ఫొటో ఉంటేనే ఓటు
పట్టభద్రులకు ఈసీ షాక్!
జాబితాలో ఫొటో తప్పనిసరి
ఫొటో లేకపోతే ఓటు ఉండదు
నామినే షన్లలోపు అప్‌లోడ్‌కు అవకాశం
డైలమాలో 81వేల మంది ఓటర్లు
సాంకేతిక, సిబ్బంది కొరతతో నిక్షిప్తం అసాధ్యమంటున్న యంత్రాంగం
మొత్తంఓటర్లు : 1,33,003
ఫొటోలులేనివారు
పురుషులు : 54,336
స్త్రీలు : 27,487
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పట్టభద్రులకు కొత్తచిక్కు వచ్చిపడింది. ఓటర్ల జాబితాలో ఫొటో తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తాజాగా తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారితీసింది. ‘మండలి’ ఎన్నికల్లో తొలిసారి ఫొటో గుర్తింపు కార్డు విధానాన్ని ప్రవేశపెడుతున్న ఈసీ.. జాబితాలో ఫొటో లేకపోతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించేదిలేద ని స్పష్టం చేసింది. వచ్చేనెల 16న రంగారెడ్డి -హైదరాబాద్- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అయితే, దీంట్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే విధిగా ఫొటో ఉండాల్సిందేనని మెలిక పెట్టింది. అదే సమయంలో ఫొటోల నిక్షి ప్తానికి చివరి అవకాశం కల్పించింది. పట్టభద్రుల నామినేషన్ల క్రతువు ముగిసేలోపు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇది ఊరటనిచ్చే అంశమే అయినా.. ఫొటో లేకపోతే ఓటు ఉండదనే ఆంక్ష మాత్రం అటు ఆశావహులను.. ఇటు పట్టభద్రులను డైలమాలోకి నెట్టింది.
సగం మందికి ఫొటోలు లేనట్లే!
ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన యంత్రాంగం.. మూడో వంతు ఓటర్లకు ఫొటోలు లేవని తేల్చింది. జిల్లావ్యాప్తంగా 1,33,003 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 88,831, స్త్రీలు 44,164, ఇతరులు 8 మంది ఉన్నారు. వీరిలో సగం మంది ఓటర్ల ఫొటోలు జాబితాలో పొందుపరచలేదు. సాధారణ ఓటర్ల జాబితా తరహాలో మండలి జాబితాను కూడా రూపొందించాలని ఈసీ నిర్ణయించింది. అందుకనుగుణంగా ఈ రెండు జాబితాలను అనుసంధానించడం ద్వారా సాధారణ జాబితాలో నమోదైన పట్టభద్రుల ఫొటోలను సేకరించి మండలి ఓటరు లిస్ట్‌లో నిక్షిప్తం చేసింది. ఈ ప్రక్రియ కొనసాగించినప్పటికీ, కేవలం 51,180 మంది ఫొటోలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇంకా 81,823 మంది ఫొటోలు జాబితాలో లేకపోవడంతో యంత్రాంగం దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటోంది. నామినేషన్ల పర్వం ముగిసేనాటికీ ఫొటోలను అప్‌లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినా సిబ్బంది కొరతతో అది సాధ్యపడదని అంటోంది.
సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతాయని అధికార గణం పేర్కొంటోంది. సాధారణ ఎన్నికల తరహాలో పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం కూడా దీనికి ప్రతిబంధకంగా మారే అవకాశంలేకపోలేదని వాదిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సైతం జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఈ కారణంతో ఓటర్లను అనుమతించకపోవడం సహేతుకంకాదని, తీవ్ర వ్యతిరేకత వస్తుందని కుండబద్దలు కొట్టింది, ఈ అభిప్రాయంతో కొంతవరకు ఏకీభవించిన భన్వర్‌లాల్ ఫొటోలు అప్‌లోడ్ చేసుకోవాల్సిందేనని, కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుందామని భన్వర్‌లాల్ సెలవిచ్చినట్లు తెలిసింది.