18 ఏళ్లు నిండిన వారంతా ఈనెల 15లోగా ఓటు నమోదు చేసుకోండి
మే 13న తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటు నమోదుకు ఇక మూడు రోజుల సమయమే ఉంది. 18 సంవత్సరాల వయసు నిండి.. ఓటర్ జాబితాలో పేరులేని వారంతా ఈ నెల 15లోగా ఆన్‌లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫాం–6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓటర్ జాబితాలో పేరుందో, లేదో ఒకసారి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలి.
ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ.. జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫాం–6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిది’ అని సూచించారు.
ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రాకుండా.. అధికారులు అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని సరి చూసిన తర్వాతే ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా.. ఫిజికల్‌గా ఆధార్ కాపీ, వయసు నిర్దారణ ధ్రువపత్రంతో పాటు ఇంత వరకు ఎక్కడా ఓటు హక్కు లేదన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఓటర్‌గా నమోదు చేస్తున్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి వదిలేయకుండా.. అన్ని కాపీలను తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment