పోలింగ్‌కు 48 గంటల ముందూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు
Published Mon, Feb 17 2014 11:55 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్:
పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు అర్హత కలిగిన వారు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్‌లో జేసీ శరత్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా అర్హులుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా 2.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 2,407 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 21,36,348 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 10,77,742, స్త్రీలు 10,58,496, ఇతరులు 110 మంది ఉన్నారన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న నూతన ఓటర్లు 29,976 మంది నమోదయ్యాయన్నారు. ఎన్నికల వ్యయంపై ఇంకా స్పష్టమైన ఆదేశం రాలేదన్నారు. ఎన్నికల వ్యయంపై పరిశీలించేందుకు భారీసంఖ్యలో పరిశీలకులు నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికార పక్షానికి సహకరించేలా కొందరు అధికారులు పనిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా అలాంటి వారిని పక్కన పెట్టి భరోసా ఉన్నవారిని నియమిస్తామన్నారు. ఎన్నికల సమస్యలపై టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తామన్నారు.
పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులైన టాయిలెట్‌లు, ర్యాంపులు, విద్యుత్ మరమ్మతులు, నీటి సదుపాయం తదితర వాటిని కల్పించేందుకు ఇప్పటికే నియోజక వర్గ స్థాయిలో ఇంజనీరింగ్ విభాగాల ఈఈలను నియమించామని నియోజక వర్గ స్థాయిలో రాజకీయ పార్టీలు సహకరించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మంద పవన్, ప్రేమానందం, నర్సింలు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement