కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు.
టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి.
ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.
త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది.
మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్ కోసం డిమాండ్ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.
ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి.
ఈసీ నోరుమెదపదేం?!
Published Tue, May 28 2024 5:27 AM | Last Updated on Tue, May 28 2024 5:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment