రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
రాజకీయాలకు అతీతంగా ఎన్నికల నిర్వహణ.. టీడీపీపై 126, వైఎస్సార్‌సీపీపై 136 ఎఫ్‌ఐఆర్‌ల నమోదే నిదర్శనం
12,459 సమస్యాత్మక కేంద్రాల్లో లోపల, బయట కెమెరాలు
మొత్తం 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌టెలికాస్టింగ్
ఇప్పటి వరకు రూ.121 కోట్ల విలువైన నగదు, వస్తువుల జప్తు
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తుపై పోలీసు అబ్జర్వర్ల పర్యవేక్షణ
ప్రభుత్వ ఉద్యోగులు పాలనాంశాలపై మాట్లాడటం నిబంధనల ఉల్లంఘనే
సాక్షి, అమరావతి: రాజకీయాలకు అతీతంగా.. అత్యంత పారదర్శకంగా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపతి, శాసనసభ ఎన్నికలకు గవర్నర్ గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయిందని తెలిపారు. సచివాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల నుంచి అత్యధికసంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామనడానికి.. షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీకి చెందిన 126 మందిపైన, వైఎస్సార్‌సీపీకి చెందిన 136 మందిపైన కేసులు నమోదు చేయడమే నిదర్శనమని చెప్పారు. 12,459 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా పోలింగ్ గది లోపల, వెలుపల క్యూలైన్ల వద్ద వెబ్‌కెమెరాలు బిగించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఇంకా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తమ దృష్టికి తీసుకొస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌టెలికాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమ మద్యం సరఫరాను అరికట్టడానికి దేశంలోనే తొలిసారిగా జియోట్యాగింగ్‌తో రోజూ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మద్యం సరఫరా కేంద్రాల వద్ద వినియోగిస్తున్న ముడిపదార్థాల నుంచి ఉత్పత్తి గోడౌన్లు, అక్కడినుంచి షాపులు, బార్లకు వెళ్లేవరకు వాహనాలను నిరంతరం ట్రాక్‌చేసే విధంగా జియోట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
జప్తు నుంచి సాధారణ ప్రజలకు ఊరట
ఎన్నికల నిఘా సందర్భంగా జప్తుచేస్తున్న నగదు, వస్తువుల విషయంలో సాధారణ ప్రజలపై ఎఫ్‌ఆర్‌ఐలు నమోదు చేయడంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాజకీయపార్టీలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలతో సంబంధంలేని నగదు, వస్తువులు జప్తుచేసినప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా వెనక్కి ఇస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్ రోజూ రెండుసార్లు సమావేశమై ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.121.91 కోట్ల విలువైన నగదు, వస్తువులను జప్తు చేశామన్నారు. దీన్లో రూ.31.75 కోట్ల నగదు ఉందని, సరైన ఆధారాలు చూపించిన రూ.18 కోట్లను వెనక్కి ఇచ్చేశామని చెప్పారు.
వీఐపీల భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు కేంద్ర పోలీస్ అబ్జర్వర్ల పర్యవేక్షణలో కొనసాగుతోందని మీనా తెలిపారు. దర్యాప్తు వివరాలను రోజూ ఎన్నికల సంఘానికి అందజేస్తున్నారన్నారు. ఈ సంఘటన తర్వాత వీఐపీల ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఎస్పీలకు ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని, ఈసీఐ ఆదేశాల మేరకు ఆ ఉద్యోగుల వివరణ తీసుకుని పంపామని చెప్పారు. రాజీనామా చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లపై ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. వారిని ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోనీయకూడదంటూ రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. రాజీనామా చేసిన వలంటీర్లను ఏజెంట్లుగా అనుమతించకూడదంటూ ఇప్పటికే అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిపారు.
‘అరకు’లో పోలింగ్ సమయం కుదింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు మే 13వ తేదీ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలుగు, ఇంగ్లిషుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది.
రాష్ట్రంలో అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాలకు మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అరకు లోక్‌సభ పరిధిలో కొండ ప్రాంతాలున్నందున పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బంది తరలింపునకు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. చీకటిపడితే హెలికాప్టర్‌లో ఈవీఎంలను, సిబ్బందిని తిరిగి స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చడం కష్టమవుతుందని పోలింగ్ సమయాన్ని కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లందరికీ ఎంత సమయమైనా ఓటువేసే అవకాశం కల్పిస్తారు.
మే 5 నుంచి 10 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్లను పోస్టు ద్వారా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్‌లో వినియోగించుకోవాల్సి ఉంటుందని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు గతంలో వలే పోస్టు ద్వారా పంపడం కాకుండా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేవలం సర్విసు ఓటర్లు మాత్రమే పోస్టల్ ద్వారా బ్యాలెట్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.
బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిన తర్వాత మే 2వ తేదీ నుంచి మే 10 వరకు ఇంటివద్ద ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే విధంగా జిల్లా అధికారులు తేదీలను నిర్ణయిస్తారని చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, అంగవైకల్యం 40% దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కును మే 2 నుంచి మే 10వ తేదీలోగా, పోస్టల్ బ్యాలెట్‌ను మే 5 నుంచి మే 10వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఒక్కసారి ఇంటివద్ద ఓటుహక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.
10వ తేదీలోగా ఇంటింటి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేసే విధంగా ఎన్నికల సిబ్బంది రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందస్తు సమాచారం అందిస్తారని చెప్పారు. ఇద్దరు పోలింగ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్, భద్రతా సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 5.50 లక్షలమంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, వీరందరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు వంటి బయట వ్యక్తులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment