సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు.
మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్‌తో కూడిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం కలిసింది.
ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్‌సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం
అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే..
ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి.
అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు.
► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి.
ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం.
నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ?
► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్‌ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్‌లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా?
► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్‌లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్‌లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు?
► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా?
► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు.
జాబితాలో పెరిగిందెక్కడ?
రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి.
డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా?
ఆ నీచ రాజకీయం బాబుదే..
రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ.
► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు?
► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు.
► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం.
Comments
Please login to add a commentAdd a comment