వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించిన ఎస్‌ఈసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాజాగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రచురించింది. దీనికి సంబంధించి ఇదివరకే ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారం, ఆ మేరకు ఓట్ల తొలగింపు తర్వాత మండల, పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై డిస్‌ప్లే చేసింది.
ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 1,67,33, 584 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. రాష్ట్రంలోని మొత్తం 538 మండలాలు, వాటి పరిధిలోని 12,867 గ్రామ పంచాయతీలు, 1,13,722 వార్డుల్లో ఈ మొత్తం ఓటర్లలో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతరులు (ట్రాన్సజెండర్లు) ఉన్నారు.
నల్లగొండ జిల్లా టాప్.. మేడ్చల్ లాస్ట్
గ్రామీణ ఓటర్ల పరంగా చూస్తే నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలోని 31 మండలాల్లోని 856 గ్రామపంచాయతీల్లో 7,392 వార్డుల్లో మొత్తం 10,42,545 ఓటర్లున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యల్ప గ్రామీణ ఓటర్లు ఉన్నారు.
ఈ జిల్లాలో గతంలో ఐదు మండలాలు ఉండగా వాటిలో కీసర, ఘట్‌కేసర్ మండలాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మేడ్చల్ జిల్లా 3 మండలాల్లోని 34 గ్రామపంచాయతీలు..320 వార్డుల్లో మొత్తం 64,397 ఓటర్లు ఉన్నట్టుగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment