సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో మీ పేరు లేదా? జాబితాలో పేరు ఉన్నా మరో ప్రాంతానికి నివాసం మార్చారా? మీ పేరు, ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యాయా?.. ఇలాంటి కారణాలతో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేయలేమని బాధపడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, ఇతర ప్రాంతానికి ఓటు బదిలీ, పేరు, ఫొటో, ఇతర వివరాల దిద్దుబాటు కోసం ఫారం–8 దరఖాస్తులను అక్టోబర్ 31లోగా సమర్పిస్తే వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మీకు ఓటు హక్కు లభించనుంది.
నివాసం ప్రస్తుతం ఉండే నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా, లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినా ఫారం–8 దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఓటరు జాబితా/ ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో సరిగ్గా లేకపోయినా, పేరు, ఇతర వివరాలు తప్పుగా వచ్చినా ఫారం–8 దరఖాస్తు ద్వారానే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నవంబర్ 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 10తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దానికి 10 రోజుల ముందు అనగా, అక్టోబర్ 31 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?
ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, వివరాల దిద్దుబాటు.. తదితర సేవల కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ https://voters.eci.gov.in లో అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్(వీహెచ్‌ఏ)ను మొబైల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చు.
లేకుంటే స్థానిక బూత్ స్థాయి అధికారి(బీఎల్‌ఓ), ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో)ను కలసి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి అందజేయాల్సి ఉంటుంది. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫొటోతో పాటు చిరునామా, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు డిమాండ్ నోటీసు, గ్యాస్/బ్యాంక్ పాసుపుస్తకాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?
ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? అనేది తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా https://electoralsearch.eci. gov.in అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్), మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు.
గతంలో ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుండేది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. అయితే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరును సులువుగా సెర్చ్ చేయవచ్చు.
కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి?
గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్ https://ceotserms2.telangana.gov.in/ ts search/ Non Standard Epic.aspx ను సందర్శించి మీ పాత కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment