తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2019 జనవరి 15వ తేదీ ప్రారంభమైంది. 2024 జనవరి 16వ తేదీతో తెలంగాణ అసెంబ్లీ గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30వ తేదీ గురువారం నాడు ఒకే దఫాలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ.. ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 9వ(సోమవారం) తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తక్షణమే ఎన్నికల కోడ్‌ను అమలులోకి తెచ్చింది. ఆపై నవంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాసేపటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. వారంపాటు సాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన చేపట్టారు రిటర్నింగ్ అధికారులు. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రం ముగిసింది.
మొత్తం ఓటు హక్కు ఉన్నవాళ్ల సంఖ్య..
ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1.62 కోట్లు, మహిళా ఓటర్లు 1.63 కోట్లు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది,సర్వీస్ ఓటర్లు(సాయుధ దళాల సిబ్బంది, దేశం వెలుపలా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే వ్యక్తులు) 15, 406 మంది ఉన్నారు.
తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు (18-19ఏళ్ల వయసు) 9,99,667 మంది ఉన్నారు. వీళ్లలో పురుష ఓటర్లు 5,70,274 మంది, మహిళా ఓటర్లు 4,29,273 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 120 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు(పీడబ్ల్యూడీ) 5,06,921 మంది ఉండగా.. ఇందులో పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఒకరు ఉన్నారు. ఓవర్సీస్ ఓటర్లు.. పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 1 మొత్తంగా 2,944 ఓటర్లు ఉన్నారు.
మొత్తం ఓటర్లలో 59 ఏళ్లలోపు వాళ్లు 86 శాతం ఉన్నారు. వయసు 80 ఏళ్లు దాటిన వాళ్లు 4,40,371 మంది ఉన్నారు. 80ఏళ్ల వయసు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో ఈసీ తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,26,18,205.
తెలంగాణలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించారు. ఈ వెసులుబాటుతో 27,178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాజ్ రాజ్ ప్రకటించారు. అందులో 15,000 మంది సీనియర్ సిటిజన్లు, 9,374 మంది వికలాంగులు, 1,407 మంది నిత్యావసర సేవా సిబ్బంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.
అత్యధికం.. అత్యల్పం
అత్యధికంగా హైదరాబాద్‌లో 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో(హైదరాబాద్ జిల్లా) 7 లక్షల 32 వేల 560 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) నియోజకవర్గంలో లక్షా 48 వేల 713 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.
బరిలో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 2,898 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరకు 2,290 మంది అభ్యర్థులు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీ నగర్(రంగారెడ్డి జిల్లా)లో 48 మంది, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్‌లో 44 మంది.. కామారెడ్డిలో 39 మంది పోటీలో మిగిలారు. అత్యల్పంగా నారాయణపేట(నారాయణపేట జిల్లా)లో ఏడుగురు, బాన్సువాడలో(కామారెడ్డి జిల్లా)లోనూ ఏడుగురు చొప్పున అభ్యర్థులు, బాల్కొండ(నిజామాబాద్)లో 8 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
సాధారణంగా.. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో ఎన్నికల అధికారులు జాబితా తయారు చేస్తారు. వాటి ఆధారంగానే బ్యాలెట్ రూపొందిస్తారు. పార్టీ ప్రతినిధుల నుండి క్లియరెన్స్ తర్వాత(నవంబర్ 29) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ స్టేషన్‌లకు తరలించనున్నారు.
ఏర్పాట్లు..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35,655 పోలింగ్ కేంద్రాల్లో తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో వెబ్‌క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,097 (78శాతం), 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 67 మంది జనరల్ అబ్జర్వర్లను, 39 మంది పోలీస్ అబ్జర్వర్లను తెలంగాణ ఎన్నికల కోసం నియమించింది ఈసీ. మొత్తంగా ఎన్నికల విధుల కోసం 2.08 లక్షల మంది సిబ్బందిని నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. వాళ్లను రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతాలకు తరలించింది.
35,655 పోలింగ్ కేంద్రాలు
పోలింగ్: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా
పోలింగ్ కేంద్రాల వల్ల 144 సెక్షన్ అమలు
13 అసెంబ్లీ సెగ్మెంట్‌ల పరిధిలో.. 4,400 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ముగింపు
పోలింగ్ ముగిసే టైం వరకు లైన్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటింగ్‌కు అనుమతి
భద్రత కోసం
375 కంపెనీల కేంద్ర బలగాలు
భద్రతా విధుల్లో 45 వేలమంది పోలీసులు
ఏజెన్సీ ఏరియాల్లో భద్రత మరింత కట్టుదిట్టం
నవంబర్ 30వ తేదీ ఉదయం 5.30ని. పోలింగ్ సిబ్బందికి అవగాహన కోసం మాక్ పోలింగ్ ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల కౌంటిగ్.. అదే రోజు ఫలితాల వెల్లడి అవుతాయి. మొత్తంగా ఈసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.
Comments
Please login to add a commentAdd a comment