ప్రజాస్వామ్యమంటే... ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. ప్రజలే ప్రభువులు!ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ కీలకమే. ఒకే ఒక్క ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంది. ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజాతీర్పు అంత స్పష్టంగా ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
ప్రజల ఆశీస్సులతో కాకుండా.. అడ్డదారుల్లో అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని ఏమంటారు? కేటుగాడనే కదా! ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాటి నుంచి ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ ‘డూప్లికేటు’ వేషాలు వేస్తున్నారు!
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటమికి ఇప్పట్నుంచే సాకులు వెతుక్కుంటున్నారు. ఒకవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెడుతున్న ఆయన మరోవైపు నిబంధనలను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17, 18 ప్రకారం దేశంలో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి.
వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. రాజకీయాల్లో 1978 నుంచి ఉన్న చంద్రబాబుకు ఇది తెలిసినా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. తెలంగాణలోనూ, ఏపీలోనూ రెండు చోట్లా ఓట్లు ఉన్న వారు (డూప్లికేట్లు) 4,30,264 మంది ఉన్నారు.
కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరుల పేర్లను ఏపీలోనూ సరిహద్దు నియోజకవర్గాల్లో చేర్పించారు. వాటిని తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలని ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో పోలింగ్ ముగిసిన మర్నాడే..
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న పూర్తయింది. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 1 నుంచే హైదరాబాద్‌లో ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా చేర్పించేందుకు ఆ పార్టీ భారీ ఎత్తున శిబిరాలు నిర్వహించింది. కూకట్‌పల్లి, నిజాంపేట, వనస్థలిపురం, మణికొండ, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో శిబిరాల ఇన్‌ఛార్జ్‌లను నియమించిన టీడీపీ ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ ఓటర్లుగా చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ సానుభూతిపరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది.
వయసు, చిరునామా ధ్రువీకరించే ఆధార్ కార్డును వాట్సప్‌లో పంపితే తామే ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేయిస్తామని, ఎన్నికల సంఘానికి తామే ఫారం 6 సమర్పిస్తామంటూ సందేశాలు పంపింది. టీడీపీని భుజానికెత్తుకునే మోసే ఓ సామాజిక వర్గం నాయకులు ఈ ప్రచారంలో ప్రధాన భూమిక పోషించారు. ఇలా హైదరాబాద్, తెలంగాణలో నివాసం ఉంటున్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరులను ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చేందుకు ఫారం 6 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఇప్పటికే సమర్పించారు. ఈ ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
పవన్ కుటుంబం బరి తెగింపు..
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనే తరహాలో డూప్లికేటు ఓట్లు చేర్చడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాట పట్టారు. ఆయన సోదరుడు కొణిదల నాగేంద్రరావు(నాగాబాబు)కు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబరు 168లో సీరియల్ నెంబరు 323 ఎఫ్‌వైవై 6038202 ఓటరు కార్డు నెంబరుతో ఓటు ఉంది. నాగేంద్రరావు సతీమణి పద్మజ కొణిదలకు సీరియల్ నెంబరు 324, వారి కుమారుడు కొణిదెల సాయివరుణ్ తేజ్‌కు సీరియల్ నెంబరు 325తో అక్కడ ఓట్లున్నాయి.
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అంటే డిసెంబరు 4న ఏపీలోనూ ఓటు హక్కు కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగా నగర్ మూడో వీధి 5–263 డోర్ నెంబర్ ఇంటిలో తాము నివాసం ఉంటున్నామంటూ కొణిదల నాగేంద్రరావు, పద్మజ, సాయివరుణ్ తేజ్ ఓటర్లుగా నమోదు కోసం ఫారం 6 దరఖాస్తు సమర్పించడం గమనార్హం.
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేనను స్థాపించిన సినీనటుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి జత కట్టడం ద్వారా దీన్ని రుజువు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు బేషరతుగా మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి మేలు చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు.
డూప్లికేటు ఓట్లకు సాక్ష్యాలు ఇవిగో..:
♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (టీజెడ్‌టీ 2164002)తో దీపిక సైలాడకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మరో ఓటు ఉంది.
♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎఫ్‌జెడ్‌జెడ్ 8526691)తో పి.వెంకటేష్ తండ్రి పి.రామారావుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మరో ఓటు ఉంది.
♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (కేవైటీ 2765246)తో మారెమ్మ తురపాటి భర్త మారయ్యకు తెలంగాణలోని సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా ఎనీ్టఆర్ జిల్లా మైలవరం నియోజవకర్గంలో మరో ఓటు ఉంది.
♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎస్‌డబ్ల్యూడీ 1814962)తో భరణి బిళ్లపాటి భర్త వెంకట రమణమూర్తి బిళ్లపాటికి హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాష్ట్రంలో అనకాపల్లి నియోజకవర్గంలో రెండు పోలింగ్ బూత్‌ల పరిధిలో రెండు ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం మూడు ఓట్లు ఉన్నట్లు.
♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (జేహెచ్‌జీ 1224126)తో 70 ఏళ్ల వంకదారి నారాయణస్వామి తండ్రి వి.కృష్ణయ్యకు గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ జడ్పీహెచ్‌ఎస్ పోలింగ్ బూత్ పరిధిలో సీరియల్ నెంబరు 750తో ఒక ఓటు ఉండగా వయసును 72 ఏళ్లుగా మార్చి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో సీరియల్ నెంబరు 197తో మరో ఓటు ఉంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రరావు కొణిదల, ఆయన భార్య పద్మజ, కుమారుడు సాయి వరుణ్ తేజకు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయనడానికి ఆధారం ఇదీ
ఓటరు కార్డు నెంబరు ఆర్‌డీవీ0159780తో కొసరాజు సాంబశివరావు తండ్రి సూర్యప్రకాశరావుకు తెలంగాణలో కూకటిపల్లిలో ఒక ఓటు.. రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గంలో మరో ఓటు ఉందనడానికి ఆధారం
ఓటరు కార్డు నెంబరు ఆర్‌ఎస్‌యూ0326876తో నూతలపాటి కృష్ణచైతన్య తండ్రి పేరు ఎన్‌ఎస్‌ఆర్ ప్రసాద్‌కు తెలంగాణలో పటాన్‌చెర్వు నియోజకవర్గంలో ఒక ఓటు.. రాష్ట్రంలో నూజివీడు నియోజకవర్గంలో మరో ఓటు కలిగి ఉన్నారనడానికి సాక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment