న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బలహీన వర్గాల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం అధికారులను ఆదేశించింది. ఓటర్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ చర్యలు చేపట్టాలంది. నియోజకవర్గంలో కుష్టువ్యాధి బాధితుల చికిత్స కేంద్రం ఉంటే వారి కోసం కేంద్రం ఏర్పాటు చేయాలంది. సాంఘిక నిబంధనలు, ఆచారాల వల్ల పురుషులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకోలేని మహిళల కోసం వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు పెట్టాలని సూచించింది. పోలింగ్ కేంద్రం పరిధిలో పరదా వేసుకునే మహిళలు ఎక్కువగా ఉంటే... గుర్తింపు, సిరా గుర్తు కోసం మహిళా అధికారులను నియమించాలని పేర్కొంది. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ మహిళల కోసం పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.
నెలాఖరు నుంచి మోదీ ప్రచారం?
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్చి చివరి వారం నుంచి ప్రధానిమోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. మూడు, నాలుగు దశల్లో జరిగే ఎన్నికల కోసం ప్రధాని పర్యటన తేదీల్ని కోరామని, పది సభల్లో ప్రసంగించేలా ప్రణాళిక రూపొందించామన్నారు.
కేరళలో 70 మంది తృణమూల్ అభ్యర్థులు..
కొచ్చి: కేరళలో 70 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కోల్‌కతాలో కేరళ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మనోజ్ శంకరనెల్లుర్ ఈ జాబితాను విడుదల చేశారు. మొత్తం 140 స్థానాల్లో తమ పార్టీ పోటీచేస్తోందన్నారు. తిరువనంతపురం, కోచి, కోజికోడ్ సభల్లో మమతా బెనర్జీ పాల్గొంటారన్నారు. కేరళలో తృణమూల్‌కు 2 లక్షల మంది సభ్యులున్నారని, అక్కడి 15 లక్షలమంది బెంగాలీలపై దృష్టిపెట్టామని మనోజ్ చెప్పారు.
90 శాతం సీట్లలో ముఖాముఖి పోరు: కాంగ్రెస్
కోల్‌కతా: బెంగాల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లలో లెఫ్ట్ కూటమి, తృణమూల్ అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ చౌదురీ చెప్పారు. సీట్ల సర్దుబాటుపై విభేదాలు చాలా వరకూ పరిష్కారమయ్యాయన్నారు. భాగస్వామ్యంపై రెండు పార్టీలు సర్దుబాటు ధోరణిలో ఉన్నాయన్నారు.
బలహీన వర్గాలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
Published Sun, Mar 13 2016 2:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement