కలెక్టర్‌కు జిల్లా ప్రజానీకం బాసట
పారిశ్రామిక వేత్తలకు బుద్దిచెబుతామన్న ప్రజాసంఘాలు
లాబీయింగ్‌ను అడ్డుకుని తీరుతామన్న ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు జిల్లా ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు బాసటగా నిలిచారు. ఆమెను జిల్లా నుంచి పంపించేందుకు పారిశ్రామిక వేత్తలంతా ఏకమై చేస్తున్న లాబీయింగ్‌ను తీవ్రంగా గర్హించారు. ప్రజలకు కాలుష్యం పంచి, రూ. కోట్లు దండుకుంటూ సామాజిక బాధ్యతను విస్మరించిన పారిశ్రామికవేత్తలకు బుద్దిచెప్పి తీరుతామంటున్నారు. ప్రజల కోసం పని చేస్తున్న కలెక్టర్‌ను వారు ఎలా పంపిస్తారో తాము కూడా చూస్తామంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవసరమైతే ముఖ్యమంత్రి కలిసి పారిశ్రామిక వేత్తల పన్నాగం వివరిస్తామని తేల్చి చెప్పారు. ‘పంపేందుకు పైరవీ.. కలెక్టర్ బదిలీకి పారిశ్రామిక వేత్తల లాబీయింగ్ ’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. ఈ కథనంపై టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల ఎమ్మెల్యేలు స్పందించారు. కలెక్టర్ బదిలీ కోసం పారిశ్రామిక వేత్తల వేస్తున్న ఎత్తులను ఎలాగైనా చిత్తు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు హరీష్‌రావు, నందీశ్వర్‌గౌడ్, కిష్టారెడ్డి, నర్సారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు తదితరులు శనివారం వేర్వేరుగా ‘సాక్షి’తో మాట్లాడారు. పారిశ్రామికవేత్తల తీరును ఎండగట్టారు. రూ.కోట్లు మూటగట్టుకుంటున్న పారిశ్రామికవేత్తలు ’సామాజిక బాధ్యత’ను విస్మరించడం నేరమేనన్నారు. వెంటనే సీఎస్‌ఆర్ ఫండ్‌ను చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు.
ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదనే పరమావధిగా కంపెనీలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలు కాలుష్యాన్ని ప్రజల మీదకు వదిలి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏమాత్రం మానవత్వం ఉన్నా, వెంటనే సీఎస్‌ఆర్ ఫండ్‌ను చెల్లించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. డబ్బు బలంలో ఏమైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, నిజాయితీపరురాలైన కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు తామంతా అండగా నిలుస్తామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వాస్తవ పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. పరిశ్రమల కాలుష్యంతో కునారిల్లిపోయిన పాశమైలారం గ్రామ ప్రజలు పారిశ్రామిక వేత్తల దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించారు. కలెక్టర్‌కు తామంతా అండగా నిలుస్తామని ఆ గ్రామ సర్పంచు సుధాకర్‌గౌడ్ తెలిపారు. కలెక్టర్ బదిలీ కోసం పారిశ్రామిక వేత్తలు చేసే లాబీయింగ్‌నే కాదు, ప్రతిప్రయత్నాన్ని అడ్డుకొని తీరుతామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే హన్మంతరావు స్పష్టం చేశారు.
ఆమె ఇక్కడే ఉండాలి
సిద్దిపేట రూరల్: కలెక్టర్ స్మిత సబర్వాల్ పని తీరు బాగుందని, ఆమె మెదక్ జిల్లాలోనే ఉండాలని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. శనివారం సిద్దిపేటకు విచ్చేసిన ఆయన, సాక్షి పత్రికలో ప్రచురించిన ‘పంపేందుకు పైరవీ’ అనే కథనంపై స్పందించారు. స్మితా సబర్వాల్ లాంటి నిజాయతీ గల కలెక్టర్ తెలంగాణకు అవసరమన్నారు. పరిశ్రమల స్థాపనకయ్యే వ్యయంలో 0.02 శాతం ఆ ప్రాంతం ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం కోసం ఖర్చు చేయాల్సిన బాధ్యత పారిశ్రామిక వేత్తలపై ఉందన్నారు. ఈ అంశాన్ని గుర్తించిన కలెక్టర్‌ను సంస్థలపై ఒత్తిడి పెంచితే ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేయించేందుకు కుట్రలు చేయడం అన్యాయమన్నారు. పారిశ్రామికవేత్తల కుట్రలను ప్రటిఘటించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కలెక్టర్ పనితీరు వల్ల జిల్లాలోని నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు.
ఎలా పంపుతారో చూస్తాం
Published Sat, Feb 1 2014 11:15 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement