చేశారంటూ చంద్రబాబు అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేసి.. సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రత్యేక హోదా గురించి జగన్ ఎందుకు అడగలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో గతంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుపుతుంటే ప్రత్యేక హోదా గురించి నిరసన తెలిపేందుకు వచ్చారని విమర్శించారు. వైఎస్ వివేకాహత్య కేసును నంద్యాల ఎంపీ అభ్యర్థి, గతంలో ఐపీఎస్‌గా ఉన్న మాండ్ర శివానందరెడ్డికి అప్పగిస్తే 24 గంటల్లో హంతకులను తేల్చేవారని.. ప్రస్తుతం విచారణ జరుపుతున్న అధికారులకు ఆ శక్తి లేదనే విధంగా మాట్లాడారు. కర్నూలు జిల్లాలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించినందున అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. సీట్లు కేటాయించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎంపీ ఎస్పీవై రెడ్డితోపాటు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు.
125ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రను తుడిపేశాం..
రాష్ట్రాన్ని కాంగ్రెస్ హేతుబద్ధత లేకుండా విభజించిందని, దీంతో తిరుగుబాటు చేసి 125ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రను తుడిపేశామని చంద్రబాబు అన్నారు. ప్రజలు బీజేపీని క్షమించరని చెప్పారు. అనంతపురంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీకి 22 ఎంపీ స్థానాలు వస్తాయని అంటున్నారని, ఏం చేశారని వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ తనకు బర్త్‌డే గిప్ట్ పంపిస్తానని చెబుతున్నాడని..తానే ఆయనకు 10 గిప్ట్‌లు పంపిస్తానని చెప్పారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ డుమ్మా..
చంద్రబాబు కార్యక్రమానికి కదిరి, కళ్యాణదుర్గం, శింగనమల ఎమ్మెల్యేలు అత్తార్‌చాంద్‌బాషా, హనుమంతరాయ చౌదరి, యామినీబాలతో పాటు ఎమ్మెల్సీ శమంతకమణి గైర్హాజరయ్యారు. వీరికి ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేదు. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని చంద్రబాబు అన్నారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో తననే గెలిపించాలని అన్నారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరంలోని మున్సిపల్ గ్రౌండ్‌లో టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు మళ్లీ తననే అధికారంలో కూర్చోపెట్టాలని కోరారు. కడప వైఎస్సార్ జిల్లా తమకెంతో కీలకమైందని ఇక్కడ తమను బలపరచాలన్నారు. అందుకు మీ మద్దతు కావాలంటూ.. పదే పదే చప్పట్లు కొట్టించుకున్నారు. సాక్షిపై తనకున్న అక్కసును మరోసారి వెళ్లగక్కారు. వైఎస్ జగన్‌ని విమర్శించడానికే సీఎం తన సమయాన్నంత వెచ్చించారు. దివంగత నేత వైఎస్సార్‌పై అరోపణలు చేశారు. సభ ప్రారంభమైన 10–15 నిముషాలకే సేవా మిత్రలు, బూతు కన్వీనర్లు, డ్వాక్రా మహిళలు వెళ్లిపోయారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడిగినా పనులు చేయలేదు
Published Wed, Mar 20 2019 4:47 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment