ఓటరు నమోదుకు చివరి అవకాశం
కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఓటరు జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవడానికి చివరి అవకాశాన్ని కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. ఆదివారం రోజు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6 ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,047 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధలను రాజకీయ పార్టీలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఓటర్లకు లంచం ఇవ్వడం, ప్రలోభాలకు గురిచేయడం, ఇతరుల ఓట్లను వినియోగించుకునేందుకు వేరేవారు ఓటర్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. పోలీసుల అనుమతి మేరకే ర్యాలీలు, సభలు నిర్వహించాలన్నారు. కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి కలెక్టర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి జేసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. నగదు తరలింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు.
అతిక్రమిస్తే కేసులు: ఎస్పీ
ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ హెచ్చరించారు. అతిక్రమించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్‌ఓ దయానంద్, వివిధ పార్టీల నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాజయ్య, దయానంద్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పనుల పరిశీలన
సమావేశం అనంతరం కలెక్టర్ స్మితా సబర్వాల్ పాత డీఆర్‌డీఏ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం గోదాం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 17లోగా పనులు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డికి సూచిం చారు. జిల్లాకు దాదాపు 10 వేలకు పైగా ఈవీఎంలు వస్తున్నట్టు చెప్పారు. వీటిని భద్రపర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు గోదాంలో ఉండాలన్నారు.
కంట్రోల్ రూమ్ ప్రారంభం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ స్మితా సబర్వాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ విభాగంలోని 08455-272525 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందన్నారు.