సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు రూ.350, పోలింగ్ అధికారులకు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తారని, అలాగే లంచ్ ప్యాకెట్‌కోసం రూ.150 చొప్పున అందజేస్తారని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతోపాటు దూరం ఆధారంగా టీఎ, డీఏను చెల్లిస్తారని పేర్కొంది. 15 కిలోమీటర్ల దూరం వరకు రూ.266, 50 కిలోమీటర్ల వరకు రూ.375, 100 కిలోమీటర్ల వరకు రూ.437, 200 కిలోమీటర్ల వరకు రూ.520 చొప్పున చెల్లిస్తారని వివరించింది. ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఈఓ భన్వర్‌లాల్ పేర్కొన్నారని తెలిపింది. ఆ ప్రకారం చెల్లించనిపక్షంలో.. సీఈఓ భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది.