పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మేరకు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆర్డీఓ, తహశీల్దార్లపై ఉందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆమె అధికారులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 28 లోగా ర్యాంప్‌లు, విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెక్‌లిస్ట్ ఆధారంగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేసేలా పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇంజినీర్లతో సమన్వయమయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహిస్తే ఆ నివేదికలను కలెక్టరేట్‌కు అందజేయాలని సూచించారు. మెదక్ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ నెల రోజుల వ్యవధిలో కేవలం రెండు ర్యాంప్‌లు మాత్రమే నిర్మాణం చేపట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వాటిని ఈనెల 28లోగా పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
లబ్ధిదారులకు రుణాలు వెంటనే ఇవ్వాలి
వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పన కింద ఆర్థిక సాయం అందించేందుకు లబ్ధిదారుల జాబితాను ఈ నెల 28లోగా అందజేయాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. జీఓ 101 ప్రకారం మిగిలిపోయిన వారి జాబితాను మండల కమిటీ ద్వారా రూపొందించి సకాలంలో అందజేయాలన్నారు. కులం, నివాసం, ఆదాయ విషయాల్లో ఏవైనా సమస్యలుంటే స్థానిక తహశీల్దార్లను సంప్రదించి జాప్యం లేకుండా సరిచేసుకోవాలన్నారు. బ్యాంకర్ల సమావేశంలో వారికి లక్ష్యాలను నిర్దేశించామని, ఆ మేరకు రుణాలు మంజూరయ్యేలా చూడాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. భూమి కొనుగోలు పథకం కింద ప్రతి మండలంలో కనీసం ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేయాలని, ఆ ప్రతిపాదనలను వెంటనే పంపాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్, దయానంద్, చరణ్‌దాస్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
న్యాయ సలహా కేంద్రం ప్రారంభం
కలెక్టరేట్: నిరుపేదలు, మహిళలకు న్యాయపరమైన సలహాలు, పరిష్కార మార్గాలు అందించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో న్యాయ సహాయ సలహా కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రాష్ట్రంలోనే మొదటిదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో నిరుపేదలు న్యాయపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలపై కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తున్నారన్నారు.
వీరికి సలహాలు, సూచనలు అందజేయడానికి ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గురువారం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేస్తుందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ మాట్లాడుతూ కేంద్రానికి వచ్చే ఫిర్యాదులపై న్యాయవాదుల ఆధ్వర్యంలో న్యాయ సలహా, కౌన్సెలింగ్ ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.